అవుతారా... స్క్రమ్‌ మాస్టర్‌!

ఐటీలో ఒక ప్రాజెక్టు పూర్తికావాలంటే... ఎంతోమంది శ్రమించాలి, ఎన్నో విభాగాలు పనిచేయాలి, ప్రతి స్థాయిలోనూ పరీక్షించుకుంటూ ఉండాలి, మొత్తానికి క్లయింట్‌కు ఉత్తమ అవుట్‌పుట్‌ అందించాలి. ఇందుకు నిరంతర సమన్వయం అవసరం.

Published : 01 Dec 2022 00:53 IST

ఐటీలో ఒక ప్రాజెక్టు పూర్తికావాలంటే... ఎంతోమంది శ్రమించాలి, ఎన్నో విభాగాలు పనిచేయాలి, ప్రతి స్థాయిలోనూ పరీక్షించుకుంటూ ఉండాలి, మొత్తానికి క్లయింట్‌కు ఉత్తమ అవుట్‌పుట్‌ అందించాలి. ఇందుకు నిరంతర సమన్వయం అవసరం. అందుకోసమే స్క్రమ్‌ సేవలకు డిమాండ్‌ పెరిగింది. ఐటీలో కోడింగ్‌ లేని ఈ ఉద్యోగానికి ఎవరైనా ప్రయత్నించే వీలుంది... కావాల్సినదల్లా ఆసక్తి, అవగాహన మాత్రమే! మరి దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందామా?

గ్బీ ఆటలో ఇరుజట్ల ఆటగాళ్లు దగ్గరదగ్గరగా పట్టుకుని గట్టి బంధంలా ఏర్పడతారు కదా... దాన్నే స్క్రమ్‌ అంటారు. దీన్ని ఒకరకంగా టీంవర్క్‌కు ఉదాహరణగా చెబుతారు. ఆ పేరునే దీనికీ వాడుతున్నారు. ఎందుకంటే ఇది కూడా బృందాన్ని సమన్వయం చేసే పనే. ఒక స్క్రమ్‌ మాస్టర్‌కు అన్ని విభాగాలతో ఎంత బలమైన సంబంధాలు ఉంటే, అంత వేగంగా, విజయవంతంగా పని పూర్తవుతుందనేదే దీని ఉద్దేశం.

స్క్రమ్‌ గురించి తెలుసుకునేటప్పుడు... తొలుత అజైల్‌తో మొదలుపెట్టాలి. ఇది ఒక ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ మెథడాలజీ. పరిశ్రమల్లో ప్రాజెక్టులను సవ్యంగా నడిపించేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తుంటారు. ప్రధానంగా ఐటీలో దీని వినియోగం ఎక్కువ. దీని గురించి తెలుసుకుని, కోర్సు పూర్తిచేసి, సర్టిఫికేషన్‌ పొందినవారే స్క్రమ్‌ మాస్టర్‌.

విధులేంటి?

ప్రాజెక్టులో అన్ని విభాగాలనూ సమన్వయం చేయడం వీరి ప్రధాన విధి. అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించడం, ఎవరి బాధ్యతల్లో వారికి వెంట ఉండి నడిపించడం, తగిన టూల్స్‌ ఉపయోగించేలా చేయడం, బెస్ట్‌ అవుట్‌పుట్‌ వచ్చేలా చూడటం వంటి విధులుంటాయి. మొత్తంగా ప్రాజెక్టు సాఫీగా సాగేలా చేయడం వీరి ప్రధాన లక్ష్యం.

స్క్రమ్‌ మాస్టర్‌కు, ప్రాజెక్టు మేనేజర్‌ విధులు దగ్గరగా అనిపిస్తాయి కానీ ఇవి రెండూ ఒకటి కాదు. స్క్రమ్‌ మాస్టర్‌కు ప్రాజెక్టు జయాపజయాలతో సంబంధం ఉండదు. వారు ఉన్నతాధికారుల్లా ఆదేశాలు జారీ చేయరు. కానీ ప్రాజెక్టు చక్కగా నడిచేలా అన్ని విభాగాలను సమన్వయం చేస్తారు. వచ్చే ఐదు పదేళ్లలో వీరికి డిమాండ్‌ మరింత పెరుగుతుందని అంచనా.

సాఫ్ట్‌వేర్‌ అవగాహన

అధికారికంగా శిక్షణ తీసుకుని పరీక్ష రాసి ధ్రువపత్రం అందుకోవడం ద్వారా స్క్రమ్‌ మాస్టర్‌ అవ్వొచ్చు. ఇందుకోసం అనేక సంస్థలు ఈ సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఈ నైపుణ్య ధ్రువపత్రం రెండేళ్లపాటు మనుగడలో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మళ్లీ కొన్ని గంటల తరగతులకు హాజరై పునరుద్ధరించుకోవాలి. సంస్థల్లో అజైల్‌, స్క్రమ్‌ టెక్నాలజీని ఉపయోగించేవారికి స్క్రమ్‌ మాస్టర్‌ అవసరం ఉంటుంది. ఇది టూల్స్‌, అప్లికేషన్లను ఉపయోగించడం గురించి మాత్రమే కాకుండా... టీమ్‌ను నడిపించడం గురించి కూడా చెబుతుంది. ఒక మంచి స్క్రమ్‌ మాస్టర్‌ అవ్వాలంటే సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ గురించి అవగాహన ఉండటం అవసరం. డిజైనింగ్‌, టెస్టింగ్‌... ఎందులోనైనా అనుభవం ఉండి, చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్నవారు ఇందులో రాణించగలరు.

ఉపయోగాలు

మీకు బృందాల్లో పనిచేయడం ఇష్టమై ఉండి, స్క్రమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ మీద ఆసక్తి ఉంటే... ఈ సర్టిఫికేషన్‌ పొందడం కెరియర్‌పరంగా ఉపయోగపడుతుంది. ఇతర అభ్యర్థులకంటే మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుంది. ఇందులో పరిజ్ఞానం పెంచుకోవడం వల్ల రిస్కులను అంచనా వేసే సామర్థ్యం పెరుగుతుంది. సమస్య పెద్దది కాకముందే గుర్తించి, తగిన విధంగా పరిష్కరించే అవకాశం కలుగుతుంది. స్క్రమ్‌ మాస్టర్‌ సర్టిఫికెట్‌ అందుకున్న తర్వాత కెరియర్‌లో మరింత మందుకు వెళ్లేలా ‘అడ్వాన్స్‌డ్‌ సర్టిఫైడ్‌ స్క్రమ్‌ మాస్టర్‌’, ‘సర్టిఫైడ్‌ స్క్రమ్‌ ప్రొఫెషనల్‌’ వంటి సర్టిఫికేషన్లు అందుకోవచ్చు.

ఈ కోర్సు చేసేందుకు రెండురోజులపాటు 16 గంటల మాస్టర్‌ క్లాస్‌ హాజరుకావాలి. అనంతరం పరీక్ష రాయాలి. గంట పాటు పరీక్ష జరుగుతుంది. 50 ప్రశ్నలు అడుగుతారు. ఉత్తీర్ణులయ్యేందుకు కనీసం 37 ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వాలి. ధ్రువపత్రం వచ్చేందుకు రెండు వారాల వరకూ సమయం పడుతుంది. అనంతరం ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. రెండుమూడేళ్ల అనుభవం ఉన్నవారే కాకుండా... ఆసక్తి ఉంటే కొత్తవారు కూడా ఇందులో రాణించే అవకాశం ఉంటుంది. వీరికి కంపెనీని బట్టి ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ ప్యాకేజీ లభిస్తుంది. అనుభవాన్ని బట్టి రూ.25 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నవారూ ఉన్నారు.

సర్టిఫికేషన్‌

‘సర్టిఫైడ్‌ స్క్రమ్‌ మాస్టర్‌ (సీఎస్‌ఎం)’ సర్టిఫికేషన్‌ అందుకోవడం ద్వారా స్క్రమ్‌ ప్రిన్సిపల్స్‌, అజైల్‌ మెథడాలజీస్‌పై పరిజ్ఞానం పెంచుకోవచ్చు. ‘స్క్రమ్‌ అలయన్స్‌’ సంస్థ అందించే ఈ సర్టిఫికేషన్‌లో స్క్రమ్‌లో అన్ని కాన్సెప్టులూ నేర్చుకుంటారు. ఈ సర్టిఫికేషన్‌ ద్వారా ఒక బృందాన్ని నడిపించే సకల      సామర్థ్యాలూ మీవద్ద ఉన్నాయని నిరూపించుకోవచ్చు. ఇతర సంస్థలు సీఎస్‌ఎంకు ప్రత్యామ్నాయంగా ఉన్న సర్టిఫికేషన్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు స్క్రమ్‌.ఆర్గ్‌ సంస్థ ‘ప్రొఫెషనల్‌ స్క్రమ్‌ మాస్టర్‌ (పీఎస్‌ఎం)’లో మూడు స్థాయుల సర్టిఫికేషన్‌ అందిస్తోంది. స్క్రమ్‌.ఇంక్‌ ‘రిజిస్టర్డ్‌ స్క్రమ్‌ మాస్టర్‌ (ఆర్‌ఎస్‌ఎం)’ అయ్యేందుకు శిక్షణ అందిస్తుంది. కోర్సెరా, సింప్లీలెర్న్‌, యుడెమీ వంటి ఇతర ఆన్‌లైన్‌ సంస్థలు ఇచ్చే క్లాసులకూ హాజరుకావొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని