Published : 29 Sep 2022 00:57 IST

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌... ఇలా అవ్వొచ్చు!

ఆర్థికరంగంపై అవగాహన ఉన్నవారికి... స్వశక్తితో ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి... ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ చక్కని కెరియర్‌ ఆప్షన్‌. గ్రాడ్యుయేషన్‌, ఆపైన అర్హతతో ప్రవేశించే అవకాశం ఉన్న ఈ రంగంలో... మంచి నైపుణ్యాలు కలిగిన వారిప్రయాణం నల్లేరుపై బండి నడకే! ప్రతిరోజూ కొత్త సవాళ్లతో ఉత్సాహంగా అనిపించే ఈ విభాగంలో అడుగుపెట్టాలంటే...

ప్రస్తుత కార్పొరేట్‌ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అలాగే వాటిని ప్రోత్సహించే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లకు కూడా అంతే డిమాండ్‌ ఉంది. సంస్థ మనుగడలో ప్రధాన భూమిక పోషించే వీరికి అధిక వేతనాలతో ఆశాజనకమైన కెరియర్‌ ఆహ్వానం పలుకుతోంది. కావాల్సినదల్లా అర్హత, తిరుగులేని నైపుణ్యాలు మాత్రమే!

ఏం చేస్తారు?
ఏదైనా బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల ఫైనాన్స్‌, పెట్టుబడి నిర్ణయాలు - అవకాశాలను డీల్‌ చేసే నిపుణులను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు అంటున్నాం. తమ క్లయింట్‌ కోసం ఫండ్‌ వృద్ధి చేయడం, అభివృద్ధికి సహకారం అందించడం... మొత్తంగా సంస్థ ఆర్థిక స్థిరత్వానికి సహకారం అందించడం వీరి ప్రధాన విధి. యాజమాన్యానికి వీరిచ్చే సలహాలు, సేవలు సంస్థ పురోభివృద్ధికి తోడ్పడేలా ఉండాలి. ఏ కంపెనీకైనా ఆర్థిక అంశాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి సంస్థలో వీరి పాత్ర కీలకంగా ఉంటుంది.

ఎలాంటి నైపుణ్యాలు కావాలి?
ఇది సులభంగా ఒకచోట కూర్చుని చేసే ఉద్యోగం కాదు. రకరకాలైన నైపుణ్యాలు అవసరమవుతాయి. గ్రాడ్యుయేషన్‌ - ఆపైన విద్యార్హత, నెట్‌వర్క్‌ను పెంచుకునే సామర్థ్యం, అవతలివారిని ఒప్పించగలిగే నైపుణ్యం, చక్కటి కమ్యూనికేషన్‌... ఇలా వివిధ రకాలైన మెలకువలతో పనిచేయాల్సి ఉంటుంది. ఎంత బాగా అంచనాలను అందుకుంటే... అంత త్వరగా ఈ రంగంలో దూసుకెళ్లగలుగుతారు.

* ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు చాలావరకూ బీకాం గ్రాడ్యుయేట్లను ఇందుకోసం నియమించుకుంటుంటే... టాప్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు మాత్రం ఎంబీఏ - ఫైనాన్స్‌ చేసిన వారికే తొలి ఓటు వేస్తున్నాయి. కనీస డిగ్రీ నుంచి సీఏ చేసిన వారి వరకూ సంస్థ స్థాయిని బట్టి రిక్రూట్‌ చేసుకుంటున్నా... బిజినెస్‌, ఫైనాన్స్‌, ఎకనమిక్స్‌, మ్యాథ్స్‌పై పట్టున్నవారు ఇందులో ఇతరులకంటే ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది.

కోర్సులున్నాయ్‌...
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి పీజీసీపీఐబీ (పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌) కోర్సు  ఉంది. అలాగే నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) అకాడమీ ఫైనాన్షియల్‌ మోడలింగ్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటి సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌ అందిస్తోంది. ఎంబీఏ ఇన్‌ డిజిటల్‌ ఫైనాన్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌, ఇతర ఆన్‌లైన్‌ కోర్సుల్లోనూ చేరడం ద్వారా మెరుగైన నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు.

ఇంటర్న్‌షిప్‌తో మెరుగులు
కొన్ని ఉద్యోగాలకు ఇంటర్న్‌షిప్‌ చేయడం చాలా ఉపకరిస్తుంది. ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కూడా అలాంటిదే. ఆన్‌లైన్‌లో ఇంటర్న్‌శాల, ఇండీడ్‌ లాంటి వెబ్‌సైట్ల ద్వారానూ, నేరుగా బ్యాంకుల నుంచి, ప్రాంగణ ఎంపికల్లోనూ, నెట్‌వర్కింగ్‌, హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీల ద్వారా ఈ ఇంటర్న్‌షిప్‌లు అందుకోవచ్చు. సాధారణంగా వీటి కాలవ్యవధి రెండు నెలల నుంచి రెండేళ్ల వరకూ ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థి కమ్యూనికేషన్‌, ప్రెజెంటేషన్‌, నెగోషియేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలి. తద్వారా ఉన్నత శ్రేణి సంస్థలో స్థిరమైన ఉద్యోగంలో కొలువుదీరొచ్చు.

జీతాలు ఇలా..
దేశవ్యాప్తంగా సగటున  ఇన్వెస్ట్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ జీతం ఏడాదికి ఆరు లక్షల రూపాయలతో మొదలవుతోంది. పనిచేస్తున్న ప్రాంతం, సంస్థ, అభ్యర్థి నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి ఇందులో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ సంపాదిస్తున్నవారూ ఉన్నారు. అందువల్ల ప్రతిభ ఉంటే ఇందులో రాణించడం అంత కష్టమేం కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని