బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

ఒడుదొడుకులు లేని, భద్రమైన కెరియర్‌కు ప్రాధాన్యమిచ్చే ఇంజినీరింగ్‌ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే.. ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌, వీఆర్వో పోస్టులకు పోటీ పడే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది.

Updated : 15 Nov 2022 05:02 IST

4 ఏళ్ల ప్రణాళికతో...40 ఏళ్ల కెరియర్‌-2

ఒడుదొడుకులు లేని, భద్రమైన కెరియర్‌కు ప్రాధాన్యమిచ్చే ఇంజినీరింగ్‌ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే.. ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌, వీఆర్వో పోస్టులకు పోటీ పడే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ ఆశావహుల్లోనూ సింహభాగం వీరే ఉంటున్నారు. బీటెక్‌ తర్వాత చాలా ఉద్యోగాలే ఉన్నాయి. కేవలం ఇంజినీరింగ్‌ అర్హతతోనే ఉన్న ఉద్యోగాలూ తక్కువేమీ కాదు. ఆయా బ్రాంచీల్లో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులంతా ఈ తరహా   ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మేలు.

యూపీఎస్సీ: చదువుకున్న కోర్సుకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే బీటెక్‌ విద్యార్థులకు యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష మేటి వేదిక. ఎంపికైనవాళ్లు కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగాల్లో రాణించవచ్చు. సివిల్‌, మెకానికల్‌,  ఎల‌్రక్టికల్‌, ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపు సివిల్‌ సర్వెంట్లకు ఉన్న ప్రాధాన్యం ఐఈఎస్‌కు ఎంపికైనవారికి ఉంటుంది. ఏ బ్రాంచీ విద్యార్థులైనా పరీక్ష రాసుకోవచ్చు. వీరు లెవెల్‌-10 వేతనం అందుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ:  కేంద్ర సంస్థల్లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్సెస్సీ) జేఈ పరీక్షతో భర్తీచేస్తారు. ఎంపికైనవాళ్లు వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తారు. వీరికి లెవెల్‌-6 వేతనాలు దక్కుతాయి.  

ఆర్‌ఆర్‌బీ: రైల్వేల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.

రక్షణ రంగం: ఇండియన్‌ నేవీ, ఆర్మీలు యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ద్వారా బీటెక్‌ చదివినవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. యూపీఎస్సీ నిర్వహిస్తోన్న సీడీఎస్‌ఈలో నేవీ విభాగంలోని ఖాళీలకు బీటెక్‌ చదివినవారే అర్హులు. ఆర్మీలో.. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) ఇంజినీర్స్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ టెక్నికల్‌ పోస్టులకు నిర్దేశిత బ్రాంచీల్లో బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు పోడీపడవచ్చు. ఎయిర్‌ ఫోర్స్‌లో ఏఎఫ్‌క్యాట్‌ ద్వారా గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ ఉద్యోగాలకు మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

కొలువుల రత్నాలు: గేట్‌ స్కోరుతో పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్‌(పీఎస్‌యూ)లు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్నల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇలా సుమారు 50 సంస్థల్లో మేటి కొలువులకు గేట్‌ స్కోర్‌ ప్రామాణికం. సంస్థను బట్టి వార్షిక వేతనాలు రూ.6 లక్షలకు తక్కువ కాకుండా రూ.21 లక్షలు, ఆపైన అందుకోవచ్చు. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సైంటిస్ట్‌ ఇంజినీర్‌ పోస్టులను గేట్‌ స్కోర్‌తోనూ భర్తీ చేస్తుంది.

రాష్ట్ర స్థాయిలో... 

ఇంజినీర్లకు సొంత రాష్ట్రాల్లో పలు ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటిలో ఎక్కువ పరీక్షలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహిస్తున్నాయి. మిగిలిన వాటికి ఆయా శాఖల ఆధ్వర్యంలో ఉంటాయి. 

* రూరల్‌ వాటర్‌ సప్లై శానిటేషన్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులు సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారితో భర్తీ చేస్తారు. 

* ఐఅండ్‌ సీఏడీ, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ తదితర విభాగాల్లో అసిప్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ బ్రాంచీలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మునిసిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లో టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీస్‌ పోస్టులకు సివిల్‌ బ్రాంచీ చదివినవారు అర్హులు. 

* అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీలవారు పోటీపడవచ్చు. 

మెట్రోపాలిటన్‌ అండ్‌ వాటర్‌ సప్లై సివరేజ్‌ బోర్డులో మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) ఉద్యోగాలకు సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బ్రాంచీలవారు సన్నద్ధం కావచ్చు. 

* ఇరిగేషన్‌ అండ్‌ సీఏడీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ పోస్టులకు మెకానికల్‌ బ్రాంచ్‌ వారికి అవకాశం ఉంటుంది. 

* ఇంజినీర్‌ సబార్డినేట్‌ సర్వీసుల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు సివిల్‌, మెకానికల్‌ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. 

* సివిల్‌ ఇంజినీర్లకు రోడ్లు, భవనాలు; పంచాయతీరాజ్‌ శాఖల్లో ఉద్యోగాలుంటాయి. ప్రభుత్వ నీటిసరఫరా విభాగాల్లో మేనేజర్‌ పోస్టులకు సివిల్‌ ఇంజినీర్లకు ఎక్కువ అవకాశాలుంటాయి. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చదివినవారికీ ఈ విభాగంలో కొన్ని పోస్టులు కేటాయిస్తున్నారు. 

* ఎల‌్రక్టికల్‌ ఇంజీనీర్లకు విద్యుత్‌ సంస్థలు, పంపిణీ బోర్డుల్లో అవకాశాలు లభిస్తాయి. 

* సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ బ్రాంచ్‌లు చదివినవాళ్లకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్‌ ఉద్యోగాలు లభిస్తాయి. 

* బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారు బీటెక్‌ అర్హతతో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ ఉద్యోగానికి పోటీపడవచ్చు.

ఇవేకాకుండా ఏదైనా డిగ్రీ అర్హతతో నిర్వహిస్తోన్న జనరల్‌ ఉద్యోగాలైన.. సివిల్‌ సర్వీసెస్‌, ఆర్‌ఆర్‌బీ నాన్‌టెక్నికల్‌, ఎస్సెస్సీ సీజీఎల్‌, ఐబీపీఎస్‌ పీవో, క్లరికల్‌; సీడీఎస్‌ఈ, ఏఎఫ్‌క్యాట్‌, సీఏపీఎఫ్‌, గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఎస్సై, కానిస్టేబుల్‌, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ...తదితర పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు