తక్కువ ఫీజుతో నాణ్యమైన ఎంబీఏ

2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్‌లు వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) ఎంబీఏ ప్రవేశ ప్రకటన వెలువరించింది.

Published : 30 Nov 2022 00:34 IST

2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్‌లు వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) ఎంబీఏ ప్రవేశ ప్రకటన వెలువరించింది. తక్కువ ట్యూషన్‌ ఫీజుతో నాణ్యమైన ఎంబీఏ పట్టా అందుకోవాలనుకునేవారు డిసెంబరు 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.  

1974లో స్థాపించిన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌  త్వరలో స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి సమాయత్తం అవుతోంది. విశ్వవిద్యాలయ పరిశోధన, బోధన నాణ్యత, ప్రపంచస్థాయిలో పొందిన ర్యాంకింగ్‌లను పరిగణనలోనికి తీసుకొని 2019లో భారత ప్రభుత్వం ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ స్థాయిని కల్పించింది. ఈ హోదా పొందిన పది అత్యుత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇదొకటి. వివిధ ర్యాంకింగ్‌ ఏజెన్సీల ద్వారా టాప్‌ గ్రేడ్‌లు పొందడమే కాకుండా న్యాక్‌లో ఉత్తమ స్కోరూ సాధించింది.  

గత 23 సంవత్సరాలుగా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ నాణ్యమైన ఎంబీఏ కోర్సును అందిస్తూ ఎంతోమంది విద్యార్ధుల కెరియర్‌ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తోంది. 2000 నుంచి పీహెచ్‌డీని అందుబాటులోకి తెచ్చింది. 2008లో హెల్త్‌ కేర్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సునూ, 2017లో బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో ఎంబీఏనూ ప్రారంభించింంది. 2019 నుంచి వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ల కోసం రెండు సంవత్సరాల వారాంతపు ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏను కూడా ప్రవేశపెట్టింది.

రెండేళ్ల జనరల్‌ ఎంబీఏ

స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో రెండు సంవత్సరాల జనరల్‌ ఎంబీఏకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 15 డిసెంబర్‌ 2022. ఈ ప్రోగ్రామ్‌లో సీట్ల సంఖ్య 72. ఏదైనా గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు పొంది, ఐఐఎం బెంగళూరు నిర్వహించిన క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) 2022 రాసి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌ రిజర్వేషన్‌ కేటగిరీల వారికి డిగ్రీలో 55% మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్న విద్యార్ధులూ అర్హులే. వారు డిగ్రీని జూన్‌ 30, 2023కల్లా పొందగలగాలి.

రెండు సంవత్సరాలకు ట్యూషన్‌ ఫీజు సుమారుగా రూ.1,75,000..అభ్యర్ధి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక ఆదాయానికంటే తక్కువగా ఉండి, రాష్ట్రప్రభుత్వ ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగినవారు నామమాత్రపు ఫీజుతో ఎంబీఏ చదివే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందినవారికి యూనివర్సిటీ క్యాంపస్‌లో హాస్టల్‌ వసతి కూడా ఉంది. రూమ్‌ రెంట్‌, మెస్‌ బిల్‌ కలిపి రెండు సంవత్సరాలకు దాదాపుగా రూ. 65,000 అవుతుంది. అంటే యూఓహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో రెండేళ్ల ఎంబీఏ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు రూ. 2,50,000 లోపే అవుతుంది. ఇది ఇతర బిజినెస్‌ స్కూళ్ల ఎంబీఏ ఫీజుతో పోలిస్తే చాలా తక్కువ.

ఎలా ఎంపిక చేస్తారు?

దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులనుంచి క్యాట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా, 1:5 నిష్పత్తిలో అంటే దాదాపుగా 360 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. ఫిబ్రవరి/ మార్చి 2023లో గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. క్యాట్‌లో వచ్చిన స్కోరుకు 60 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 15 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకి 25 శాతం వెయిటేజ్‌ ఇచ్చి మెరిట్‌ లిస్ట్‌ తయారుచేసి ప్రవేశాలు నిర్వహిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూలో విషయ పరిజ్ఞానంతో పాటు పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ మార్కులనూ పరిగణనలోకి తీసుకొని ప్రతిభను నిర్ణయిస్తారు.


ప్రత్యేకతలు ఇవీ

* పరిశ్రమ అవసరాలను తీర్చే పాఠ్యప్రణాళిక, అనుభవం ఉన్న అధ్యాపకులు, అత్యుత్తమ బోధన విధానాలు, విశాలమైన యూనివర్సిటీ ప్రాంగణం, కొన్ని లక్షల పుస్తకాల లైబ్రరీ, అధునాతన కంప్యూటర్‌ ల్యాబ్‌, క్యాంపస్‌ రిక్రూట్‌ మెంట్‌, వ్యక్తిత్వ వికాసం, యూనివర్సిటీలో ఉన్న ఇతర విభాగాలతో అనుసంధానం, పరిశ్రమలతో నిరంతర సంబంధాలు యూఓహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేకతలు.

* ఎంబీఏను నాలుగు సెమిస్టర్‌లలో అందిస్తారు. మొదటి రెండు సెమిస్టర్లలో కోర్‌, ఫౌండేషన్‌ కోర్సులుంటాయి. వీటిలో మేనేజ్‌మెంట్‌ కాన్సెప్టులు, బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌, మేనేజీరియల్‌ అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌, ఎకనామిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌, పర్సనల్‌ ఎఫెక్టివ్‌నెస్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, రీసెర్చ్‌ మెథడాలజీ ముఖ్యమైనవి.

* రెండో మూడో సెమిస్టర్‌ల మధ్య వేసవిలో ఏదైనా ఒక సంస్థలో ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. దీనిద్వారా విద్యార్థులు ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్‌ను పొందుతారు. ప్రస్తుత నిర్వహణ పద్ధతులు, పని వాతావరణాన్ని విద్యార్థులకు పరిచయం చేయడానికి ఈ ఇంటర్న్‌షిప్‌లను ఉద్దేశించారు.

* మూడు, నాలుగు సెమిస్టర్లలో కొన్ని కోర్‌ కోర్సులతోపాటు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌ల్లో స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. వీటిలో నచ్చిన రెండు స్పెషలైజేషన్‌లను మూడో సెమిస్టర్‌లో ఎంచుకోవాలి.

* కోర్స్‌ వర్క్‌తో పాటు ఎంబీఏ చివరి సంవత్సరంలో ఒక దీర్ఘకాలిక ప్రాజెక్టు కూడా చేయాలి.

* యూనివర్సిటీలో చదవడం వల్ల మేనేజ్‌మెంట్‌ చదివేవారితోనే కాకుండా ఇతర కోర్సుల విద్యార్ధులతోనూ పరిచయాలు ఏర్పడి ఇతర విభాగాలపై అవగాహన పెంచుకొనే అవకాశం ఉంది.

* ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌లో భాగంగా జర్నలిజం, సోషల్‌ సైన్సెస్‌, స్టాటిస్టిక్స్‌, లాంగ్వేజెస్‌, పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌, పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల్లో కూడా కోర్సులను ఎంచుకొని దీన్ని మల్టీ డిసిప్ల్లినరీ ప్రోగ్రామ్‌గా చదివే అవకాశం ఉంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని