ఏఐ - ఎంఎల్‌కు ఎందుకింత ప్రాముఖ్యం?

నూతన సాంకేతిక కోర్సుల్లో విద్యార్థుల ఆదరణ పొందుతూ దూసుకుపోతోంది... ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐ- ఎంఎల్‌). ఇంటర్నెట్‌ టెక్నాలజీ తరువాత అంతకంటే ఎక్కువ స్థాయిలో సమాజంపై ప్రభావం చూపి, కొత్త తరహా ఉద్యోగాలకు ఆస్కారమిచ్చిన నూతన టెక్నాలజీ ఇది. వీటిని జంట టెక్నాలజీలుగా వ్యవహరించడం సరి కాదు.

Updated : 03 Oct 2022 07:03 IST

నూతన సాంకేతిక కోర్సుల్లో విద్యార్థుల ఆదరణ పొందుతూ దూసుకుపోతోంది... ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐ- ఎంఎల్‌). ఇంటర్నెట్‌ టెక్నాలజీ తరువాత అంతకంటే ఎక్కువ స్థాయిలో సమాజంపై ప్రభావం చూపి, కొత్త తరహా ఉద్యోగాలకు ఆస్కారమిచ్చిన నూతన టెక్నాలజీ ఇది. వీటిని జంట టెక్నాలజీలుగా వ్యవహరించడం సరి కాదు. ఏఐ అన్ని రంగాలకూ అన్వయింపదగిన విజ్ఞాన శాస్త్ర విషయం. మెషిన్‌ లెర్నింగ్‌ దాని వెనుకున్న సాంకేతిక జ్ఞానం.

ప్రభుత్వం, పరిశ్రమలు డిజిటలైజేషన్‌కు నీరాజనాలు పట్టడంతో వివిధ సంక్షేమ పథకాలు, సేవలు, వ్యాపార పద్ధతులు, ప్రజల జీవన విధానం విప్లవాత్మక మార్పులు చెందాయి. ఇలాంటి సేవల సమర్థ అమలు, నిర్వహణ కోసం సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ఇలాంటి నిష్ణాతులను పరిశ్రమల అవసరానికి ఈ స్పెషలైజేషన్‌లో అందించే రంగం ఇంజినీరింగ్‌. బీటెక్‌ స్థాయిలో ఏఐ-ఎంఎల్‌ను దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలూ అందిస్తున్నాయి. 

కంప్యూటర్ల వినియోగానికి సంబంధించిన ప్రయోగాలను వివిధ రంగాలకు విస్తరిస్తూ కంప్యూటర్ల సామర్థ్యాన్ని కూడా ఎన్నోరెట్లు పెంచారు. అదే సమయంలో వాటి పరిమాణమూ చిన్నదవుతూ వస్తోంది. కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలోని ఉపభాగమైన కృత్రిమ మేధ (ఏఐ) రంగం కంప్యూటర్లను మనుషుల్లాగా వివేకంతో కూడుకున్నవిగా రూపొందించడానికి సహాయపడుతుంది. 

గత 5- 10 సంవత్సరాల్లో డేటా మైనింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ లాంటి బిగ్‌-డేటా ఆధారిత కృత్రిమ మేధకు సంబంధించిన టెక్నాలజీల ఆవిష్కరణలు జరిగాయి. భారీ డేటాబేస్‌ల వినియోగం ద్వారా సైనిక, రక్షణ, వైద్య, ఆరోగ్య సంరక్షణ, మందుల తయారీ, ఫార్మసీ, జన్యు శాస్త్రం, జీనోమ్‌ల అభివృద్ధి లాంటి ఎన్నో రంగాల్లో మనుషుల స్థాయిలో కంప్యూటర్లు నిర్ణయాలు తీసుకోవాలంటే, కంప్యూటర్లకు కూడా మనుషుల మాదిరి ఆలోచించి సమయానుకూల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి. దీనికి  కృత్రిమ మేధ అవసరం చాలా ఉంది. మున్ముందు కృత్రిమ మేధ అవసరం, వినియోగం కూడా భారీస్థాయిలోనే ఉండబోతోందని అంచనా. 

ఏఐ అనువర్తనాలు 

వివిధ రంగాల్లో కృత్రిమమేధ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. 

1. గేమింగ్‌: చదరంగం, వివిధ రకాల జూదం, గడులు నింపే ఆట (టిక్‌-టాక్‌-టో)ల్లో ఎన్నో రకాల ప్రత్యామ్నాయాలతో కూడిన సంభావ్యతలుంటాయి. ఈ ఆటల అభివృద్ధిలో ఏఐ ముఖ్యపాత్ర వహిస్తుంది.
2. సహజ భాషా ప్రక్రియ (నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌): మనుషులు మాట్లాడే తీరును అర్థం చేసుకుని మనుషుల స్థాయిలో ’సంభాషించ గలిగిన’ కంప్యూటర్‌ వ్యవస్థ రచనకు సంబంధించినదీ రంగం.
3. నిపుణ వ్యవస్థ: యంత్రం, సాఫ్ట్‌వేర్‌, అదనపు ప్రత్యేక సమాచారాల ఆధారంగా నిపుణుల లాగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని, సూచనలు, నిర్ణయాలు అందించే వ్యవస్థల అభివృద్ధికి సంబంధించిన రంగమిది.
4. దార్శనిక వ్యవస్థ: దృశ్య రూపంలో ఉన్న ఇన్‌పుట్‌ను అర్థంచేసుకుని, అన్వయించి స్థూలంగా ఫలితాలను ఇచ్చే వ్యవస్థ ఇది. ఈ కోవలోకి వచ్చే కొన్ని నిజ జీవిత ఉదాహరణలు-

* గూఢచార వ్యవస్థకు సంబంధించిన చిత్రాల ఆధారంగా ప్రదేశాన్ని భౌతికంగానో, మ్యాప్‌లోనో గుర్తించడం.

* వైద్యులు రోగ లక్షణాలను కచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగపడే వ్యవస్థ.

* పోలీస్‌ శాఖలో ఫోరెన్సిక్‌ చిత్రకారుడు గీసిన చిత్రం వివరాల ఆధారంగా దోషుల ముఖాన్ని గుర్తుపట్టే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు  

5. ధ్వని గుర్తింపు: వివిధ మాండలికాల్లో పలికిన పదాలను విని, గుర్తించి, ఆ భాషలో అన్వయించి వాక్యాలు, అర్థం చెప్పగలిగిన కంప్యూటర్‌ వ్యవస్థలు. ఇవి మనిషి మాట్లాడే శబ్దంలోని మార్పులనూ పసిగట్టి మనిషిని గుర్తించగలవు.
6. చేతిరాతను గుర్తించడం: కంప్యూటర్‌ మానిటర్‌పై, కాగితం మీదనో, స్ట్టైలస్‌ పరికరంతోనో చేతి రాతనూ, పదాలనూ గుర్తించే వ్యవస్థ.  
7. వివేకవంతమైన రోబో: మనుషుల ఆదేశాలను అనుసరించి పని చేసే రోబో వ్యవస్థ. గాలి, వేడి, చలనం, ధ్వని, ఒత్తిడి లాంటి నిజజీవిత అంశాలను గ్రహించగలగిన సామర్థ్యం ఉన్న సెన్సర్లు, అధిక సామర్థ్యం ఉన్న ప్రాసెసర్‌, అతి పెద్ద మెమరీ వ్యవస్థతో వివేకాన్ని ప్రదర్శించగలవు. అదనంగా, పరిస్థితులకు అనుగుణమైన నిర్ణయాలు, తప్పులను సరిదిద్దుకునే సామర్థ్యమూ కలిగి ఉంటాయి.
8. ట్రాఫిక్‌ అంచనా: గూగుల్‌ మ్యాప్‌ లాంటి సాధనాల ద్వారా మన గమ్యానికి ట్రాఫిక్‌ లేని మార్గాన్ని కనుగొనటం. 

మనుషుల మేధను అనుకరించేందుకు మాత్రమే ఏఐని పెంపొందించలేదు. వివేకానికి సవాలుగా ఉన్న సమస్యలను పరిశీలించి ఉత్తమ పరిష్కారాలు రాబట్టడమే దీని లక్ష్యం. సాధారణ పరిస్థితుల్లో మనుషులు ఆలోచించని రీతిలోనూ కంప్యూటర్లను ఆలోచింపగలిగేలా చెయ్యడం కూడా ఏఐ పరిశోధకుల ప్రధాన లక్ష్యం. వీటికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అభివృద్ధి దీనిలోని ప్రధాన అంశం.

కెరియర్‌ మల్చుకోవాలంటే?  
దాదాపు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏఐ-ఎంఎల్‌ లో కనీసం ఒకదాన్ని అందిస్తున్నాయి. వీటిలో ఇంజినీరింగ్‌ కోర్సు ఎక్కువగా అందుబాటులో ఉంది.
ప్రధానంగా ప్రవేశ స్థాయిలోని ఉద్యోగాలకు డిగ్రీ ఉంటే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంజినీరింగ్‌ డిగ్రీ ఐతే ఇంకా మంచిది. అదే మధ్య స్థాయి, పైస్థాయి ఉద్యోగాలకు పీజీ/ డాక్టరేట్‌ ఉండాలి. 

కింది అంశాల్లో మెలకువలు అవసరం
* కంప్యూటర్‌ టెక్నాలజీ
* గణితంలోని ప్రతి శాఖపై మంచి పట్టు (బీజగణితం, ప్రాబబిలిటీ, కాల్‌క్యులస్‌, లాజిక్‌, అల్గారిథమ్స్‌)
* గ్రాఫిక్‌ మాడలింగ్‌  
* కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ (జావా, పైతాన్‌ లాంటివి)
* న్యూరల్‌ నెట్‌వర్క్స్‌  
* భౌతిక శాస్త్రం
* రోబోటిక్స్‌  
* కాగ్నిటివ్‌ సైన్స్‌ 

ఉద్యోగ అవకాశాలు  
* సాఫ్ట్‌వేర్‌ అనలిస్ట్‌, డెవలపర్‌
* కంప్యూటర్‌ సైంటిస్ట్‌, ఇంజినీర్‌
* అల్గారిథమ్‌ స్పెషలిస్ట్‌
* రిసెర్చి సైంటిస్ట్‌, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌
* మెకానికల్‌ మెయిన్‌టెనెన్స్‌ ఇంజినీర్‌  
* మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీర్‌
* రోబోటిక్‌ టూల్స్‌ ఉపయోగించే సర్జికల్‌ టెక్నీషియన్‌  
* కృత్రిమ అవయవాల, వినికిడి యంత్రాల, కృత్రిమ దృశ్య ఉపకరణాల వినియోగం తెలిసిన హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్‌  
* మిలిటరి, విమానయాన రంగంలో నైపుణ్యంతో సిమ్యులేటర్స్‌, డ్రోన్‌ వినియోగం తెలిసిన ప్రొఫెషనల్‌  
* డిజిటల్‌ మ్యూజిక్‌, గ్రాఫిక్‌ ఆర్ట్‌ డిజైనర్‌  
* ఆర్కిటెక్ట్‌
* మెషిన్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పర్ట్‌
* డేటా మైనింగ్‌ అనలిస్ట్‌

కొన్ని జాగ్రత్తలు  
అనేక సంస్థలు ఈ బ్రాంచీలో  స్టైపెండ్‌ ఆధారితంగానో, ఉచితంగానో ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఈ రంగంలో విజయవంతమైన కెరియర్‌ను ప్రారంభించే ఆసక్తి ఉన్న విద్యార్థి అందుబాటులో ఉండే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానం, సామర్థ్యం రెండూ అవసరమైన ఈ పోటీ యుగంలో ముందుకు సాగడానికి ప్రాజెక్టు పనులు చేయాలి. మౌలికాంశాల్లో దృఢంగా ఉండాలి. నేర్చుకున్న నైపుణ్యాలను అనువర్తించగలిగే సమర్థత ఉండాలి.
ఈ రంగం కొత్తదీ, లేబొరెటరీ వ్యవస్థ ఖర్చుతో కూడుకున్నదీ కావడంతో కోర్సు రుసుము అధికంగా ఉంటుంది. కోర్సులో చేరకముందే అన్నీ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, సంతృప్తి చెందాకే చేరడం మంచిది. ఎంతో చక్కగా నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నియామకాలకు సహాయం చేసే శిక్షణ సంస్థల్లో చేరటం మెరుగు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని