తొలి పరీక్షకు తుది మెరుగులు!

కొత్తగా చదవాల్సినవి ఇంకా ఏమైనా మిగిలివుంటే ఈ సమయంలో వాటిని చదవటం మంచిది కాదు. వాటి గురించి ఆలోచిస్తూ అసంతృప్తికి గురయ్యే బదులు చదివినవాటిని గమనించి సానుకూల దృక్పథంతో ఉంటే పరీక్షలో అదనపు మార్కులూ రాబట్టవచ్చు.

Updated : 03 Jan 2023 04:47 IST

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

‘మరో ఐదు రోజుల్లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష. అసలే పోస్టుల సంఖ్య తక్కువ. పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎంత చదివినా  ఇంకా ఏదో మిగిలి ఉందన్న అసంతృప్తి. ఇలా ఉన్నపుడు ఈ  ప్రిలిమ్స్‌ క్వాలిఫై అవ్వగలమా?’

సీనియర్‌ అభ్యర్థులతో సహా చాలామంది పరీక్షార్థులకు ఎదురవుతున్న మానసిక ఒత్తిడి ఇది. వీరు కొన్ని మెలకువలను పాటించగలిగితే మానసిక స్థిరత్వం ఏర్పడి విజయానికి కావలసిన అదనపు బలాలు సమకూరతాయి. ఏమిటవి? తెలుసుకుందాం!

కొత్తగా చదవాల్సినవి ఇంకా ఏమైనా మిగిలివుంటే ఈ సమయంలో వాటిని చదవటం మంచిది కాదు. వాటి గురించి ఆలోచిస్తూ అసంతృప్తికి గురయ్యే బదులు చదివినవాటిని గమనించి సానుకూల దృక్పథంతో ఉంటే పరీక్షలో అదనపు మార్కులూ రాబట్టవచ్చు.

* గతంలో చదివినవాటిని పూర్తిస్థాయి రివిజన్‌ (పునశ్చరణ) చేయకుండా సబ్జెక్టుల వారీగా ముఖ్యమైన.. స్కోరింగ్‌కు అవకాశం ఉన్న విభాగాలపై దృష్టి సారించడం మంచిది. ఈ కోణంలో- 

* పేపర్‌ 1లో భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ మౌలిక అంశాలపై దృష్టి పెట్టవచ్చు. 

* పేపర్‌ 2లో ప్రధానంగా కరెంట్‌ అఫైర్స్‌పై ఈ స్వల్ప కాలాన్ని వినియోగించవచ్చు. అదేవిధంగా రోజూ కనీసం నాలుగు గంటలైనా సాధారణ మానసిక సామర్థ్యాలు రివిజన్‌ చేస్తే ఉపయోగం ఎక్కువ. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంబంధిత కరెంట్‌ విషయాలపై కూడా కొంచెం లోతుగానే చదివితే మంచిది. 

* ఈ స్వల్ప కాలంలో నమూనా పరీక్షల్ని సాధన చేసే ప్రయత్నం అంత మంచిది కాదు. నమూనా ప్రశ్నపత్రాలను తయారుచేసిన వారి స్థాయి, సామర్థ్యం, ఉద్దేశం స్పష్టంగా తెలియదు కాబట్టి ఆయా పరీక్షల్లో వచ్చే మార్కులు అభ్యర్థులను లేనిపోని మానసిక ఒత్తిడికి గురి చేయవచ్చు. లేదా సులభమైన ప్రశ్నపత్రాలను ఎదుర్కొన్నప్పుడు వచ్చే ఎక్కువ మార్కులు చూసి అతి నమ్మకాన్ని పెంచుకోవడం, పరీక్ష హాల్లో వచ్చే ప్రశ్నపత్రంతో బేరీజు వేసుకునే ప్రమాదం జరగవచ్చు. పరీక్షల్లో వచ్చే ప్రశ్నపత్రం క్లిష్టతతో ఉన్నప్పుడు మొత్తానికే మోసం కూడా రావొచ్చు. అందువల్ల ఈ దశలో నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయకపోవడమే మేలు. ముఖ్యమైన వివరాలను మరోసారి చదువుకుంటే సరిపోతుంది.

ఏ వరుస క్రమం మంచిది?

* పరీక్షలో గరిష్ఠ మార్కులు పొందేందుకు ముందస్తు వ్యూహం మంచిదే. కానీ ఈ స్వల్ప కాలంలో ఇలాంటి వ్యూహం వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వవచ్చు. ముందుగా పాలిటీతో మొదలుపెట్టాలనో, కరెంట్‌ అఫైర్స్‌తో ఆరంభించాలనో ప్రణాళికలు వేసుకోకూడదు. వీలైనంతవరకు ప్రశ్నపత్రంలో ఉన్న వరుస క్రమాన్ని పాటిస్తూ పోవటం మంచిది. మీరు సులభం/ స్కోరింగ్‌ అనుకునే విభాగాల కోసం ప్రశ్నపత్రం మొత్తం వెతుక్కుంటూ కూర్చుంటే ఉన్న సమయం కాస్తా హరించిపోతుంది. పైగా ఆయా విభాగాల్లో క్లిష్టమైన ప్రశ్నలు వస్తే మిగతా విభాగాలపై కూడా ఆ ప్రభావం పడొచ్చు. అందుకని ప్రశ్నపత్రంలో ఏయే విభాగాలను ముందుగా పూర్తిచేయాలనే విషయంలో ముందస్తు ప్రణాళిక వేసుకుని, వాటిని పాటించే క్రమంలో అనవసరమైన ఒత్తిడిని పెంచుకోకూడదు. 

* ఇటీవల నిర్వహించిన తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష అనుభవాలు ఆంధ్ర అభ్యర్థులకు కూడా ఉపకరిస్తాయి. రొటీన్‌కు భిన్నంగా ఇటీవల టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ 1 పరీక్షలో విభిన్నరూపాల్లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు కనిపించాయి. కొన్ని ప్రశ్నలు చదవటానికి ఎక్కువ సమయం పట్టింది. జతపరిచే ప్రశ్నలు, అసెర్షన్‌ రీజనింగ్‌ ప్రశ్నలు, మౌలిక అంశాల ప్రశ్నలు అభ్యర్థులను చాలా ఇబ్బందులు పెట్టాయి. సమగ్రంగా సిలబస్‌ అంశాలను అధ్యయనం చేసినవారు మాత్రమే విజయం సాధించే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇప్పటివరకు చదివిన అంశాల స్థాయి ఎలా ఉన్నా పరీక్ష హాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించే వ్యూహం చాలా ఉపకరిస్తుంది. దాన్ని కూడా అలవర్చుకునేందుకు ఈ స్వల్పకాలాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలి.

ప్రతికూలంగా తీసుకోవద్దు

* పేపర్‌ 2 లోని రీజనింగ్‌, మానసిక అంశాల విభాగానికి 60 మార్కుల ప్రాధాన్యం ఉంది. గణితేతర అభ్యర్థులు ఈ విభాగం గణిత అభ్యర్థులకు అనుకూలమనే భావనతో ఉన్నారు. ఇది సరైన ఆలోచన కాదు. దీన్ని ప్రతికూలంగా తీసుకుని పరీక్ష హాలుకు వెళితే 25% వెయిటేజ్‌ ఉన్న ఈ విభాగంలో బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతికూల భావాలను వదిలివేసి మానసిక సామర్థ్యాల ప్రశ్నలు సాధారణ స్థాయిలో ఉంటాయని జ్ఞాపకం చేసుకోవాలి. సానుకూల దృక్పథంతో, ప్రశాంత చిత్తంతో ఆయా ప్రశ్నలు చదివితే తేలిగ్గా సమాధానాలు గుర్తించే అవకాశం ఎక్కువ. 

* ఈ తరహా ప్రశ్నలను సాధించగలగటం మానసిక పరీక్షే, మానసిక సామర్థ్యానికి సూచికే. కాబట్టి స్థిర చిత్తంతో వ్యవహరించేలా మానసిక సంసిద్ధత ఉండాలి.

* చాలామంది చేసే అతిపెద్ద తప్పు- పరీక్ష ముందు రాత్రీ పగలూ చదవడం. మరీ ముఖ్యంగా ఆబ్జెక్టివ్‌ పరీక్ష సమయంలో ఈ విధంగా చదవడం వ్యతిరేక ఫలితాలకు దారి తీయవచ్చు. 8-10 గంటల సమయం నిద్రపోయే ఏర్పాటు చేసుకుంటే మానసిక అలజడీ, ఒత్తిడీ తగ్గుతాయి. ఫలితంగా సరైన సమాధానాలు గుర్తించే అవకాశం పెరుగుతుంది.


ఊహించి రాస్తే ముప్పే...

* ఈ ప్రిలిమ్స్‌ పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ఊహించి రాయటానికి (గెస్సింగ్‌) ప్రాధాన్యం ఇవ్వకుండా స్పష్టంగా సమాధానం తెలిస్తేనే గుర్తించాలి. తెలియకపోతే వదిలివేయటం మరొక స్కోరింగ్‌ టెక్నిక్‌. ఇది గుర్తుంచుకోండి. కొంతమంది అభ్యర్థులు నెగిటివ్‌ మార్కింగ్‌ సంగతి పట్టించుకోకుండా లాటరీ మాదిరిగా ‘మూడు ప్రశ్నలకు ఒకటైనా రైట్‌ అవ్వదా?’ అనే అహేతుక ఆలోచనతో సమాధానాలు గుర్తిస్తూ ఉంటారు. ఫలితంగా వచ్చే మార్కులను కూడా కోల్పోతూ ఉంటారు. 

* ఒకవేళ ఏవైనా కారణాల వల్ల పేపర్‌ 1 పరీక్ష బాగా రాయలేకపోయినా..పేపర్‌ 2 పరీక్షకు తప్పక హాజరవ్వండి. రెండు పరీక్షల్లోనూ వచ్చే మార్కులే మెయిన్స్‌కి పరిగణిస్తారు. ‘ఒక పేపర్లో తగ్గినా మరో పేపర్‌లో వచ్చే స్కోరుతో గట్టెక్కవచ్చు’ అనే ఆశావహ ధోరణితో వ్యవహరించండి. 

* సమయాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ప్రతి పేపర్లో ఉన్న 120 ప్రశ్నలను చదవండి. సరైన సమాధానం తెలిస్తే గుర్తించండి. కచ్చితంగా తెలియదనుకుంటే వదిలేయండి. ఏ ఒక్క ప్రశ్న మీదైనా అత్యధిక సమయం కేటాయిస్తే మిగతా ప్రశ్నలను కోల్పోవలసి వస్తుంది. దాని వల్ల జరిగే నష్టమూ ఎక్కువే ఉంటుంది. 

* క్లిష్టమైన ప్రశ్నలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. సాధారణ ఆలోచనతో సమాధానం ఏమైనా గుర్తించగలరేమో ప్రయత్నించండి. ఎలిమినేషన్‌ మెథడ్‌తో సమాధానాన్ని గుర్తించవచ్చేమో అని ప్రశాంతంగా ఆలోచించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని