అద్భుత భవితకు కోడ్ రాసుకుంది!
నిట్ ప్రాంగణ నియామకాల్లో సత్తా చూపిన లిఖిత
‘మార్కులపైనే దృష్టి పెట్టకుండా సబ్జెక్టును అర్థం చేసుకొని ఇష్టంగా చదవాలి. అప్పుడే ఆకర్షణీయమైన వేతనాలతో మంచి ఉద్యోగాలు అందుకుంటారు’ అంటోంది లిఖిత కొండూరు. ఈమె వరంగల్ ఎన్‌ఐటీలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతూ ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీలో రూ. 51 లక్షల వార్షిక వేతనంతో ప్రాంగణ నియామకానికి ఇటీవలే ఎంపికయింది. తన విజయానికి బాటలు వేసిన అంశాల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం!
పదోతరగతి వరకు సూర్యాపేటలో చదివా. టెన్త్‌లో 10 జీపీఏ సాధించా. పాలిటెక్నిక్‌లో స్టేట్ 17వ ర్యాంకు వచ్చింది. కానీ ఇంటర్ చేయడానికే మొగ్గు చూపా. హైదరాబాద్‌లోని చైతన్య కళాశాలలో చేరా. ఇంటర్లోనూ 96 శాతం మార్కులు తెచ్చుకున్నా. అయితే పాఠశాల స్థాయి నుంచే ఏ రోజూ మార్కులపై మాత్రమే దృష్టిపెట్టి చదవలేదు. సబ్జెక్టుపై ఇష్టంతో అవగాహన పెంచుకుని చదివా. జేఈఈ మెయిన్స్‌లో 5135 ర్యాంకు సాధించా. అడ్వాన్స్‌డ్‌లోనూ 6 వేల ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుతో ఐఐటీ హైదరాబాద్‌లో ఈఈఈలో సీటు వచ్చేది. అయితే నేను ఈసీఈలో చేరాలనుకున్నా. నేను కోరుకున్నట్టు ఎన్‌ఐటీ వరంగల్‌లో ఈ బ్రాంచిలో సీటు రావడంతో చేరిపోయా.
ఐదు కంపెనీలు తిరస్కరించాయి
మనం ఎంత చురుగ్గా ఉన్నా ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదురవుతుంటాయి. అలా అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి. నేను మూడో సంవత్సరం చివరలో ఇంటర్న్‌షిప్ కోసం ప్రయత్నించా. అప్పుడు అయిదు కంపెనీలు తిరస్కరించాయి. దీంతో ఒక దశలో నిరాశ ఎదురైంది. కానీ మళ్లీ ఆత్మవిశ్వాసంతో కోడింగ్‌పై లోతుగా అవగాహన పెంచుకున్నా. అప్పుడు కొవిడ్ సమయం కావడంతో రెండేళ్లు కళాశాల తరగతులు ఆన్‌లైన్‌లోనే విన్నాం. దాంతోపాటు ఆన్‌లైన్‌లో కోడింగ్‌పై పట్టు పెంచుకున్నా. కోడింగ్‌పై చాలా పరీక్షలు ఆన్‌లైన్‌లో రాశా. ‘గీక్స్ ఫర్ గీక్స్’ లాంటి వెబ్‌సైట్లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లో కంపెనీలు ఎలా పరీక్షిస్తాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో మెలకువలు నేర్పిస్తారు. వాటిని నేర్చుకున్నా.
మూడు రౌండ్ల ఇంటర్వ్యూ
ప్రాంగణ నియామకాల్లో మొదట ఆన్‌లైన్ టెస్టు ఎదుర్కొన్నా. అందులో అర్హత సాధించానని అదే రోజు తెలిసిపోయింది. తర్వాత వారం రోజులకు మా ఎన్‌ఐటీ క్యాంపస్‌లో కంపెనీ వాళ్లు ఇంటర్వ్యూ జరిపారు. సాధారణంగా ఆన్‌లైన్ టెస్టు జరిగిన మర్నాడే ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ అప్పుడు సెలవులు రావడంతో నాకు వారం సమయం దొరికింది. ఆ సమయంలో బాగా సిద్ధమయ్యా. మౌఖిక పరీక్ష ఒకే రోజులో మూడు రౌండ్లలో జరిగింది. అన్ని రౌండ్లలోనూ టెక్నికల్ అంశాలనే అడిగారు. కోడింగ్‌లో సమస్యలు ఇచ్చారు. ఒక్కో సమస్యను పరిష్కరించేందుకు గంట సమయం పట్టింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు మన అప్రోచ్ ఎలా ఉందో, ఎంత సమర్థంగా పరిష్కరించగలుగుతున్నామో నిపుణులు సూక్ష్మంగా పరిశీస్తారు. నేను వారి అంచనాలను అందుకోవడంతో అందరిలో మేటిగా నిలిచా.
ఆకర్షణీయ వేతనానికి కారణం
నాకు రూ. 51 లక్షల ప్యాకేజీ వస్తుందని అస్సలు ఊహించలేదు. కంపెనీలు సమస్యా పరిష్కారంలో మన వేగాన్నీ, లాజికల్ థింకింగ్‌నూ గమనించి ఆకర్షణీయమైన ప్యాకేజీని నిర్ణయిస్తాయి. అందుకే విద్యార్థులు కోడింగ్ ఎంత ఎక్కువ సాధన చేస్తే బుర్ర అంత పదునుగా అవుతుంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌వైపు వెళ్లాలనుకునేవారు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుంచే కోడింగ్‌పై దృష్టిపెట్టడం మంచిది. దీనికోసం అనేక వెబ్‌సైట్లు ఉన్నాయి. పాఠశాల స్థాయిలోనే పిల్లలకు మూసధోరణికి భిన్నంగా ‘థింకింగ్ ఔట్ ఆఫ్ బాక్స్’ నేర్పిస్తే పెద్దయ్యేకొద్దీ ఆలోచన విధానంలో పరిపక్వత కనిపిస్తుంది.
మా నాన్న రాంబాబు వ్యాపారి. అమ్మ స్వప్న ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచీ అమ్మానాన్నలు చదువు విలువ తెలియజేశారు కానీ ఈ విషయంలో ఏనాడూ ఒత్తిడి చేయలేదు. మన విద్యా విధానం మార్కుల మీదే దృష్టిపెట్టేలా ఉంటోంది. అలా కాకుండా విద్యార్థులకు సబ్జెక్టుపై ఆసక్తి కలిగేలా చేస్తే వారే సులువుగా అర్థం చేసుకొని బాగా రాణిస్తారని నా అభిప్రాయం.
గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్‌ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్