పరీక్షలంటే భయం...

ఇంటర్‌ చదువుతున్నాను. జేఈఈ రాసి ప్రముఖ ఐఐటీలో సీటు సంపాదించాలనేది నా కోరిక. పరీక్షల ఒత్తిడితో చదివినవి కూడా సరిగా రాయలేకపోతున్నాను.

Published : 07 Dec 2022 00:06 IST

ఇంటర్‌ చదువుతున్నాను. జేఈఈ రాసి ప్రముఖ ఐఐటీలో సీటు సంపాదించాలనేది నా కోరిక. పరీక్షల ఒత్తిడితో చదివినవి కూడా సరిగా రాయలేకపోతున్నాను. నేనేం చేయాలి?          

జ్యోతిక

ఇంటర్‌ చదివే వయసులో ఉన్న చాలామంది సాధారణంగా ఎదుర్కొనే సమస్యే ఇది. వయసుతో నిమిత్తం లేకుండా పరీక్ష అనగానే దాదాపు 90 శాతం మందికి ఒత్తిడి ఉంటుంది. దీన్ని అధిగమించినవారే విజేతలుగా నిలుస్తారు. మీ విషయానికొస్తే ముందుగా మీ ఒత్తిడికి మూల కారణాలు తెలుసుకొనే ప్రయత్నం చేయండి. ఇందులో ముఖ్యమైంది తల్లిదండ్రుల నుంచి ఉండే అంచనాలు. రెండోది కళాశాల వారు పెట్టే ఒత్తిడి. మూడోది స్నేహితులవల్ల వచ్చే ఒత్తిడి. చివరిగా మీకు మీరు కొని తెచ్చుకొనే ఒత్తిడి. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉండాలంటే, పరీక్షలకు సన్నద్ధత బాగా ఉండాలి. చాలామంది పరీక్షలకు రెండు, మూడు రోజులముందు ప్రిపరేషన్‌ మొదలుపెట్టి పరీక్షల్లో కంగారు పడతారు. ముందుగా మీరు తరగతుల్ని శ్రద్ధగా వినండి. కళాశాల వారిచ్చే నోట్స్‌తోపాటు, మీరూ సొంతంగా తయారుచేసుకోండి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుంటూ చదవండి. ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షల ప్రశ్నల సరళి, జేెఈఈ ప్రశ్నల సరళి వేర్వేరుగా ఉంటాయి. మనసుని లగ్నం చేసి, పూర్తి ఏకాగ్రతతో చదవండి. ముందుగా మీరు పరీక్షలంటే భయాన్ని వదిలేయండి. భయం, ఒత్తిడి వల్ల తెలిసిన విషయాలనూ మర్చిపోయి పరీక్షల్లో విఫలమవుతారు. జేఈఈ రాసి ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదవడం గర్వకారణమే. కానీ ఐఐటీనే జీవితం కాదు. తుది ఫలితం గురించి ఆలోచించకుండా, ప్రయత్నంపై శ్రద్ధ పెట్టండి. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉండాలంటే, వీలున్నన్ని మాక్‌ టెస్ట్‌లు రాసి పరీక్షల భయాన్ని వదిలేయండి. రోజంతా చదువే కాకుండా కొంత సమయాన్ని వ్యాయామం కోసం, మరికొంత సమయాన్ని మనసుకు సంతోషాన్నిచ్చే అంశాలకూ కేటాయిస్తే మంచిది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని