సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ అవుతారా!

భారత వాతావరణ శాఖ (India Meteorological Department) లో 990 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ/డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపికచేస్తారు.

Updated : 03 Oct 2022 07:01 IST

వాతావరణ శాఖలో  990  కొలువులు

భారత వాతావరణ శాఖ (India Meteorological Department) లో 990 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ/డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపికచేస్తారు. వీరు సుమారు రూ.60వేల వేతనం పొందవచ్చు. ప్రకటనకు సంబంధించి పూర్తి సమాచారం..

పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు విభాగాలుంటాయి. పార్ట్‌ -1లో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌.. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-2లో ఫిజిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ వీటిలో అభ్యర్థి ఎంచుకున్న విభాగం నుంచి వంద ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌-1, పార్ట్‌-2 ఒక్కో విభాగానికీ వందేసి మార్కులు కేటాయించారు. అన్ని ప్రశ్నలూ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ / హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు.


పోస్టు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌)

పే స్కేల్‌: ఏడో వేతన సంఘం లెవెల్‌-6 ప్రకారం చెల్లిస్తారు. అంటే ఉద్యోగంలో చేరినవారు రూ.35,400 మూలవేతనం అందుకోవచ్చు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు కలుపుకుని వీరి నెల జీతం సుమారు రూ.60 వేల వరకు ఉంటుంది.
అర్హత: డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఫిజిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఏదో ఒకటి చదివుండాలి. లేదా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేయాలి. డిగ్రీ లేదా డిప్లొమాలో ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. అలాగే 10+2 (ఇంటర్‌)లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. అంటే పదోతరగతి తర్వాత మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసినవాళ్లు, ఇంటర్‌ చదవకుండా నేరుగా డిగ్రీలో చేరినవాళ్లు అనర్హులు. వయసు: అక్టోబరు 18, 2022 నాటికి 30 ఏళ్లకు మించరాదు. అంటే అక్టోబరు 19, 1992 - అక్టోబరు 17, 2004 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠ వయసులో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు మినహాయింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 18
ఫీజు: రూ.వంద (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు)
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ద్వారా
పరీక్ష తేదీలు: డిసెంబరులో నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.
వెబ్‌సైట్‌: 
https://ssc.nic.in/


సిలబస్‌, సన్నద్ధత

* జనరల్‌ ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.
* జనరల్‌ ఇంటలిజన్స్‌: వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ రెండు రకాల ప్రశ్నలూ వస్తాయి. నంబర్‌ ఎనాలజీ, నంబర్‌ క్లాసిఫికేషన్‌, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్‌, నంబర్‌ సిరీస్‌, కోడింగ్‌ డీకోడింగ్‌, వర్డ్‌ బిల్డింగ్‌...మొదలైన విభాగాల నుంచి వీటిని అడుగుతారు. సంఖ్యలు, అంకెలపైనే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.  
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్‌, త్రికోణమితి అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌లో శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.
* జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే చాల వరకు ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్‌ సోషల్‌, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2022 నుంచి ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి. 

పార్ట్‌-2 అభ్యర్థి ఎంచుకున్న విభాగం నుంచి ఉంటుంది. ఆ విభాగాల వారీ ప్రశ్నలడిగే అంశాలను ప్రకటనలో పేర్కొన్నారు.

ఫిజిక్స్‌ తీసుకున్నవారు.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పాఠ్యాంశాలను ఇంటర్‌ స్థాయిలో బాగా చదవాలి. ఇందులో కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ చాప్టర్లు కూడా ఉన్నాయి. అకడమిక్‌ పుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. అనంతరం ఆ చాప్టర్ల నుంచి ఎంసెట్‌ స్థాయి ప్రశ్నలు సాధన చేస్తే వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందవచ్చు.

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వాళ్లు.. ప్రకటనలో పేర్కొన్న అంశాలను బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌/ బీసీఏ పాఠ్యపుస్తకాల నుంచి బాగా చదవాలి. అనంతరం విశ్వవిద్యాలయాలు ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ప్రశ్నపత్రాలను సాధన చేస్తే సన్నద్ధత ఉన్నతంగా ఉన్నట్లు భావించవచ్చు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ విభాగం వాళ్లు.. సంబంధిత బ్రాంచీలో డిప్లొమా పాఠ్యపుస్తకాలు బాగా చదివితే సరిపోతుంది. అనంతరం ఇదే బ్రాంచీకి చెందిన ఈసెట్‌ ప్రశ్నపత్రాలు సాధన చేస్తే సన్నద్ధత పూర్తయినట్లే.  


పాత, మాదిరి ప్రశ్నపత్రాలు

నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ ప్రకారం సన్నద్ధత కొనసాగించాలి. పాత, మాదిరి ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చో తెలుస్తుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఫలితాలు సమీక్షించుకోవాలి. 200 ప్రశ్నలు 2 గంటలు అంటే 120 నిమిషాలు. 7200 సెకన్లు. ప్రతి ప్రశ్నకు 36 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ల్లో  ప్రశ్నలకు ఈ వ్యవధిలో జవాబులు గుర్తించడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. సూత్రాలు ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధించాలి.

పార్ట్‌-1కు సంబంధించి ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలు సన్నద్ధతకు పనికొస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని