Updated : 28 Sep 2022 06:33 IST

కోటి కొలువులిచ్చే విద్యుత్‌ వాహనాలు!

ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు అవకాశాలు

కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వశాఖ తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి విద్యుత్‌ వాహనాల తయారీ పరిశ్రమ మన దేశంలో ప్రత్యక్షంగా కోటి, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించనుంది! ఇందులో అత్యధికం ఇంజినీరింగ్‌ అభ్యర్థులకే అందనున్నాయి. మరి ఈ ఉద్యోగాలను అందుకోవాలంటే ఎలాంటి నైపుణ్యాలు కావాలో, ఈ పరిశ్రమ గురించి పూర్తి వివరాలేంటో చూద్దామా!

భారత్‌లో విద్యుత్‌ వాహనాల తయారీ పరిశ్రమ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. పర్యావరణ పరిరక్షణ, ఇతర అంశాల కోణంలో ప్రభుత్వం సైతం ఇందుకు సహాయ సహకారాలు అందిస్తోంది. మన రోడ్లపై తిరిగే వాహనాల్లో 2030 నాటికి 30 శాతం విద్యుత్‌ వాహనాలే ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ-కామర్స్‌ కంపెనీలు, కార్లు-బైకుల ఉత్పత్తిదారులు, యాప్‌ సాయంతో పనిచేస్తున్న రవాణా సంస్థలు... ఇప్పటికే ఈ-వాహనాలను వినియోగిస్తున్నాయి. బ్యాటరీ ధరలు తగ్గడం, చార్జింగ్‌ స్టేషన్లకు ప్రత్యేకంగా అనుమతులేవీ అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం... పరిశ్రమకు అనుకూలించే విషయాలు. దీనిద్వారా మరింత మందికి ఈ వాహనాలు చేరువకానున్నాయి.

*  ప్రధాన నగరాలన్నింటిలోనూ ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ ఇంజినీర్లు, టెక్నీషియన్లు, పరిశోధకులు, సిబ్బంది.. ఇలా అన్ని విభాగాల్లో నిపుణుల అవసరం ఉంది. సరైన అవగాహన, శిక్షణతో మీరూ ప్రయత్నించవచ్చు.  విద్యుత్‌ వాహనాల తయారీ రంగంలో కెరియర్‌ను ఆశిస్తున్న విద్యార్థులు ముందు ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి.

*  ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) పరిశ్రమలో విభిన్న గ్రూపుల నుంచి ఇంజినీర్లు అవసరం అవుతారు. కెమికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, సాఫ్ట్‌వేర్‌... ఇలా వివిధ విభాగాల వారి సేవలు కావాలి. అందుకే వీటిపై మొత్తంగా ఒక అంచనా ఉండేలాంటి మెకట్రానిక్స్‌ గ్రూప్‌ చదివిన వారిని ప్రస్తుతం ఎక్కువగా ఈ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఈవీ రక్షణ, సాఫ్ట్‌వేర్‌, మోటార్‌ కొలాబరేషన్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ డిజైన్‌ వంటి డొమైన్లలో నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను ఈ పరిశ్రమ వెతుకుతోంది.


ఈ కెరియర్‌ గురించి మాట్లాడగానే ఎవరికైనా మొట్టమొదట నాలుగు సందేహాలు వస్తాయి. అవేంటంటే...

1. ఈవీ పరిశ్రమలో ఏ ఉద్యోగాలున్నాయి?

2. ఈ కెరియర్‌లోకి ప్రవేశించడం ఎలా?

3. ఇప్పటికే ఐసీఈ వాహనాల తయారీలో ఉన్నవారు ఈవీలోకి మారడం ఎలా?

4. విజయవంతంగా ఈవీలో రాణించాలంటే నైపుణ్యాలకు ఎలా మెరుగుపెట్టాలి?

ఇప్పుడు వీటికి సమాధానాలు చూద్దాం.

1 రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, మెయింటెనెన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సౌకర్యాల కల్పనలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

ఏ గ్రూప్‌ వారికి ఏ పని?

కెమికల్‌: లిథియమ్‌ ఐయాన్‌ సెల్స్‌ తయారీ, బ్యాటరీ ప్యాక్స్‌ తయారీ లేదా అసెంబ్లింగ్‌, పాత బ్యాటరీలను రీసైకిల్‌ చేయడం వంటి పనులుంటాయి.

ఎలక్ట్రికల్‌: బ్యాటరీలను పరీక్షించడం, మోటార్ల నాణ్యత అంచనా వేయడం, చార్జింగ్‌ ప్రక్రియకు సిద్ధం చేయడం.

కంప్యూటర్‌ సైన్స్‌: బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టం (బీఎంఎస్‌)కు అల్గారిథమ్‌ అభివృద్ధి చేయడం, ఐవోటీ మాడ్యూల్స్‌ తయారు చేయడం, బీఎంఎస్‌ శక్తిమంతంగా పనిచేసేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: బీఎంఎస్‌కు ఫర్మ్‌వేర్‌ తయారుచేయడం, ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం అభివృద్ధి, సెన్సార్లను తయారుచేసి వాహనంలో అమర్చడం.

మెకట్రానిక్స్‌: వాహనం డిజైన్‌, విడిభాగాలు కలిపేందుకు రోబోటిక్స్‌ ఉపయోగించడం, పవర్‌ట్రైన్‌ కాంపొనెంట్‌ అభివృద్ధి.

2 ప్రాజెక్టుల ద్వారా...

దేశవ్యాప్తంగా కాలేజీ విద్యార్థులు చాలా మంది తమ ప్రాజెక్టుల్లో భాగంగా విద్యుత్‌ వాహనాలు తయారుచేస్తున్నారు.

దీని ద్వారా చదువుకుంటున్న సమయంలోనే వీటిపై అవగాహన, ఆసక్తి పెరుగుతుంది. అనంతరం ఇంటర్న్‌షిప్‌లు, రిసెర్చ్‌ ప్రాజెక్టులు, టీచింగ్‌ ఫెలోషిప్‌ల ద్వారా ప్రొఫైల్‌ను ఆసక్తికరంగా మార్చుకోవచ్చు. తదుపరి ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఆన్‌లైన్‌ కోర్సులు, ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ల గురించి నేర్చుకోవడం మరింత ఉపకరిస్తుంది.

3 ఇప్పటికే ఆటోమొబైల్‌ రంగంలో ఉన్నవారైతే...

ఈవీ పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇప్పటికే ఆటోమొబైల్‌ రంగంలో పనిచేస్తున్న నిపుణులు సైతం ఇందులోకి మారడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వీరి గతానుభవం ఎంతో పనికొస్తుంది. అయితే కొత్తగా వచ్చిన ఈవీ గురించి ప్రాథమిక అంశాల నుంచి   నేర్చుకోవడం తప్పనిసరి. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌లో మౌలికాంశాలను రివిజన్‌ చేసుకోవాలి.   ఇందుకోసం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ కోర్సులను ఆశ్రయించవచ్చు.

* ఆటోమోటివ్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ), ఆటోమోటివ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఏఎస్‌డీసీ), సెంట్రల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌టీఏఆర్‌ఐ) ఆమోదం పొందిన కోర్సులను ఎంచుకోవడం ద్వారా మెలకువలు తెలుసుకోవడమే కాకుండా ధ్రువపత్రాలనూ అందుకోవచ్చు.

4 నైపుణ్యాలకు మెరుగులు..

ఈవీ పరిశ్రమలోకి ప్రవేశించి, విజయవంతమైన కెరియర్‌ను అందుకోవడానికి ఇప్పుడు ఎన్నో ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంట్రడక్షన్‌ టు ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఎన్‌పీటీఈఎల్‌, యుడెమీ), ఇంట్రడక్షన్‌ టు బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టం (కోర్సెరా) వంటివి నేర్చుకోవడం ద్వారా సమాచారం తెలుసుకోవడమే కాకుండా, మొత్తంగా వీటిపై అవగాహన ఏర్పడుతుంది. అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఈ-వెహికల్‌ టెక్నాలజీ (ఐఐటీ దిల్లీ), పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మోటర్స్‌ ఫర్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఐఐటీ ముంబయి) కోర్సులతో ఉద్యోగాల్లో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంది.

* ఏన్‌సిస్‌, క్రెయో, జీవోఎం ఇన్‌స్పెక్ట్‌ వంటివి ఈ పరిశ్రమలో తరచూ ఉపయోగించే సాఫ్ట్‌వేర్లు. వీటిని అధ్యయనం చేయడం వల్ల ఇంటర్వ్యూలకు వెళ్లే సమయంలో అదనపు అర్హతగా పనికొస్తాయి.


* నిజానికి ఈ రంగం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నది కావడం వల్ల... సంప్రదాయ కోర్సుల్లో దీని గురించి చదువుకునే అవకాశాలు కాస్త తక్కువగానే ఉన్నాయి.

* బీటెక్‌ మెకానికల్‌లో ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వెహికల్స్‌ కలిపి కొన్ని కళాశాలలు కోర్సులు అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో అయితే పేరొందిన కోచింగ్‌ సంస్థలు, ఈవీ కంపెనీలు ఈ శిక్షణ తరగతులను ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నాయి.

* మేకర్‌ మాక్స్‌, కాడ్‌ సెంటర్‌ వంటి కొన్ని కంపెనీలు లైవ్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాయి. దేశంలో ప్రముఖ సంస్థల ఉద్యోగులు సైతం ఈ క్లాసులకు హాజరై నూతన  మెలకువలు నేర్చుకుంటున్నారు. కొత్తవారూ వీటిని ప్రయత్నించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని