సత్వర అవకాశాలకు.. ఫిజియో థెరపీ దారి!

ప్రమాదాలు, రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నవారు ఫిజియోథెరపీతో సాంత్వన పొందుతున్నారు. ఆధునిక జీవన శైలి, వివిధ వృత్తుల పనివిధానం దీని ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి.

Published : 29 Sep 2022 00:57 IST

ప్రమాదాలు, రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నవారు ఫిజియోథెరపీతో సాంత్వన పొందుతున్నారు. ఆధునిక జీవన శైలి, వివిధ వృత్తుల పనివిధానం దీని ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. నొప్పులు, శస్త్ర చికిత్సల నుంచి కోలుకోవడానికి వైద్యులు సిఫారసు చేస్తుండటంతో ఫిజియోథెరపిస్టులకు గిరాకీ పెరిగింది. ఏదో ఒక ఇబ్బందితో ఫిజియో థెరపిస్టులను సంప్రదించడం ఇప్పుడు సాధారణమైంది. ఇంటర్‌ తర్వాత ప్రాధాన్యమున్న కోర్సుల్లో ఒకటైన ఫిజియోథెరపీపై ఆసక్తి ఉన్నవారు దీనిలో శిక్షణ పొందడానికి అడుగులేయవచ్చు.

శాస్త్రీయ పద్ధతులు, వ్యాయామాలు, ఉపకరణాల ద్వారా ఫిజియోథెరపిస్టులు శరీర అవయవాలను పూర్వస్థితికి తీసుకురావడానికి కృషి చేస్తారు. పుట్టుకతో వచ్చే వైకల్యం, జీవనశైలి, వృత్తి నేపథ్యాల కారణంగా వస్తోన్న నొప్పులు, ఆటలు, ప్రమాదాల వల్ల ఏర్పడిన గాయాలు ... మొదలైన ఇబ్బందుల నుంచి వీలైనంత ఉపశమనం కలిగించడమే ఫిజియోథెరపిస్టుల ప్రధాన కర్తవ్యం. దేశంలో సుమారు 2 శాతం మంది ఏదో ఒక వైకల్యంతో బాధ పడుతున్నారని అంచనా. వైద్య మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి పదివేల మందికీ ఒక ఫి‡జియోథెరపిస్టు ఉండాలి. మనదేశంలో అంతమంది సుశిక్షితులు లేరు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరి నిలదొక్కుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులు, ఒకేషనల్‌ కోర్సుల అనంతరం బయాలజీ బ్రిడ్జి కోర్సు పూర్తిచేసుకున్నవాళ్లు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)లో చేరవచ్చు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి ప్రయత్నించవచ్చు. ఆసక్తి ఉన్నవారు కోరుకున్న స్పెషలైజేషన్‌తో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ) పూర్తిచేసుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ దిశగానూ అడుగులేయవచ్చు.

కోర్సు ఇలా...
ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యలో భాగంగా ఫిజియో థెరపీ కోర్సు పూర్తిచేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్‌ ఫిజియోథెరపీ (డీపీటీ)నీ కొన్ని సంస్థలు అందిస్తున్నాయి అయితే వీటిË ప్రాధాన్యం, పరిధి తక్కువ. ఫిజియోథెరపిస్టుగా సేవలు అందించాలని ఆశించేవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) పూర్తిచేసి, లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మరో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. బోధన అంతా ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. కోర్సులో భాగంగా.. మానవ శరీర నిర్మాణం, వివిధ అవయవాల పనితీరు తెలుసుకుంటారు. అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకాలజీ, మెడికల్‌, సర్జికల్‌ కండిషన్లు, బయోమెకానిక్స్‌, కైనిసియాలజీ, డిజేబిలిటీ ప్రివెన్షన్‌, రిహాబిలిటేషన్‌...మొదలైనవాటి గురించి నేర్చుకుంటారు.
ఈ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్‌ రెండింటికీ ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో అంతర్గతంగా ఉన్న ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. కోర్సు చదువుతున్నప్పుడే ఫిజియాలజీ, అనాటమీ, ఎక్సర్‌సైజ్‌ థెరపీ, ఎలక్ట్రోథెరపీ విభాగాలపై పట్టు సాధించాలి. కోర్సు పూర్తయిన తర్వాత విధుల్లో భాగంగా సమస్యలు ఉన్నవారికి ఉష్ణం, విద్యుత్తు, యాంత్రిక ఒత్తిడి, యాంత్రిక శక్తి, కొన్ని రకాల వ్యాయామాలు, పరికరాలను ఉపయోగించి ఉపశమనం దిశగా వీరు కృషి చేస్తారు.

నైపుణ్యాలు
ప్రతి వృత్తిలోనూ ప్రత్యేక నైపుణ్యాలు తప్పనిసరి. ఫిజియోలకు ముఖ్యంగా శారీరక దృఢత్వం ఉండాలి. కొన్ని సార్లు గంటలపాటు, పలు పద్ధతుల్లో, విడతలవారీ వ్యాయామాలు(థెరపీ) చేయించాలి. ఇలా చేయడానికి ఓపిక, శారీరక సన్నద్ధత అవసరం. వైద్యులతో అనుసంధానమవుతూ, వాళ్ల సూచనలు పరిగణనలోకి తీసుకుని, అవసరాలకు తగ్గ సేవలు అందించాలి.

నొప్పి కారణంగా రోగులు ఫిజియోథెరపీకి విముఖత చూపవచ్చు. అందువల్ల వారికి థెరపీ ప్రాధాన్యాన్ని వివరించి, ఒప్పించగలిగే నైపుణ్యం ఉండాలి. మాటలతోనూ కొంత మానసిక సాంత్వన కలిగేలా చూడాలి. సహనం, సేవాభావం ఉన్నప్పుడే సమర్థ ఫిజియోథెరపిస్టుగా రాణించడానికి వీలవుతుంది. పేరు పొందడానికి కొన్నేళ్లు పడుతుంది. నైపుణ్యాలు పెంపొందించుకున్నవారు బాగా రాణించగలరు.

ఉన్నత విద్య
బీపీటీ తర్వాత మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ)లో చేరవచ్చు. కోర్సు వ్యవధి రెండేళ్లు. పీజీలో నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. మస్కులోస్కెలిటల్‌ సైన్సెస్‌, కార్డియో వాస్కులర్‌ అండ్‌ పల్మనరీ సైన్సెస్‌, న్యూరో సైన్సెస్‌, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్స్‌, ఆబ్సెస్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, జెరియాట్రిక్స్‌, కమ్యూనిటీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్‌ ఫిజియో థెరపీ...మొదలైన వాటిలో ఏదైనా తీసుకోవచ్చు. వీటిని పూర్తిచేసుకున్నవారు సంబంధిత విభాగాల్లో స్పెషలిస్టు సేవలు అందించవచ్చు. ఉదాహరణకు న్యూరో సైన్సెస్‌లో ఎంపీటీ పూర్తిచేసుకున్నవారు న్యూరో ఫిజీషియన్‌, న్యూరో సర్జన్‌లకు అనుబంధంగా కొనసాగవచ్చు. ఎంపీటీ అనంతరం ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీలో చేరవచ్చు. మేటి అవకాశాలకు పీజీ, బోధనలో రాణించడానికి పీహెచ్‌డీ ఉపయోగపడతాయి. ఫిజియో థెరపీ కోర్సులన్నింటికీ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజియోథెరపిస్ట్స్‌ (ఐఏపీ) అపెక్స్‌ బాడీగా వ్యవహరిస్తోంది.

అర్హతలు
ఇంటర్‌ బైపీసీ లేదా ఒకేషనల్‌ (ఫిజియోథెరపీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌తోపాటు బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసినవారు, ఏపీ/ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు డిసెంబరు 31, 2022 నాటికి 17 ఏళ్లు నిండాలి.


ఉద్యోగాలు

బీపీటీ పూర్తిచేసుకున్నవారికి ఎక్కువగా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఎంపీటీ విద్యార్హతతో స్పెషాలిటీ విభాగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. రిహాబిలిటేషన్‌ కేంద్రాలు, పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్లు, ప్రత్యేక పాఠశాలలు, విమెన్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, పాలీ క్లినిక్‌లు, ఓల్డేజ్‌ హోంలు, హోం కేరింగ్‌, దివ్యాంగులకు సేవలందించే కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్‌ హోంలు/ ప్రైవేటు కేర్‌ సెంటర్లు, కార్పొరేట్‌ సంస్థలు, స్పోర్ట్స్‌ అకాడెమీలు, ఫిట్‌నెస్‌ సెంటర్లలో అవకాశాలు లభిస్తాయి.
కెరియర్‌ ప్రారంభంలో వేతనం తక్కువగానే అందుతుంది. కొంచెం అనుభవం పొందిన తర్వాత సొంత ప్రాక్టీస్‌ ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. సేవలందిస్తోన్న ప్రాంతం, థెరపీ విధానం బట్టి ఒక్కో సిట్టింగ్‌కూ రూ.500 వరకు పొందవచ్చు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ సేవలకోసమే ఏర్పాటయ్యాయి. నగరాలు, పట్టణాల్లో వీటిద్వారా ఉపాధి పొందవచ్చు. విషయపరిజ్ఞానం, ఆంగ్లంలో నైపుణ్యం ఉన్న ఫిజియో థెరపిస్టులు విదేశాల్లోనూ రాణించగలరు. యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తోపాటు పలు దేశాల్లో వీరికి గిరాకీ ఉంది. ఇలాంటి చోట్ల పెద్ద మొత్తంలో వేతనాలూ ఆశించవచ్చు.


తెలుగు రాష్ట్రాల్లో...

ఏపీ, తెలంగాణల్లో సుమారు 50కిపైగా కాలేజీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు అందుబాటులో ఉంది. ఏపీలో ఆంధ్రా యూనివర్సిటీ శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో పలు సంస్థలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఏపీలో హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ల ఆధ్వర్యంలో వీటిని నడుపుతున్నారు. ఇటీవలే తెలంగాణలో బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కుల మెరిట్‌తో ప్రవేశం లభిస్తుంది.

మేటి సంస్థలు
ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, ముంబై పండిట్‌ దీన్‌దయాళ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ ఫిజికల్‌ డిజేబిలిటీస్‌, న్యూదిల్లీ

పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, చండీగఢ్‌
క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ), వెల్లూరు
మణిపాల్‌ అకాడెమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, మణిపాల్‌
అపోలో కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, హైదరాబాద్‌
నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌), హైదరాబాద్‌
శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) తిరుపతి  
క్రిష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌), సికింద్రాబాద్‌
యశోదా..అకాడెమీ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, హైదరాబాద్‌
గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం
(ఈ సంస్థలన్నీ ఇంటర్మీడియట్‌ మార్కుల మెరిట్‌ లేదా ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటున్నాయి)

కేంద్రం ఆధ్వర్యంలో...
కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటివ్‌ డిజేబిలిటీస్‌ - కోల్‌కతా, స్వామీ వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ - కటక్‌, నేషనల్‌   ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజేబిలిటీస్‌ - చెన్నై ఉమ్మడి పరీక్ష ద్వారా ఫిజియో థెరపీ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి.
ఈ మూడూ జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు