ఉద్యోగమా? గేట్‌ సన్నద్ధతా?

బీటెక్‌/ బీఈ విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కోర్సు పూర్తిచేసిన వారికి కూడా ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నాయి.

Updated : 24 Nov 2022 04:56 IST

బీటెక్‌/ బీఈ విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కోర్సు పూర్తిచేసిన వారికి కూడా ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే ఏదో ఒక కొలువులో చేరిపోవటమా? గేట్‌ కోసం కష్టపడి ప్రిపేరవ్వటమా? అనే సందిగ్ధత ఇంజినీరింగ్‌ విద్యార్థులూ, పట్టభద్రుల్లో కనిపిస్తుంటుంది. గేట్‌ రాయాలనుకునేవారిలో చాలామంది ఉత్తమ ర్యాంకు సాధనకు ఏ మెలకువలు పాటించాలనే విషయంలో స్పష్టత లేకుండా ఉంటారు. ఈ అంశాలపై నిపుణులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం!

పరిశోధన, ఉత్పత్తి/సేవలు, బోధన లాంటి రంగాల్లో స్థిరపడాలనే అభిలాష, విశ్లేషణాత్మక ఆలోచనా విధానంతో ఉండే విద్యార్థులు ..ఇంజినీరింగ్‌ విషయ పరిజ్ఞానంపై పట్టు పెంచుకుని గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)కు సన్నద్ధమవ్వడం ఉత్తమం.
ప్రస్తుత పరిస్థితుల్లో పై చదువులు (పీజీ, పీహెచ్‌డీ) చాలా అవసరం. కాబట్టి బీటెక్‌/బీఈ తర్వాత ప్రముఖ కళాశాలలోనో, విశ్వవిద్యాలయంలోనో ఎంటెక్‌ చేస్తే మంచిది. దీని ద్వారా విస్తృత పరిజ్ఞానంతో పాటు తమ కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయగల అవకాశం లభిస్తుంది. ప్రముఖ విశ్వవిద్యాలయం/ కళాశాలలో పీజీ, పీహెచ్‌డీ చేయాలన్నా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) ఉద్యోగం సంపాదించాలన్నా.. తమ కోర్‌ రంగంలో ఉద్యోగం చేయాలన్నా.. గేట్‌లో మంచి ర్యాంకు అవసరం.  
కోర్‌ సెక్టర్‌లో కొలువు అంటే ఉద్యోగంలో ఉన్నన్ని రోజులూ ఒకే టెక్నాలజీతో విధులు నిర్వర్తించే అవకాశం. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో బీటెక్‌ అర్హతతో ఉద్యోగం చేస్తున్నవారికంటే.. ఎంటెక్‌ అర్హతతో ఉద్యోగం చేస్తున్నవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వేతనం కూడా ఎక్కువగా ఉంటుంది.
పీజీ లేదా పీహెచ్‌డీ అర్హతతో కంపెనీ డెవలప్‌మెంట్‌ విభాగంలో చేరడానికి ఆస్కారం ఎక్కువ. అప్లికేషన్‌ కంటే డెవలప్‌మెంట్‌ విభాగంలో ఉద్యోగాభివృద్ధికి అవకాశాలుంటాయి.
ఈ అన్ని ప్రయోజనాలనూ సద్వినియోగం చేసుకోవాలన్న అభిలాష ఉన్నవారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరిస్తే.. గేట్‌ పరీక్షకు సన్నద్ధమవటం మేలు.
ఉన్నత విద్య (పీజీ, పీహెచ్‌డీ), పీఎస్‌యూ ఉద్యోగాలపై మక్కువ ఉన్నవారు ఎవరైనా ఇతరత్రా కారణాల వల్ల సాధారణ ఉద్యోగం చేస్తున్నట్లయితే గేట్‌కు సన్నద్ధమవకూడదని ఏమీ లేదు. ఉద్యోగం చేస్తున్నవారు ఎందరో గేట్‌లో ఉత్తమ ర్యాంకులతో విజయం సాధిస్తుండటమే దీనికి నిదర్శనం.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు/ అవసరాల దృష్ట్యా కొలువులో చేరటం తప్పనిసరి అని భావించేవారు ఉద్యోగ ప్రయత్నాలు చేయడం సమంజసం.

గేట్‌ సాధనతో లాభాలు

1. గేట్‌ కోసం చదవడం వల్ల ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో కూడా మంచి పట్టును సాధించవచ్చు.
2. ఇంజినీరింగ్‌ కోర్‌ సబ్జెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు గేట్‌ సిలబస్‌ పరిగణనతో శ్రద్ధ పెడితే ఒకే సమయంలో ఇంజినీరింగ్‌ పాఠ్యాంశాలతోపాటు గేట్‌కూ సన్నద్ధం కావచ్చు.
3. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లోనూ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే నియామక ఇంటర్వ్యూల్లోనూ గేట్‌ సన్నద్ధత ఉపయోగపడుతుంది.
ఉద్యోగంలో చేరి.. ఆపై గేట్‌ రాయాలనుకుంటే?  
* గేట్‌ సన్నద్ధత కోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించాలి.
* సిలబస్‌కు అనుగుణంగా గేట్‌ మెటీరియల్‌ (అధ్యయన సామగ్రి) సమకూర్చుకోవాలి.
*ఉద్యోగ విధుల వల్ల సన్నద్ధతకు సమయం తక్కువ ఉంటుంది. ఇలాంటివారికి ఆన్‌లైన్‌ కోచింగ్‌ వరం అనుకోవచ్చు.

ప్రిపరేషన్‌ ఏ సమయంలో మేలు? 

గేట్‌ పరీక్ష సన్నద్ధతను విద్యార్థులు ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో లేదా మూడో సంవత్సరంలో మొదలుపెడితే మంచిది. దీని వల్ల గేట్‌ పరీక్ష సన్నద్ధతకు సుదీర్ఘ సమయం అందుబాటులో ఉంటుంది. కాబట్టి సిలబస్‌లోని అన్ని అంశాలను సమర్థంగా చదివి పునశ్చరణ చేయొచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
* ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులు కళాశాలలో జరిగే పాఠ్యాంశాలు, పరీక్షలు, ప్రాజెక్టు వర్కులతోపాటు గేట్‌ సన్నద్ధతకు సమయం కేటాయించుకోవాలి.
* ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సాధారణంగా ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు సమయం దొరుకుతుంది. ప్రతిరోజూ తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశాలను.. గేట్‌ శిక్షణ ఉదయం తీసుకునేవారు సాయంత్రం, సాయంత్రం శిక్షణ తీసుకునేవారు ఉదయం సాధన చేయాలి.
సాధారణంగా ప్రాజెక్ట్‌ వర్కులు, అసైన్‌మెంట్లు ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరంలో ఉంటాయి. కాబట్టి గేట్‌ ప్రిపరేషన్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌నో, మూడో సంవత్సరంలోనో మొదలుపెడితే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు.

ప్రేరణ కోల్పోకుండా...

సుదీర్ఘకాలం సాగే సన్నద్ధతలో విద్యార్థులు ఏదో ఒక విషయంలో మనస్తాపానికి గురై గేట్‌ రాసే ప్రేరణ కోల్పోవొచ్చు. ప్రిపరేషన్లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంలో విఫలమైనప్పుడో, ఇతర కారణాల వల్లనో సన్నద్ధత నుంచి దృష్టి మళ్లే అవకాశం ఉంటుంది. అలాంటపుడు.

* గేట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడం ద్వారా పొందే ప్రయోజనాలు అనేకం. ఉత్తమ ర్యాంకును సాధించాలనే బలమైన కాంక్ష నిరంతర ప్రేరణను కలిగిస్తుంది.

* ఏ రోజు సాధన చేసిన విషయాలను అదేరోజు పడుకునేముందు మననం చేసుకోవడం ద్వారా సాధించిన పురోగతి ప్రేరణను అందిస్తుంది.

* కఠినమైన విషయాలను సహాధ్యాయులతో చర్చిస్తే అవి సులభంగా అర్థమవ్వడమే కాకుండా ఇంకొంత నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది.

* మాక్‌టెస్టులు రాసినప్పుడు మంచి మార్కులు సాధిస్తే ప్రోత్సాహం కలుగుతుంది. సాధించగలననే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ తక్కువ మార్కులు వస్తే తప్పిదాలను సవరించుకుని పునరావృతం చేయకూడదనే పట్టుదల పెరుగుతుంది.


ఎప్పుడు మొదలుపెట్టినా...

సిలబస్‌ని వీలైనన్నిసార్లు పరిశీలించి తద్వారా ఎలాంటి ప్రశ్నలు ఏయే సబ్జెక్టు నుంచి వస్తున్నాయో అర్థం చేసుకోవాలి.

* సిలబస్‌ను, గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఏయే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అవగతం అవుతుంది. ఇది పరీక్ష సాధనను సులభతరం చేస్తుంది.

* అభ్యర్థులు స్థాయిని బట్టి అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ కోచింగ్‌ లేదా సొంత ప్రిపరేషన్‌లలో ఏదో ఒకటి ఎంచుకుని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.

* గత గేట్‌ ప్రశ్నపత్రాలతోపాటు ఈఎస్‌ఈ, ఇస్రో, పీఎస్‌యూ పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉందో తెలుస్తుంది.

* ప్రామాణిక పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒకే సబ్జెక్టులో రకరకాల పుస్తకాలను చదవకపోవడమే మంచిది.

* అన్ని సబ్జెక్టుల్లో అన్ని అంశాలకూ పరీక్షలో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యమివ్వాలి.

* ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించిన అంశాలను సంక్షిప్తంగా చిన్నచిన్న పట్టికలుగా తయారుచేసుకోవాలి.

* ప్రతి చాప్టర్‌, సబ్జెక్టు చదివిన తర్వాత దానికి సంబంధించి ప్రముఖ విద్యాసంస్థలు అందించే ఆన్‌లైన్‌ టెస్టులను రాయాలి. ప్రిపరేషన్‌ పూర్తయ్యే క్రమంలో మాదిరి ప్రశ్నపత్రాలను (మాక్‌ టెస్టులు) రాయాలి. దీనివల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

* చాప్టర్‌వైజ్‌, సబ్జెక్ట్‌వైజ్‌, మాక్‌ టెస్టుల సాధనలో తప్పుగా రాసిన ప్రతి సమాధానాన్ని సవరించుకోవాలి. వాటిపై ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. దీనివల్ల పరీక్ష సమయంలో ఆ తప్పిదాలు పునరావృతం కావు.

* ఎన్‌టీపీఎల్‌ పాఠాలు విద్యార్థులకు ప్రాథమిక అంశాల అవగాహనకు ఉపయోగపడతాయి. విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికీ ఉపయుక్తమే.

* పునశ్చరణ (రివిజన్‌) అత్యంత కీలకమైంది. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. తయారుచేసుకున్న చిన్నచిన్న పట్టికలను ఈ పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి.

* ప్రతి తప్పు జవాబుకూ 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే సమాధానాలు తప్పయితే .. ఒకమార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మార్కులు తగ్గిస్తారు. న్యూమరికల్‌, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.

- ప్రొ. వై.వి. గోపాలకృష్ణమూర్తి
ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని