Btech: 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, చక్కని ప్రణాళిక రూపొందించుకోవడం, చిత్తశుద్ధితో దాన్ని ఆచరించడం... విద్యార్థుల విజయంలో ఎంతో కీలకం. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు దాదాపు పూర్తయ్యాయి.

Updated : 14 Nov 2022 10:47 IST

ఇంజినీరింగ్‌ నూతన విద్యార్థుల కోసం..

స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, చక్కని ప్రణాళిక రూపొందించుకోవడం, చిత్తశుద్ధితో దాన్ని ఆచరించడం... విద్యార్థుల విజయంలో ఎంతో కీలకం. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు దాదాపు పూర్తయ్యాయి. ఎన్నో సంస్థల్లో తరగతులూ ప్రారంభమయ్యాయి. బీటెక్‌ ప్రథమ సంవత్సరంలోనే అద్భుతమైన కెరియర్‌కు బీజం పడేలా చేసుకోవాలి. నాలుగేళ్లు పూర్తయ్యేసరికి సబ్జెక్టులో పట్టు, నైపుణ్యాలతో ముందుకు దూసుకుపోవాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు యూజీ స్థాయిలో ఇంజినీరింగ్‌ కోర్సులోనే చేరుతున్నారు. మేటి భవిష్యత్తుకు బాటలు వేస్తుందనే నమ్మకంతో తల్లిదండ్రులూ ఈ విద్యను ప్రోత్సహిస్తున్నారు. బీటెక్‌ విద్యార్హతతో చాలామంది 3, 6, 10, 12... లక్షల వార్షిక ప్యాకేజీలతో కాలేజీ నుంచి క్యాంపస్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పది, పన్నెండు వేల నెల జీతంతో నెట్టుకొస్తున్నవాళ్ల సంఖ్యా తక్కువ కాదు. ఎక్కువ ప్యాకేజీతో అవకాశం వచ్చినవాళ్లు మరింత ముందుకెళ్తున్నారు. తక్కువ వేతనం పొందుతున్నవారు మెరుగైన స్థాయిని చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకింత వ్యత్యాసం?
ఆ నాలుగేళ్లూ బాగా చదివుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదని.. తక్కువ జీతంతో నెట్టుకొస్తున్నవాళ్లంతా మధనపడుతుంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే పెద్దగా ప్రయోజనం దక్కకపోవచ్చు. అయితే వీరంతా నేటి విద్యార్థులకు ఒక కేస్‌ స్టడీలాంటివారు. తమ కెరియర్‌ ఇలా ఉండకూడదని భావిస్తే.. ప్రథమ సంవత్సరం నుంచే తమ ప్రయాణాన్ని మెరుగైన రీతిలో మొదలుపెట్టి కొనసాగించాలి. లేదంటే రాజీపడుతూ, అసంతృప్తితో కెరియర్‌ కొనసాగుతుంది.

ఇష్టంతో కష్ట్టపడితే...

కొంతమంది ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు పొందలేకపోవచ్చు. కారణం ఏదైనప్పటికీ.. పేరున్న, కోరుకున్న కళాశాలలో సీటు పొందలేకపోవచ్చు. ఇలాంటివారు నిరాశ చెందకుండా ఈ నాలుగేళ్లూ సద్వినియోగం చేసుకుంటే అందరితోనూ సమానంగా లేదా అంతకంటే మెరుగ్గానే రాణించవచ్చు. ఉద్యోగం, ఉన్నత విద్య ఎందులోనూ.. ఐఐటీ లేదా ఎంసెట్‌లో పొందిన ర్యాంకును పరిగణనలోకి తీసుకోరు. ఈ పరీక్షల్లో విజయవంతమైనవాళ్లు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకుంటే మంచిది. చాలా సందర్భాల్లో పూర్వ విజేతలు కొందరు పరాజితులవుతున్నారు. పాత విజయాన్ని ఆస్వాదిస్తూ, ఇక తిరుగులేదని భావిస్తున్నారు.
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు, గేట్‌ ర్యాంకులు, జీఆర్‌ఐ స్కోరు ఇలా ప్రతి విషయంలోనూ చిన్న కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు రాణిస్తున్నారు. అందువల్ల పెద్ద ర్యాంకు వచ్చినవారు తమనితాము తక్కువగా అంచనా వేసుకోకూడదు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే విజేతలు కావచ్చు. టాపర్లను దాటి వీరు ముందుకెళ్లడానికి నాలుగేళ్ల వ్యవధి బాగా సరిపోతుంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికీ, మెరుగుపడటానికీ ఈ సమయం చాలా ఎక్కువ. ఒకవేళ ఫ్యాకల్టీ చెప్పింది అర్థం కాకపోయినా చింతించాల్సిన పనిలేదు. ఎన్‌పీటీఈఎల్‌ పోర్టల్‌ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు వినవచ్చు. గేట్‌ లాంటి మేటి పరీక్షలకూ సన్నద్ధం కావచ్చు. మనం కోరుకున్న ప్రతి అంశాన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎన్నో వేదికల ద్వారా పొందవచ్చు. చాలా సంస్థలు ప్రాంగణాల్లో ఉచితంగా వైఫై అందిస్తున్నాయి. తక్కువ ధరకే ఇంటర్నెట్‌ వీక్షించవచ్చు.

వెలుగూ...చీకటీ

ఇంజినీరింగ్‌ విద్య ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల కుటుంబాలు ఉన్నస్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవడంలో ఇంజినీరింగ్‌ విద్యే మెరుగైన పాత్ర పోషిస్తోంది. అయితే కొందరు విద్యార్థులు చెడుస్నేహాలు, వ్యసనాలు, ఆన్‌లైన్‌ క్రీడలు, డ్రగ్స్‌, బెట్టింగులతో తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం చూస్తున్నాం. వీరి తప్పులతో ఏ మాత్రం సంబంధం లేని తల్లిదండ్రులు దోషుల్లా సమాజంలో నిలబడాల్సివస్తోంది. అందువల్ల ఏ పని చేయాలన్నా.. ఒకసారి మీ అమ్మ, నాన్న, సోదరి, సోదరుడు, బంధువులు, గౌరవించే, ప్రేమించే వ్యక్తులు...వీరందరినీ గుర్తుకుతెచ్చుకోండి. తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేస్తే సంతోషమే. అలా చేయడం వీలుకాకపోయినా వారిని తల దించుకునేలా మాత్రం చేయకూడదని గుర్తుంచుకోవాలి.

ఎన్నో దారులు

బీటెక్‌ అనంతరం ఎంటెక్‌, ఎంబీఏ కోర్సులు, విదేశీ విద్య, కార్పొరేట్‌ కొలువులు, ప్రభుత్వ ఉద్యోగాలు...ఇలా ఎన్నో మేటి మార్గాలు ఉన్నాయి. అయితే గమ్యం ఎటువైపో నిర్ణయించుకోవాల్సింది విద్యార్థులే. బలాలు, ఆసక్తులు, ఆశయాలు, అవసరాలు, ఆర్థిక నేపథ్యం... అన్నీ పరిగణనలోకి తీసుకుని.. సరైన నిర్ణయానికి వస్తే విజయం దిశగా తొలి అడుగు పడినట్లే. ఈ క్రమంలో స్వీయసమీక్షను మించిన కొలమానం లేదు. నచ్చినమార్గాన్ని ఎంచుకున్నవారికి మెచ్చిన అవకాశాలు సొంతమవుతాయి.

బోధన, పరిశోధనలకు...

టెక్నికల్‌గా మరింత పరిజ్ఞానం పొందాలని కోరుకునే బీటెక్‌ విద్యార్థులు ఎంటెక్‌లో చేరితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఎంటెక్‌+పీహెచ్‌డీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బోధన, పరిశోధన రంగాల్లో రాణించడానికి ఈ కోర్సులు అనువైనవి. గేట్‌ ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్‌ కాలేజీలు, ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. గేట్‌లో అర్హత సాధించినవారు ఎంటెక్‌లో రెండేళ్లపాటు ప్రతినెలా రూ.12,400 స్టైపెండ్‌ కూడా అందుకోవచ్చు. గేట్‌లో అర్హులు కానివాళ్లు పీజీఈసెట్‌ ద్వారా రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరొచ్చు. అయితే బీటెక్‌లా కాకుండా ఎంటెక్‌ మాత్రం వీలైనంతవరకు మేటి సంస్థలోనే చదవడానికి ప్రయత్నించాలి. ఇలా జరిగినప్పుడే ఆ పీజీకి విలువ పెరుగుతుంది. కేవలం అర్హత పెంచుకోవడానికి ఎంటెక్‌ పూర్తిచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదు.

విదేశీ విద్య

బీటెక్‌ అనంతరం విదేశాల్లో ఎంఎస్‌ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లెందరో ఉంటారు. ఈ తరహా చదువులకు జీఆర్‌ఈ స్కోరు కీలకం. వీరంతా తొలి నుంచే సన్నద్ధతను ప్రారంభిస్తే కోర్సు పూర్తయ్యేసరికి మంచి స్కోరు సాధించడం తేలికవుతుంది. లేదంటే బీటెక్‌ అనంతరం ఏడాది ఆగాలి. ప్రసిద్ధ వర్సిటీల్లో ప్రమాణాలు మెరుగ్గా ఉండడం వల్ల ప్రవేశాలూ కఠినంగా ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగాలు ఆశిస్తోన్నవారు ఎంఎస్‌ కోర్సులవైపు అడుగులేయడం మంచిది.

ఎంబీఏ

ఐఎస్‌బీ, ఐఐఎంలు, పేరున్న బిజినెస్‌ స్కూల్స్‌లో చేరే బీటెక్‌ విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. పలు కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానం ఉండి, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివినవాళ్లను ఉద్యోగాలకు ఎంపికచేస్తున్నాయి. క్యాట్‌ ద్వారా ఐఐఎంలతోపాటు ప్రముఖ బీ స్కూళ్లలో ప్రవేశాలు లభిస్తాయి. విదేశాల్లో ఎంబీఏ చేయాలనుకుంటే.. యూఎస్‌లో ప్రముఖ యూనివర్సిటీలు పని అనుభవానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అందువల్ల అవకాశాలు పరిమితం. ఇప్పటి నుంచే క్యాట్‌పై దృష్టి పెడితే బీటెక్‌ పూర్తవ్వగానే ప్రముఖ విద్యాసంస్థలో సీటు ఖాయమవుతుంది.

బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత...  రేపటి సంచికలో


ఇదే కీలకం...

లక్ష్యం ఏదైనప్పటికీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కీలకం. భాషానైపుణ్యాలూ ముఖ్యమే. ఎక్కువమంది విద్యార్థులు ఆంగ్లంతో ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ప్రథమ సంవత్సరంలో ఈ భాషపై దృష్టి సారించాలి. వార్తలు వినడం, కథలు చదవడం, వీలైనప్పుడల్లా ఆ భాషలో మాట్లాడటం చేయాలి. వీలైతే ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ తరగతులకూ హాజరుకావచ్చు. సాధనచేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఎక్కువ మంది హాస్టల్‌లో ఉంటూ చదువుతుంటారు. ఇలాంటివాళ్లు అవకాశాన్ని బట్టి ఇతర రాష్ట్రాలు/ప్రాంతాల విద్యార్థులతో కలిసి ఉండటానికి ప్రాధాన్యమిస్తే మంచిది. దీంతో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలతోపాటు వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలపైనా అవగాహన పెంచుకోవచ్చు.
చేరిన బ్రాంచిలో ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవడానికి మొదటి ఏడాదిని బాగా ఉపయోగించుకోవాలి. బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదు. 60 శాతం మార్కులూ సులువుగానే పొందవచ్చు. అయితే మీపై మంచి అభిప్రాయం కలగడానికి ఇవి సరిపోవు. ఒక మోస్తరుగా శ్రమిస్తే 70, మరికొంచం కష్టపడితే 85 శాతం పొందడం సాధ్యమే. రిక్రూటర్లు వీరిపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. బ్యాక్‌లాగ్స్‌ ఉంటే మనపై మరక పడినట్లే. దాన్ని తొలగించుకోవడం ఎంతో కష్టమని గ్రహించాలి. అభ్యర్థుల వడపోత నిమిత్తం సంస్థలు ప్రాంగణ నియామకాల్లో బ్యాక్‌లాగ్స్‌ ఉన్నవారిని పక్కనపెడుతున్నాయి. పర్సంటేజీ/సీజీపీఏని పెంచుతున్నాయి. ముందునుంచే మేల్కొంటే ఈ ఇబ్బందులుండవు. ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మొదటి సంవత్సరం మొదటి రోజు నుంచీ... చివరి ఏడాది ఆఖరు వరకు ప్రణాళికను ఆచరిస్తే నలభై ఏళ్ల ఉజ్వల కెరియర్‌కు పటిష్ఠ పునాదిగా నిలుస్తుంది. ఉద్యోగ జీవితంలో అందులోనూ ఇంజినీరింగ్‌ విభాగంలో తక్కువ వ్యవధిలోనే ఎన్నో మార్పులుంటాయి. బీటెక్‌ స్థాయిలో నేర్చుకున్న పాఠ్యాంశాలు జీవితాంతం పనికిరావు. కాబట్టి వాటితో ఉపయోగం లేదు అనుకోకూడదు. కొత్త విషయాలు సులువుగా గ్రహించడానికీ, తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టడానికీ బీటెక్‌ పాఠ్యాంశాలు పునాదిగా నిలుస్తాయి.


ప్రాజెక్టు... నైౖపుణ్యాలు ముఖ్యం

‘ఇంటర్‌లో రెండేళ్లు నిద్రాహారాలు మాని పుస్తకాల పురుగుల్లా తయారయ్యాం. ఎంసెట్‌లో మంచి ర్యాంకు దక్కించుకున్నాం... బీటెక్‌లో ఆశించిన బ్రాంచిని సొంతం చేసుకున్నాం. ఇక కెరియర్‌కు ఢోకా లేదు. ఒకటి రెండేళ్లు రిలాక్స్‌ అవుదాం’ అని చాలామంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు అనుకుంటారు. ప్రాక్టీస్‌ మ్యాచుల్లో బాగా ఆడి ఫైనల్‌లో వదిలేస్తే ఎలా ఉంటుందో...ఇంటర్‌ వరకు అంకితభావంతో చదివి కెరియర్లో స్థిరపడేముందు అశ్రద్ధ చేస్తే అలా ఉంటుంది. ఇలాచేస్తే జీవితంలో ఎదగలేరు. అందుకే బీటెక్‌ ప్రథమ సంవత్సరం నుంచీ ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని...అందుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలి. పైతరగతికి వెళ్లేందుకు నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలి. క్లాస్‌ టెస్టులు తప్పకుండా రాయాలి. వాటికి కూడా మార్కుల వెయిటేజీ ఉంటుంది. ప్రతి సెమిస్టర్‌లో బ్యాక్‌లాగ్‌లు లేకుండా చూసుకోవాలి. లేకుంటే అవి గుదిబండగా మారతాయి.
కేవలం చదువేకాకుండా అన్ని రకాల కో కరిక్యులర్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌  కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలి. ఇంజినీరుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడంపై 100 శాతం చిత్తశుద్ధిని చూపాలి. ‘స్వయం’ లాంటి  ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొన్ని కోర్సులను కూడా పూర్తిచేయడం ఎంతో ప్రయోజనకరం.
మూడో ఏడాది నుంచి వైవిధ్యమైన రియల్‌ టైమ్‌ ప్రాజెక్టును ఎంచుకొని పూర్తిచేయాలి. చాలామంది రెడీమేడ్‌ ప్రాజెక్టులను బయట మార్కెట్లో కొంటుంటారు. దానివల్ల ప్లేస్‌మెంట్‌ల సమయంలో ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కోలేరు. అందుకు విభిన్నమైన ఆలోచనతో వచ్చి ఆచార్యుల/అధ్యాపకుల మార్గదర్శకంలో ప్రాజెక్టును రూపొందించాలి. ఇవన్నీ సాధించాలంటే సమయం వృథా చేయకుండా తొలి ఏడాది నుంచే కష్టపడాలి. దీంతోపాటు నైతిక, మానవీయ విలువలనూ పెంపొందించుకోవటం భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది.

- ఆచార్య శ్రీరాం వెంకటేష్‌, ప్రిన్సిపల్‌, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని