ఎయిర్‌ఫోర్స్‌లో.. ఆఫీసర్‌ అవుతారా?

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాన్ని ఆశించేవారు ప్రాధాన్యం ఇవ్వాల్సిన వాటిలో ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ముఖ్యమైంది. ఏడాదికి రెండుసార్లు దీన్ని నిర్వహిస్తున్నారు.

Updated : 06 Dec 2022 02:48 IST

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాన్ని ఆశించేవారు ప్రాధాన్యం ఇవ్వాల్సిన వాటిలో ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ముఖ్యమైంది. ఏడాదికి రెండుసార్లు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మెరిసినవారు వాయుసేనలో పైలట్‌ కావచ్చు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లోనూ ఉన్నత హోదాతో సేవలు అందించవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులతో నియామకాలు ఉంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. ఇలా అవకాశం వచ్చినవారు లెవెల్‌-10 హోదాతో రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు. సాధారణ డిగ్రీ లేదా బీటెక్‌ అర్హతతో ఏఎఫ్‌క్యాట్‌కు పోటీ పడవచ్చు. ఆఖరు సంవత్సరం విద్యార్థులు, మహిళలూ అర్హులే. ఇటీవలే ఏఎఫ్‌ క్యాట్‌ - 2023(1) ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు...

దేశంలో ముఖ్యమైన ఉద్యోగ నియామక పరీక్షల్లో ఏఎఫ్‌ క్యాట్‌ ఒకటి. ప్రతి ఆరు నెలలకూ ప్రకటన వెలువడటం దీని ప్రత్యేకత. అందువల్ల ఈ పరీక్షను లక్ష్యంగా చేసుకున్నవారు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువ. గరిష్ఠ వయసు ప్రకారం ఆరేడుసార్లు ఏఎఫ్‌ క్యాట్‌ రాసుకోవచ్చు. పరీక్ష ఉమ్మడిగా ఉంటుంది. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాలి. ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించినవారికి స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాధిస్తే మెడికల్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. విభాగాన్ని బట్టి ఇది ఏడాది నుంచి 18 నెలలు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ అందుతుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారిని శాశ్వత, 14 ఏళ్లపాటు కొనసాగే తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో కొనసాగినవారు తక్కువ వ్యవధిలోనే దశలవారీ అత్యున్నత హోదాలకు చేరుకుంటారు.

పరీక్ష ఇలా..

ఆన్‌లైన్‌లో 300 మార్కులకు ఉంటుంది. మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్‌ అవేర్‌నెస్‌, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలిటరీ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే అడుగుతారు. మిగిలినవి డిగ్రీ స్థాయిలో వస్తాయి. వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాల ద్వారా ప్రశ్నల తీరుపై ఒక అంచనాకు రావచ్చు. పరీక్షకు ముందు ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టు అందుబాటులోకి వస్తుంది. గ్రౌండ్‌ డ్యూటీలో టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాస్తారు. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున వీటికి 150 మార్కులు కేటాయించారు.

ఈ అంశాల్లో...

* జనరల్‌ అవేర్‌నెస్‌: చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమిక స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. వీటికి సాధారణ అవగాహనతో జవాబులు గుర్తించవచ్చు. హైస్కూల్‌ సోషల్‌, సైన్స్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకోవాలి. వర్తమానాంశాల్లో భాగంగా నియామకాలు, అవార్డులు, క్రీడలు, ఎన్నికల ఫలితాలు, పుస్తకాలు- రచయితలు, రక్షణ రంగంలోని తాజా పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. పరీక్ష తేదీకి 9 నెలల వెనక జరిగిన ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి.

* వెర్బల్‌ ఎబిలిటీ: కాంప్రహెన్షన్‌, ఎర్రర్‌ డిటెక్షన్‌, సెంటెన్స్‌ కంప్ల్లీషన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, వొకాబ్యులరీ నుంచి ప్రశ్నలడుగుతారు. అభ్యర్థికి ఆంగ్ల భాషపై ఏ మేరకు అవగాహన ఉందో ప్రశ్నల ద్వారా పరిశీలిస్తారు. హైస్కూల్‌, ఇంటర్మీడియట్‌ స్థాయుల్లో ఆంగ్ల వ్యాకరణాంశాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

* న్యూమరికల్‌ ఎబిలిటీ: సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తి- అనుపాతం, సింపుల్‌ ఇంట్రెస్ట్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్‌ గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు బాగా చదువుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఈ విభాగాన్ని సులువుగానే ఎదుర్కోవచ్చు.

* రీజనింగ్‌, మిలిటరీ ఆప్టిట్యూడ్‌: వెర్బల్‌ స్కిల్స్‌, స్పేషియల్‌ ఎబిలిటీ (మెంటల్‌ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ తర్కంతో ముడిపడే ఉంటాయి. బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. పాత ప్రశ్నపత్రాలను సాధన చేసి, ఈ విభాగంలో రాణించవచ్చు.

* ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌: ఈ టెస్టులో సంబంధిత బ్రాంచ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికోసం బీటెక్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి.

స్టేజ్‌ 1, 2 ఇలా...

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రాటింగ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్‌మెంట్లు, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి విశ్లేషించమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్‌-2కి వెళ్తారు. స్టేజ్‌-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటి ద్వారా మానసిక, శారీరక సామర్థ్యాన్ని గమనిస్తారు. అనంతరం ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ దశలన్నీ దాటినవారికి మెడికల్‌ పరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైతే శిక్షణకు పిలుస్తారు.
ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలిపి 258 ఉన్నాయి.  
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ: డిసెంబరు 30 సాయంత్రం 5 వరకు.
ఫీజు: రూ.250
పరీక్షలు: ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్‌, వరంగల్‌. ఏపీలో.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం.  
వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/

శిక్షణ..

జనవరి, 2024 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ విభాగాల్లో 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాల వారికి 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి ముందుగా ఆరు నెలల ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం.. ఫైటర్‌ పైలట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్‌, హెలికాప్టర్‌ పైలట్లుగా విడదీసి రెండు దశల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఒక్కో దశలో 6 నెలల చొప్పున దుండిగల్‌, హకీంపేట, బీదర్‌, ఎలహంకల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.

ప్రోత్సాహకాలు...

శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరినవారికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ)లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు ఫ్లయింగ్‌ ఆలవెన్సు, టెక్నికల్‌ బ్రాంచీలవారికి టెక్నికల్‌ అలవెన్సు అదనంగా అందుతాయి. అన్నీ కలుపుకుని రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుంది. ఇతర సౌకర్యాలెన్నో ఉంటాయి.  


ఎక్కువ ప్రశ్నలు ప్రాథమికాంశాలపైనే వస్తున్నాయి. పరీక్షలో విజయానికి వీటిపై పట్టు తప్పనిసరి. ప్రతి విభాగంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేయాలి. అలాగే పరీక్షకు ముందు మాక్‌ టెస్టులు రాయాలి. వాటిలో పొరపాట్లు విశ్లేషించుకోవాలి.


అర్హతలు...

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌/ప్లస్‌ 2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగం పోస్టులకు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.  

వయసు: జనవరి 1, 2024 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 2000 - జనవరి 1, 2004 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉంటే మరో రెండేళ్లు మినహాయింపు పొందవచ్చు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల‌క్ట్రానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి.

గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో.. విపన్‌ సిస్టం, అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌, అకౌంట్స్‌, ఎడ్యుకేషన్‌, మెటియొరాలజీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విపన్‌ సిస్టం ఖాళీలకు ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లతో 50 శాతం మార్కులతోపాటు ఏదైనా డిగ్రీలో 60 శాతం ఉండాలి. అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. అకౌంట్స్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ సీఎఫ్‌ఏ/ బీఎస్సీ (ఫైనాన్స్‌) కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌ ఖాళీలకు ఏదైనా పీజీలో 50, యూజీలో 60 శాతం ఉండాలి. మెటియొరాలజీ విభాగానికి బీఎస్సీ ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లతో 60 శాతం మార్కులు లేదా నిర్దేశిత బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ అవసరం. అన్ని విభాగాలకూ ఇంటర్మీడియట్‌ చదివుండటం తప్పనిసరి. అన్ని పోస్టులకూ ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు జనవరి 1, 2024 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1998 - జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకూ పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ.ఎత్తు తప్పనిసరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని