వేదికలు విస్తరించి యువ హవా!

వెండితెర, బుల్లితెరలకు దీటుగా వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌ వైవిధ్యంతో దూసుకు పోతున్నాయి. ఫలితంగా నాణ్యమైన కంటెంట్‌ అందించే ప్రొడక్షన్‌ సంస్థలూ పెరుగుతున్నాయి. ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) సంస్థలు శరవేగంతో ముందుకెళ్తున్నాయి. వినోద రంగంలో తెర ముందూ, తెర వెనుకా సత్తా చాటాలనుకునే యువతకు ఇప్పుడు ఎన్నో వేదికలు! వివిధ విభాగాల్లో ఔత్సాహిక యువతీ యువకులకు శిక్షణ ఇచ్చే సంస్థలూ పెరిగాయి.

Updated : 17 Oct 2022 02:07 IST

ప్రతిభకు మెరుగుపెట్టే ఫిల్మ్‌స్టడీస్‌ కోర్సులు

వెండితెర, బుల్లితెరలకు దీటుగా వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌ వైవిధ్యంతో దూసుకు పోతున్నాయి. ఫలితంగా నాణ్యమైన కంటెంట్‌ అందించే ప్రొడక్షన్‌ సంస్థలూ పెరుగుతున్నాయి. ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) సంస్థలు శరవేగంతో ముందుకెళ్తున్నాయి. వినోద రంగంలో తెర ముందూ, తెర వెనుకా సత్తా చాటాలనుకునే యువతకు ఇప్పుడు ఎన్నో వేదికలు! వివిధ విభాగాల్లో ఔత్సాహిక యువతీ యువకులకు శిక్షణ ఇచ్చే సంస్థలూ పెరిగాయి. ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌ విద్యార్హతతో వీటిలో చేరవచ్చు. సృజన, నైపుణ్యం ఉన్న నవ యువత దీక్షతో కృషి చేస్తే అద్భుతంగా నిలదొక్కుకోవచ్చు!

లనచిత్రాలు భారతీయుల డీఎన్‌ఎలో అంతర్భాగం. తెలుగు రాష్ట్రాల్లో సినీ కళాకారులకు ఆదరణ ఎక్కువ. ఇక్కడ.. సినిమాలు చూసేవాళ్లు, అభిమానించేవారు, ఆరాధించేవారు, వాటినే ప్రాణంగా, తారలే లోకంగా బతికేవాళ్లు వీధివీధినా తారసపడతారు. ఒకసారి కనెక్ట్‌ అయ్యారంటే జీవితాంతం గుర్తుంచుకుంటారు. దీంతో ఇక్కడి చిత్రపరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని, సమున్నతంగా ఎదుగుతోంది. నటులకు, సాంకేతిక సిబ్బంది, సినిమాలో భాగమయ్యే అన్ని విభాగాల వారికీ అవకాశాలూ పెరుగుతున్నాయి.

వేదికలు విస్తరించడంతో గతంలో మాదిరి ఒకే ఒక ఛాన్స్‌ అంటూ.. స్టూడియోల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం తగ్గింది. కంటెంట్‌ ఉంటే సంస్థలే నేరుగా సంప్రదించి, కటౌట్‌ పెడుతున్నాయి. వినోదాన్ని అందించే ఛానెళ్లు పెరిగాయి. సీరియల్స్‌తోపాటు పలు కార్యక్రమాలు ఆదరణ పొందుతున్నాయి.  

ఆశావహులైన యువత తమ నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకోవడం ఇప్పుడు ఎంతో తేలికైంది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌...ఇలా సులువైన వేదికలు ఎన్నో ఉన్నాయి. వీడియో వైరల్‌ అయితే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మేటి సంస్థల నుంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి.

ఎన్నో విభాగాలు

సినిమా రూపొందాలంటే ఎన్నో విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. నటులు ఇందులో ఒక భాగం. చిత్రపురిలో సత్తా చాటే అవకాశం నటులతోపాటు భిన్న విభాగాల్లో నైపుణ్యం ఉన్న అందరికీ దక్కుతుంది. డైరక్షన్‌, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ రైటింగ్‌, ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్టింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ప్రీ ప్రొడక్షన్‌, పోస్టు ప్రొడక్షన్‌, లైటింగ్‌, మ్యూజిక్‌, వాయిస్‌ డబ్బింగ్‌...ఇలా విభిన్న విభాగాల సమన్వయంతో రూపొందే చిత్రం... థియేటర్లు, టీవీలు, కంప్యూటర్లు, మొబైళ్లలో సందడి చేస్తుంది. ఔత్సాహికులు తమ నైపుణ్యాలు, ఆసక్తి ప్రకారం నచ్చిన విభాగానికి చెందిన కోర్సుల్లో చేరి ప్రతిభతో రాణించవచ్చు.


ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌...ఇలా వేదికలు ఎన్నో ఉన్నాయి. వీడియో వైరల్‌ అయితే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మేటి సంస్థల నుంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి.


ఇవీ కోర్సులు

ఇంటర్మీడియట్‌ అర్హతతో చిత్ర పరిశ్రమకు సంబంధించిన కోర్సుల్లో చేరవచ్చు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదువులను ఎక్కువగా ప్రైవేటు సంస్థలే అందిస్తున్నాయి. వీటిలో సింహభాగం సినీ నేపథ్యం ఉన్నవారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. మన దేశంలో ఫిల్మ్‌ కోర్సులకు ప్రథమం ముంబై ఆ తర్వాతి స్థానం హైదరాబాదేనని చెప్పుకోవచ్చు. ఫుల్‌ టైం కోర్సుల్లో చేరినవారికి సినిమాకు చెందిన అన్ని విభాగాలపైనా అవగాహన కల్పిస్తారు. కోర్సు చివరలో లేదా సమాంతరంగా స్పెషలైజేషన్‌పై దృష్టి సారిస్తారు. ఇంటర్‌ విద్యార్హతతో సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. వీటిలో ప్రవేశానికి.. పరీక్ష లేదా నైపుణ్యాన్ని తెలిపే వీడియో పంపడం, మౌఖిక పరీక్ష..మొదలైనవి నిర్వహిస్తారు. కొన్ని సంస్థలు కోర్సు చివరలో సినిమా, టీవీల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు ప్రాంగణ నియామకాల ద్వారా కొత్తవారికీ అవకాశం కల్పిస్తున్నాయి.

శిక్షణ సంస్థలివీ...

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌), విజిలింగ్‌ వుడ్స్‌ ఇంటర్నేషనల్‌ (డబ్ల్యుడబ్ల్యుఐ): ఇవి సంయుక్తంగా ఫిల్మ్‌ మేకింగ్‌లో డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్‌ అర్హతతో బీఎస్సీ/బీఏ ఫిల్మ్‌ మేకింగ్‌ (సినిమాటోగ్రఫీ/ డైరెక్షన్‌/ ఎడిటింగ్‌/ ప్రొడ్యూసింగ్‌/ సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌/ వీఎఫ్‌ఎక్స్‌) స్పెషలైజేషన్లతో కోర్సులు నడుపుతున్నాయి. ఈ స్పెషలైజేషన్లలో రెండేళ్ల వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. బీఏ (స్క్రీన్‌ రైటింగ్‌/ యాక్టింగ్‌) కోర్సుల్లో చేరవచ్చు. యాక్టింగ్‌లో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, స్క్రీన్‌ రైటింగ్‌లో డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. ఆరు నెలల వ్యవధితో వెబ్‌ అండ్‌ టీవీ సిరీస్‌ స్క్రీన్‌ రైటింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు ఉంది. డిప్లొమాల వ్యవధి ఏడాది. ఈ సంస్థలో ప్రవేశాలు జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్టు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో లభిస్తాయి. దేశంలో పేరున్న సంస్థగా విజిలింగ్‌ వుడ్స్‌ని చెప్పుకోవచ్చు.

ఏషియన్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, నోయిడా: మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ (సినిమా) కోర్సుతో కలిపి నచ్చిన విభాగంలో డిప్లొమా అందిస్తోంది. యాక్టింగ్‌, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్‌, పోస్టు ప్రొడక్షన్‌, సౌండ్‌ ఎడిటింగ్‌లో ఏదైనా ఎంచుకోవచ్చు. బీఏ థియేటర్‌ అండ్‌ డ్రామా కోర్సునూ చదువుకోవచ్చు. ఇక్కడ ఏడాది వ్యవధితో డిప్లొమా, మూడు నెలల వ్యవధితో షార్ట్‌ టర్మ్‌ కోర్సులూ ఉన్నాయి.  

ముంబై డిజిటల్‌ ఫిల్మ్‌ అకాడెమీ: డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌, డిజిటల్‌ సినిమాటోగ్రఫీ, యాక్టింగ్‌, డైరక్షన్‌, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్‌ అండ్‌ వీడియో ఎడిటింగ్‌, సౌండ్‌ డిజైనింగ్‌ అండ్‌ ఎడిటింగ్‌, ఫొటోగ్రఫీ, స్క్రీన్‌ ప్లే రైటింగ్‌, వాయిస్‌ డబ్బింగ్‌ అండ్‌ యాంకరింగ్‌లో ఏడాది డిప్లొమా, ఆరు నెలల సర్టిఫికెట్‌, మూడు నెలల షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ఉన్నాయి.

బుక్‌ మై ఫేస్‌, స్కైవాక్‌ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఫిల్మ్‌ అండ్‌ క్రియేటివ్‌ ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌, రోషన్‌ తనేజా స్కూల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌, బెర్రీజాన్‌ యాక్టింగ్‌ స్టూడియో, అనుపమ్‌కేర్‌ యాక్టర్‌ ప్రిపేర్స్‌, ఆర్‌కే ఫిల్మ్స్‌ అండ్‌ మీడియా అకాడెమీ, ఆర్‌కే బెస్ట్‌ యాక్టింగ్‌ స్కూల్‌, యాక్టర్‌ స్టూడియో ఇండియా.....తదితర సంస్థలు సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి.

సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా; ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణెలను మినిస్ట్రీ ఆఫ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి సంస్థలగా ఏర్పాటు చేశారు. వీటిలో పలు కోర్సులు పీజీ డిప్లొమా స్థాయుల్లో అందిస్తున్నారు. గ్రాడ్యుయేట్లకు అవకాశం ఉంటుంది.


తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం  ( https://uohyd.ac.in/) థియేటర్‌ ఆర్ట్స్‌లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.

ఆంధ్రా యూనివర్సిటీ  (www.andhrauniversity.edu.in/)  3 నెలల వ్యవధితో యాక్టింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు అందిస్తోంది.

‘అంకురం’ ఉమామహేశ్వరరావు చైర్మన్‌గా హైదరాబాద్‌లో నడుస్తున్న ‘దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌స్టడీస్‌’  (https://dpsfs.edu.in/) డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్‌, ఎడిటింగ్‌, స్క్రీన్‌రైటింగ్‌ కోర్సులను అందిస్తోంది.

అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా ( https://acfm.edu.in/) బ్యాచిలర్స్‌ డిగ్రీలో మీడియా ప్రొడక్షన్‌ కోర్సులు నిర్వహిస్తోంది. విభిన్న అంశాల్లో పీజీ, సర్టిఫికెట్‌ కోర్సులనూ అందిస్తోంది.

రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌ (www.ramanaidufilmschool.net/) డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్‌ కోర్సులు అందిస్తోంది.

వైజాగ్‌, హైదరాబాద్‌ల్లో కొంతమంది వ్యక్తులు సైతం శిక్షణ అందిస్తున్నారు. వీరి శిష్యరికంలో వెండితెరపై మెరిసినవాళ్లూ ఉన్నారు.


ఏ విభాగం.. ఎలాంటి నైపుణ్యం?

యాక్షన్‌: భావాలను ముఖకవళికల్లో నేర్పుగా ప్రకటించగలగాలి. నృత్యంపై పట్టు, మంచి రూపం అదనపు ఆకర్షణ. బాడీ లాంగ్వేజ్‌, గొంతుపై దృష్టి సారించాలి.  

డైరెక్షన్‌: సినిమా ఎలా తీయాలో బ్లూ ప్రింట్‌ రూపొందిస్తారు. షూటింగ్‌ నిరాటంకంగా కొనసాగించి సినిమా/ సీరియల్‌/ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రేక్షకుల మందుకు తీసుకురావడంలో వీరి మార్గదర్శనమే కీలకం. నిర్వహణ నైపుణ్యం, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, నాయకత్వ లక్షణాలున్నవారు ఈ విభాగంపై దృష్టి సారించవచ్చు. దశలవారీగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌ హోదాలు సొంతం చేసుకోవచ్చు.

స్క్రీన్‌ప్లే: సినిమాకు సంబంధించిన అవుట్‌లైన్‌ అంతా ఇందులో ఉంటుంది. దీని ఆధారంగా సన్నివేశాలు అభివృద్ధి చేస్తారు. రచనలో సృజనాత్మకత, కొత్తగా ఆలోచించగలిగేవారు ఈ విభాగంపై దృష్టి సారించవచ్చు. భాష, సన్నివేశాల అల్లిక ద్వారా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చేయగలిగే నైపుణ్యం ఉన్నవారు స్క్రీన్‌ప్లేలో రాణించగలుగుతారు. కోర్సు పూర్తయిన తర్వాత అసిస్టెంట్‌ రైటర్‌, రైటర్‌గా సేవలు అందించవచ్చు.

సినిమాటోగ్రఫీ: ఫొటోగ్రఫీ, వీడియోలపై పట్టున్నవారు ఈ విభాగాన్ని ఎంచుకోవచ్చు. కొత్త టెక్నాలజీ మీద గురి ఉండాలి. దాన్ని ఉపయోగించగలిగే నైపుణ్యం తప్పనిసరి. సన్నివేశానికి తగ్గ దృశ్యాలతో ప్రేక్షకులను కట్టి పడేయాలి. చిత్రీకరణ జరుగుతోన్న ప్రాంతానికీ, ఆ సందర్భానికీ సరిపోయేలా లైటింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తీసుకొచ్చి దృశ్యానికి ప్రాణం పోసేది సినిమాటోగ్రాఫర్లే. నిరంతర శ్రమతో అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌, సినిమాటోగ్రాఫర్‌ హోదాలు అందుకోవచ్చు.

ఎడిటింగ్‌: సినిమా పూర్తయ్యేసరికి నిడివి నాలుగైదు గంటలు ఉంటుంది. దాన్ని రెండున్నర గంటలకు కుదించాలి. అవసరమైన సన్నివేశాలకు అన్యాయం జరగకుండా, నైపుణ్యంతో కూర్పు నిర్వహించాలి. ఆరంభం నుంచి శుభం కార్డు వరకు సన్నివేశాల మధ్య సమన్వయం ఉండాలి. జడ్జిమెంట్‌ నైపుణ్యం ఉన్నవారు ఎడిటింగ్‌ ఎంచుకోవచ్చు. సినీ ప్రపంచంలో దశలవారీగా ఎడిటర్‌ స్థాయికి చేరుకోవచ్చు.  

సౌండ్‌ రికార్డింగ్‌: సన్నివేశాలకు తగ్గ శబ్దాలను జోడిస్తేనే సినిమాకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. సందర్భానుసారం వాటిని ప్రయోగించాలి. ప్రేక్షకులకు అవి లయబద్ధంగా అనిపించాలి. ఇందులో రాణించడానికి.. సాంకేతికతపై పట్టు, శబ్ద ప్రయోగంపై ఆసక్తి ఉండాలి. ఈ నైపుణ్యాలు ఉంటే సౌండ్‌ రికార్డింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని