నూతన సంవత్సరం.. నయా ట్రెండ్స్‌!

సరికొత్త అవకాశాలు, కొంగొత్త ఆకాంక్షలతో 2023 వచ్చేసింది. అన్ని రంగాల మాదిరిగానే ఉన్నత విద్యారంగంలోనూ ఈ నూతన సంవత్సరం కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఉన్న ట్రెండ్స్‌ కొన్ని కొనసాగే అవకాశాలు ఉండగా...  మరిన్ని కొత్త తరహా కోర్సులు, కాంబినేషన్లు విద్యార్థులను ఆకర్షించనున్నాయి.

Updated : 02 Jan 2023 04:56 IST

ఉన్నత విద్యాభ్యాసం... 2023 తెచ్చే మార్పులు

సరికొత్త అవకాశాలు, కొంగొత్త ఆకాంక్షలతో 2023 వచ్చేసింది. అన్ని రంగాల మాదిరిగానే ఉన్నత విద్యారంగంలోనూ ఈ నూతన సంవత్సరం కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఉన్న ట్రెండ్స్‌ కొన్ని కొనసాగే అవకాశాలు ఉండగా...  మరిన్ని కొత్త తరహా కోర్సులు, కాంబినేషన్లు విద్యార్థులను ఆకర్షించనున్నాయి. ఈ ఏడాది ఇంకా ఎటువంటి ట్రెండ్స్‌ చోటుచేసుకోబోతున్నాయో ఇదీ నిపుణుల అంచనా...

నిజానికి కరోనా మహమ్మారి మన జీవితాలనే కాదు, విద్యార్థులు చదువుకునే తీరునూ చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడినా... పూర్తిస్థాయిలో అన్ని అవకాశాలూ తెరుచుకుని, అంతా సాధారణ స్థితికి వచ్చిన ఏడాది 2022. ఈ నేపథ్యంలో జరిగిన మార్పులు... బూమ్‌లో ఉన్న కోర్సులు కొత్త సంవత్సరం కూడా కొనసాగుతాయని అంచనా. వీటిని తెలుసుకోవడం విద్యార్థులు తాము ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలో నిర్ణయించుకోవడంలో దోహదపడుతుంది. ఈ ట్రెండ్స్‌లో కొన్ని ముఖ్యమైన వాటిని చూస్తే...


విదేశాల్లో విద్య..

రోనా తర్వాత విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివేవారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ ట్రెండ్‌ 2023లో మరింత పెరుగుతుందని అంచనా. అయితే చైనాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చు. ఈ ఏడాది అధికశాతం విద్యార్థులు కెనడా, యూకే వెళ్లేందుకు వీసాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా చాలావరకూ ఈ దరఖాస్తులను అక్కడి ప్రభుత్వాలు తిరస్కరించాయి. ఏది ఏమైనా విద్యార్థుల ప్రయత్నాలైతే పెరిగే అవకాశం ఉంది.


టెక్నాలజీ వినియోగం..

న్నత విద్యాభ్యాసంలో మరింత టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల విద్యార్థులకు చదువుకోవడం మరింత సులువు కానుంది, ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. దీనివల్ల బోధన, బోధనేతర సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటికే వికీస్‌, గూగుల్‌ డాక్స్‌ వంటి టెక్‌ ఆధారిత టూల్స్‌ను స్టూడెంట్స్‌ అధికంగా ఉపయోగిస్తున్నారు. నేర్చుకోవడం, సంభాషించడం, ప్రాజెక్టుల్లో కలిసి పనిచేయడం... మొత్తంగా వారు చదివే తీరు మరో మెట్టు పైకెక్కుతుందని భావన. చదువుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ (ఎల్‌ఎంఎస్‌) వినియోగం మరింత పెరగవచ్చు.


అనువైన విధానాలు

ల్టిపుల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఉన్న కోర్సుల సంఖ్య పెరగడం, డ్యూయల్‌ డిగ్రీ అవకాశాలు.. ప్రస్తుతం చోటుచేసుకున్న పెద్ద మార్పులు. విద్యార్థులకు అనుకూలమైన ఈ విధానాల వల్ల ఎక్కువమంది చదువుకునేందుకు వీలు కావడమే కాదు... కొత్త తరహా కాంబినేషన్లు వారికి అధిక సంఖ్యలో అవకాశాలను తీసుకురానున్నాయి. ‘ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్‌’ అనేది అందరూ ఆకాంక్షిస్తున్న, ఆహ్వానిస్తున్న మార్పు.


మెటావర్స్‌... నానో లెర్నింగ్‌

మెటావర్స్‌ అధ్యయనం చేసేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీని ద్వారా కొన్ని రంగాల్లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటం.. తద్వారా ఈ నిపుణులకు అధిక అవకాశాలు లభించే వీలుండటమే ఇందుకు కారణం. అలాగే ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, యూఎక్స్‌ యూఐ వంటి కోర్సులకు అధిక డిమాండ్‌ ఉంటుందని అంచనా. ఎక్కువ సమాచారాన్ని చిన్న చిన్న మాడ్యూల్స్‌గా నేర్చుకోవడమే నానో లెర్నింగ్‌. విద్యాభ్యాసంలో ఇదో కొత్త విధానం. ప్రస్తుతం దీనికీ ఆదరణ పెరుగుతోంది. వర్చువల్‌ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ విద్యారంగాన్ని మరింత ఆక్రమించబోతున్నాయి. ‘మార్కెట్‌ రిసెర్చ్‌ ఫ్యూచర్‌’ తాజా సర్వే ప్రకారం ఏర్‌, వీఆర్‌ మార్కెట్‌ 2027 నాటికి మనదేశంలో దాదాపు 18 శాతం పెరుగుతుందని అంచనా. అలాగే డిగ్రీ, పీజీ స్థాయిలో సంప్రదాయ కోర్సులకు భిన్నంగా అనేక కొత్త తరహా కాంబినేషన్లు వచ్చాయి. ఫ్యాషన్‌, మీడియా కమ్యూనికేషన్స్‌, ఇతర రంగాల్లోనూ మరిన్ని కొత్త కాంబినేషన్లు రావొచ్చని అంచనా.


ఆన్‌లైన్‌ విద్య

న్‌లైన్‌ విద్య కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ప్రాథమిక స్థాయిలో నెమ్మదించినా, ఉన్నత విద్యాస్థాయిలో మాత్రం పెరుగుతోంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ దేశం మొత్తం మీద 38 యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ అందించడానికి అనుమతులు ఇచ్చింది. భవిష్యత్తులో 900కు పైగా అటానమస్‌ కాలేజీల్లో ఇలా ఆన్‌లైన్‌ కోర్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రయత్నిస్తోంది. 2023లో ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ అనేది ఎంతగా పెరగనుంది అనేది చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికే కొన్ని ప్రైవేటు ఆన్‌లైన్‌ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యాబోధనతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. వీటి సేవలు వినియోగించుకునే వారి సంఖ్య రానురానూ పెరగనుంది.


పని ప్రదేశంలో..

నైపుణ్యాలను ఎప్పటికప్పుడు స్థిరంగా మెరుగుపరుచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిభకు పదును పెట్టుకోవడం, మేనేజ్‌మెంట్‌ - నాయకత్వ నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంపై శ్రద్ధ పెరుగుతుంది. ఇందువల్ల ఈ తరహా కోర్సుల వినియోగం అధికం కావొచ్చు. ప్రాజెక్టులు, కొలాబరేషన్స్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధికి ప్రయత్నాలు పెరుగుతాయి. కమ్యూనికేషన్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ సాధన చేయడం పెరుగుతుంది. కేవలం కాలేజీ డిగ్రీలే కాక... హెల్త్‌ కేర్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌... వంటి అంశాలపై అభ్యర్థులు అవగాహన పొందేందుకు ప్రయత్నిస్తారు.


గేమిఫికేషన్‌

ప్పటికే విద్యారంగంలో ప్రభావం చూపుతున్న గేమిఫికేషన్‌ 2023లో మరింత పెరుగుతుందని అంచనా. సంప్రదాయ రీతులకు భిన్నంగా ఇది పనిచేస్తుంది. ఆటలా పాఠాలు చదవడం ఎక్కువ నైపుణ్యాలు నేర్చుకోవడానికే కాదు, అధిక సమయం నేర్చుకోవడంలో గడిపేందుకూ దోహదం చేస్తుంది. ఈ తరహా వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సంస్థల్లో విద్యార్థుల చేరికలు పెరగనున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు