కోస్టుగార్డులో 300 కొలువులు

పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా విద్యార్హతలతో భారతీయ తీర రక్షకదళంలో కొలువు దీరే అవకాశం వచ్చింది. నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌, నావిక్‌ జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్టు గార్డు ప్రకటన విడుదలచేసింది.

Published : 20 Sep 2022 01:35 IST

పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా విద్యార్హతలతో భారతీయ తీర రక్షకదళంలో కొలువు దీరే అవకాశం వచ్చింది. నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌, నావిక్‌ జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్టు గార్డు ప్రకటన విడుదలచేసింది. ఈ మూడు విభాగాల్లోనూ మొత్తం 300 పోస్టులున్నాయి. రాత, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఆన్‌లైన్‌ పరీక్షలో నెగ్గినవారికి శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ వేతనంతో కెరియర్‌లో స్థిరపడాలనుకునేవారికి ఈ పోస్టులు మంచి అవకాశం!

ఇండియన్‌ కోస్టు గార్డు ఏడాదికి రెండుసార్లు నావిక్‌ (జనరల్‌ డ్యూటీ, డొమెస్టిక్‌ బ్రాంచ్‌), యాంత్రిక్‌ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌: ఈ విభాగంలో 40 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు.

నావిక్‌ జనరల్‌ డ్యూటీ: ఇందులో 225 ఖాళీలు ఉన్నాయి. వీటికి మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు.

యాంత్రిక్‌: ఈ పోస్టులకు ఎలక్ట్రికల్‌ / మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ (రేడియో/పవర్‌) విభాగాల్లో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసుకున్నవారు అర్హులు. మెకానికల్‌లో 16, ఎలక్ట్రికల్‌ 10, ఎలక్ట్రానిక్స్‌ 9 ఖాళీలు ఉన్నాయి.   .

వయసు: పై మూడు పోస్టులకూ 18 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే మే 1, 2001 - ఏప్రిల్‌ 30, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.


ఆన్‌లైన్‌ పరీక్ష ఇలా..

అన్ని పోస్టులకూ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. మొత్తం 5 సెక్షన్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ సెక్షన్‌-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు వస్తాయి. ఇందులో మ్యాథ్స్‌ 20, సైన్స్‌ 10, ఇంగ్లిష్‌ 15, రీజనింగ్‌ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. నావిక్‌ డొమిస్టిక్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ ఒక్క సెక్షన్‌ రాసుకుంటే సరిపోతుంది.

నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులవాళ్లు సెక్షన్‌ 1తోపాటు అదనంగా సెక్షన్‌ 2 రాయాలి. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్‌ సిలబస్‌ నుంచి మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.

యాంత్రిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్‌ 1తోపాటు సెక్షన్‌ 3, 4, 5ల్లో తాము చదివిన బ్రాంచీ ప్రకారం ఏదో ఒకటి రాయాలి. ఎలక్ట్రికల్‌ విభాగంవాళ్లు సెక్షన్‌ 3, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచీవాళ్లు సెక్షన్‌ 4, మెకానికల్‌ డిప్లొమా విద్యార్థులు సెక్షన్‌ 5 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో సెక్షన్‌ 50 మార్కులకు చొప్పున ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి వ్యవధి 30 నిమిషాలు. సంబంధిత బ్రాంచీలవారీ డిప్లొమా సిలబస్‌ నుంచే ఈ ప్రశ్నలు అడుగుతారు.

అభ్యర్థులు సెక్షన్లవారీ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్‌ విభాగానికి చెందినవారైతే సెక్షన్‌ 1లో 30, మిగిలిన సెక్షన్లలో 20 చొప్పున మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్‌ 1లో 27, మిగిలిన సెక్షన్లలో 17 మార్కులు చొప్పున పొందితే అర్హులుగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్‌ 2కు ఎంపిక చేస్తారు.    

స్టేజ్‌ 2 పరీక్షలు ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ.దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్స్‌ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి.

స్టేజ్‌ 3 ఎంపిక స్టేజ్‌ 1, స్టేజ్‌ 2లో చూపిన ప్రతిభ ప్రకారం ఉంటుంది. స్టేజ్‌ 2లో అర్హత సాధించినవారిని స్టేజ్‌ 1 మెరిట్‌తో స్టేజ్‌ 3కి పిలుస్తారు. వీరికి ఐఎన్‌ఎస్‌ చిల్కలో మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరతారు. స్టేజ్‌ 4లో భాగంగా అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు పరిశీలించి అన్నీ సరిగా ఉంటే శిక్షణకు తీసుకుంటారు.  


శిక్షణ, వేతనం..

నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌, జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ విభాగాలవారికి ప్రాథమిక శిక్షణ మే, 2023 నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్‌ శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.

* యాంత్రిక్‌ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.29,200 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.6200 యాంత్రిక్‌ పే ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వీరు సుమారు రూ.50,000 వరకు అందుకోవచ్చు.. పదోన్నతుల ద్వారా అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ హోదా వరకు చేరుకోవచ్చు.

* నావిక్‌ పోస్టుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని వీరు రూ.35 వేలకుపైగా వేతన రూపంలో పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకు చేరుకోవచ్చు.
నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచీకి ఎంపికైనవారు కుక్‌, స్టివార్డ్‌ సేవలు అందిస్తారు. నావిక్‌ జీడీ విభాగంలో చేరినవారు వారికి కేటాయించిన ట్రేడుల్లో విధులు నిర్వర్తించాలి. యాంత్రిక్‌ ఉద్యోగులు షిప్‌ నిర్వహణ, మరమ్మతులు వారి డిప్లొమా బ్రాంచీల ప్రకారం చూసుకుంటారు.


ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెప్టెంబరు 22 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు.

ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.

పరీక్షలు: స్టేజ్‌ 1 నవంబరులో నిర్వహిస్తారు.స్జేజ్‌ 2 జనవరి, 2023లో, స్టేజ్‌ 3 ఏప్రిల్‌ చివర లేదా మే ప్రారంభంలో ఉంటాయి.

స్టేజ్‌ 1 పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ.

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని