Published : 05 Oct 2022 00:03 IST

లిబరల్‌గా చదివేద్దామా!

ఇంటర్‌ తర్వాత..

మనం చదవాల్సిన కోర్సులు మనమే డిజైన్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఫిజిక్స్‌తోపాటు మ్యూజిక్‌ నేర్చుకోవడం సాధ్యమేనా? సైన్స్‌తో సైకాలజీనీ ఎంచుకోగలమా? మేజర్‌, మైనర్లను విభజించుకోడానికి వీలవుతుందా? వీటన్నింటికీ సమాధానమే లిబరల్‌ స్టడీస్‌. ఇప్పుడీ చదువులకు ఆదరణ పెరుగుతోంది. ఎన్నో విద్యాసంస్థలు యూజీలో భాగంగా వీటిని అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ అనంతరం ఆసక్తి ఉన్నవారు లిబరల్‌గా దూసుకుపోవచ్చు!

విద్యలో వైవిధ్యాన్ని ఇష్టపడేవారు లిబరల్‌ స్టడీస్‌లో చేరవచ్చు. మన దేశంలోనూ ఈ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ దృక్పథంతో స్థానికతను మేళవించి, వీటిని రూపొందించారు. విభిన్న సబ్జెక్టుల నుంచి నచ్చినవి ఎంచుకునే స్వేచ్ఛ లిబరల్‌ స్టడీస్‌లో దక్కుతుంది. వీటికోసమే ప్రత్యేకంగా కొన్ని విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఏర్పాటయ్యాయి. సృజనాత్మకంగా, ప్రభావంతంగా ఆలోచించడానికీ, సర్వతోముఖాభివృద్ధికీ లిబరల్‌ స్టడీస్‌ దారిచూపుతాయి. బహుముఖ నైపుణ్యాలు పెంపొందించడానికి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపరచుకోవడానికి ఈ చదువులు చక్కని వేదిక. పరిశోధన, విశ్లేషణ, సమస్య పరిష్కార, మాట, రాత నైపుణ్యాలనూ పెంపొందించుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడం, సరైన దిశలో ఆలోచించడానికీ ఈ చదువులు ఉపయోగపడతాయి.

ఈ కోర్సుల్లో ఫౌండేషన్‌లో భాగంగా పలు సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. అనంతరం విద్యార్థులు తమకు నచ్చినవి ఎంపిక చేసుకుని విద్య కొనసాగించవచ్చు. కోరుకున్న అంశాలను క్రమ పద్ధతిలో నేర్చుకోవచ్చు. కరిక్యులమ్‌లో మేజర్‌, మైనర్‌, ఫౌండేషన్‌..ఇలా విభాగాలు ఉంటాయి. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యమిస్తారు. యూజీ స్థాయిలో ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండు సెమిస్టర్లు దాదాపు ఉమ్మడి అంశాలనే బోధిస్తారు. ఆ తర్వాత నచ్చిన సబ్జెక్టులను మేజర్‌, మైనర్లుగా ఎంచుకోవచ్చు. వివిధ అంశాల్లో విస్తృత పరిజ్ఞానం కల్పించడం, ఎంచుకున్న అంశంలో లోతైన అవగాహన పెంపొందించడం, నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్‌గా, వాస్తవ ప్రపంచంలో అనువర్తించడం.. మొదలైనవి లిబరల్‌ స్టడీస్‌ ద్వారా సాధ్యమవుతాయి.
ఈ కోర్సులు అందించే సంస్థలు.. ప్రమాణాలు, వసతులు, బోధనలో మెరుగైనవి. అందువల్ల ఫీజు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే విద్యార్థి నైపుణ్యాలు, ఆర్థిక నేపథ్యాలను అనుసరించి కొన్ని సంస్థలు ఫీజు పూర్తిగా మినహాయిస్తున్నాయి లేదా రాయితీతో ప్రోత్సహిస్తున్నాయి. సంస్థను బట్టి ఏడాదికి సుమారుగా రూ.1.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ ఫీజు, వసతి, భోజనం కోసం చెల్లించాలి. రుణ సౌకర్యం ఉంది.

ప్రవేశం...
లిబరల్‌ స్టడీస్‌ అందించే సంస్థల్లో చేరడానికి ప్రవేశ పరీక్షలో ప్రావీణ్యం తప్పనిసరి. స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎస్‌ఏటీ) లేదా అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెస్టింగ్‌ (ఏసీటీ) స్కోరు ఉన్నవారికి మినహాయింపు. ఇవి లేనివారికి వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల్లో పరీక్ష నిర్వహిస్తారు. సంస్థలను బట్టి పరీక్ష విధానం, ప్రశ్నలడిగే అంశాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ), రికమెండేషన్‌ లెటర్లు, వ్యాసం దాదాపు అన్ని సంస్థలకూ తప్పనిసరి. ప్రవేశానికి అకడమిక్‌ ప్రతిభ, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌...మొదలైనవాటికీ ప్రాధాన్యం ఉంటుంది. మౌఖిక పరీక్ష అనంతరమే కోర్సులోకి తీసుకుంటారు. అశోకా, క్రియా, ఫ్లేమ్‌, ఓపీ జిందాల్‌, క్రిస్ట్‌, సింబయాసిస్‌, శివనాడార్‌, అజీం ప్రేమ్‌జీ, ఎస్‌ఆర్‌ఎం, బెన్నెట్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ ... తదితర సంస్థలు ఈ చదువుల్లో పేరుగడించాయి. పేరున్న సంస్థల్లో చదివినవాళ్లు యూజీ అర్హతతోనే ఉద్యోగాలు పొందుతున్నారు. అలాగే వీరికి ప్రసిద్ధ విదేశీ, జాతీయ సంస్థల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు సులువుగా లభిస్తున్నాయి.


క్రియా యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో నెలకొల్పారు. వివిధ రంగాల ప్రముఖులు గవర్నింగ్‌ కౌన్సిల్‌లో ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, కేంబ్రిడ్జ్‌, ఐఐటీ, ఐఐఎస్సీ నేపథ్యం ఉన్న ఫ్యాకల్టీ సభ్యులే ఎక్కువ. క్రమ పద్ధతిలో నేర్చుకోవడాన్ని, సొంతంగా ఆలోచించడాన్ని, ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తారు. యూజీ కోర్సులకు ఏడాదికి రూ.9 లక్షలకు పైగా చెల్లించాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం తక్కువగా ఉండి, మెరిట్‌ సాధించిన విద్యార్థులకు ఫీజు మినహాయింపు లభిస్తుంది. కోర్సులు రెసిడెన్షియల్‌ విధానంలోనే అందిస్తున్నారు.
బీఏ: ఆర్ట్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, లిటరేచర్‌, పాలిటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌. బీఎస్సీ: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, సైకాలజీ కోర్సులు ఉన్నాయి. బిజినెస్‌ స్టడీస్‌, ఫిలాసఫీ అదనపు మైనర్లు. ఎలక్టివ్స్‌లో భాగంగా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌, ఫిల్మ్‌, న్యూరో సైన్స్‌, ఇమ్యునాలజీ, ఫిజిక్స్‌, జియో కెమిస్ట్రీ, స్టాటిస్టికల్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సస్టయినబిలిటీ...మొదలైనవి ఉంటాయి. వీటితోపాటు ఇంటర్‌ డిసిప్లినరీ కోర్‌ కోర్సులు, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా ప్రోగ్రాంను డిజైన్‌ చేసుకోవచ్చు. ఈ కోర్సులను మూడేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ కొనసాగించాలనుకునేవాళ్లు మరో ఏడాది అదనంగా చదువుకోవచ్చు.


ప్లేమ్‌ యూనివర్సిటీ

దేశంలో పేరున్న లిబరల్‌ సంస్థల్లో పుణెలోని ఫ్లేమ్‌ ఒకటి. మూడేళ్ల వ్యవధితో ఇక్కడ పలు యూజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  
బీఏ: ఎకనామిక్స్‌, సైకాలజీ, లిటరరీ అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌, ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌, జర్నలిజం, పబ్లిక్‌ పాలసీ, సోషియాలజీ. బీఎస్సీ: అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌. బీబీఏ: ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఆపరేషన్స్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌. బీబీఏ (కమ్యూనికేషన్స్‌ మేనేజ్‌మెంట్‌): అడ్వర్టైజింగ్‌ అండ్‌ బ్రాండింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, కమ్యూనికేషన్‌ స్టడీస్‌ వీటిలో నచ్చినవాటిలో చేరిపోవచ్చు. డిజైన్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, థియేటర్‌ వీటిని మైనర్‌గా అందిస్తున్నారు. మూడేళ్ల కోర్సు అనంతరం ఆసక్తి ఉన్నవారు నాలుగో ఏడాది ఫ్లేమ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. యూజీ కోర్సుల్లో చేరినవారు ఏడాదికి ఫీజు, వసతి, భోజనం..నిమిత్తం రూ.8 లక్షలకుపైగా చెల్లించాలి.


అశోకా యూనివర్సిటీ

పూర్తి స్థాయిలో లిబరల్‌ స్టడీస్‌ను భారత్‌లో ప్రారంభించిన తొలి సంస్థగా హర్యానాలోని అశోకా యూనివర్సిటీని చెప్పుకోవచ్చు. ఇక్కడ యూజీ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని మేజర్స్‌, ఇంటర్‌ డిసిప్లినరీ మేజర్స్‌ విధానంలో అందిస్తున్నారు. ఈ సంస్థలో చదవడానికి ట్యూషన్‌, వసతి నిమిత్తం ఏడాదికి రూ.9.40 లక్షలు చెల్లించాలి. మెరిట్‌ విద్యార్థులు రాయితీలు అందుకోవచ్చు.

మేజర్స్‌: బీఎస్సీ ఆనర్స్‌: బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌. బీఏ ఆనర్స్‌: ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, సోషియాలజీ/ ఆంత్రోపాలజీ.
ఇంటర్‌ డిసిప్లినరీ మేజర్స్‌: బీఎస్సీ ఆనర్స్‌: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూరల్‌ లీడర్‌షిప్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌. బీఏ ఆనర్స్‌: ఇంగ్లిష్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్‌, ఎకనామిక్స్‌ అండ్‌ హిస్టరీ, ఇంగ్లిష్‌ అండ్‌ మీడియా స్టడీస్‌, హిస్టరీ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌; పాలిటిక్స్‌, ఫిలాసఫీ అండ్‌ ఎకనామిక్స్‌; పాలిటిక్స్‌ అండ్‌ సొసైటీ.


ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, ఏపీ(అమరావతి)

బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందిస్తోంది. ఇంగ్లిష్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, సైకాలజీ, కామర్స్‌ ఎంచుకోవచ్చు. ట్యూషన్‌ ఫీజు ఏడాదికి రూ.1.55 లక్షలు. వసతి, భోజనం నిమిత్తం అదనంగా చెల్లించాలి. మెరిట్‌ విద్యార్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది.


జిందాల్‌ స్కూల్‌

బీఏ లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ కోర్సు అందిస్తోంది. ఎకనామిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబిలిటీ, ఎక్స్‌ప్రెసివ్‌ ఆర్ట్స్‌ (విజువల్‌ ఆర్ట్స్‌), సోషియాలజీ అండ్‌ ఆంత్రోపాలజీ, హిస్టరీ, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, లిటరరీ స్టడీస్‌, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ మేజర్స్‌గా ఈ కోర్సులు అందిస్తున్నారు. కోర్సు ఫీజు అన్నీ కలిపి ఏడాదికి సుమారు రూ.9 లక్షలు.


పండిట్‌ దీన్‌ దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ స్టడీస్‌

బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఆనర్స్‌ కోర్సులు అందిస్తోంది. బీఏ ఆనర్స్‌: ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, గవర్నెన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌. బీబీఏ ఆనర్స్‌: మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌. బీకాం ఆనర్స్‌: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, అంతర్‌ప్రన్యూర్‌షిప్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌. బీఎస్సీ ఆనర్స్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ
సింబయాసిస్‌ స్కూల్‌ ఫర్‌ లిబరల్‌ స్టడీస్‌: పలు సబ్జెక్టుల్లో బీఏ, బీఎస్సీ కోర్సులను అందిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts