రివిజన్‌, టెస్ట్‌ సిరీస్‌.. ఇవే విజయ సూత్రాలు

అఖిల భారత స్థాయిలో అత్యున్నత ర్యాంకు సాధించటం అంత తేలికేమీ కాదు. ఇటీవల విడుదలైన ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ) ఈ అండ్‌ టీ స్ట్రీమ్‌లో తొలి ప్రయత్నంలోనే  రెండో ర్యాంకు సాధించాడు.

Updated : 04 Jan 2023 04:56 IST

ఈఎస్‌ఈ టాపర్‌ లక్ష్మీ వెంకటేష్‌

అఖిల భారత స్థాయిలో అత్యున్నత ర్యాంకు సాధించటం అంత తేలికేమీ కాదు. ఇటీవల విడుదలైన ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ) ఈ అండ్‌ టీ స్ట్రీమ్‌లో తొలి ప్రయత్నంలోనే  రెండో ర్యాంకు సాధించాడు.. ఎన్‌. లక్ష్మీ వెంకటేష్‌. తన విజయానికి ఏ అంశాలు దోహదపడ్డాయో తన మాటల్లోనే తెలుసుకుందాం!  

మా సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు సమీపంలోని రేపూరు. నాన్న సత్యనారాయణ రైతు. అమ్మ భాగ్యలక్ష్మీకుమారి. విశాఖపట్నం గాయత్రి విద్యాపరిషత్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఈసీఈ బ్రాంచితో బీటెక్‌ (2015-2019) చదివాను. ప్రస్తుతం ముంబయి బార్క్‌లో ఉద్యోగం చేస్తున్నాను.  

ఈఎస్‌ఈ-2022లో రెండో ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు. కాకపోతే పరీక్షలు బాగా రాశాను కాబట్టి మంచి మార్కులు వస్తాయని మాత్రం అనుకున్నాను. 2021 కరోనా రెండో లాక్‌డౌన్‌లో ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాను. నా సీనియర్లు కొంతమంది ఈ పరీక్ష రాయడం మంచిదని సూచించారు. అలా సన్నద్ధమయ్యాను. బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతుండగా గేట్‌-2019 రాశాను. అందులో 97వ ర్యాంకు వచ్చింది. గేట్‌, ఈఎస్‌ఈల సిలబస్‌ చాలావరకూ ఉమ్మడిగా ఉంటుంది. అందువల్ల అప్పుడు చదివింది ఈఎస్‌ఈకి ఎంతో ఉపయోగపడింది.

ఈఎస్‌ఈలో రెండు రకాల పేపర్లున్నాయి. 1) జనరల్‌ స్టడీస్‌  2) టెక్నికల్‌. నాకు జనరల్‌ స్టడీస్‌ మీద అంతగా అవగాహన లేకపోవడం వల్ల దానికి నేను ‘ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ’ నుంచి ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకున్నాను. కోచింగ్‌ వల్ల.. ఎంత పరిమితి వరకూ చదవాలి, అందులో వేటి మీద దృష్టి పెట్టాలి అనేది బాగా అర్థమైంది. నేర్చుకోవడం సులభంగా మారింది. టెక్నికల్‌ 75 శాతం వరకూ గేట్‌లో చదివింది కావడం వల్ల మిగిలిన 25 శాతం సొంతంగా నేర్చుకున్నాను.

రివిజన్‌తో కాన్సెప్టుపై పట్టు

అభ్యర్థులు ముందుగా సిలబస్‌ అంతా ఒక్కసారైనా పూర్తిచేయడం ఎంతైనా అవసరం. బలహీనంగా ఉన్న సబ్జెక్టులు ఏవైనా ఉంటే.. కనీసం వాటి బేసిక్స్‌ అయినా సరే చదవాలి. తర్వాత రివిజన్‌ (పునశ్చరణ) ఎంతో ముఖ్యం. కనీసం 4 నుంచి 5 సార్లయినా రివిజన్‌ చేయాలి. పునశ్చరణ చేసిన ప్రతిసారీ కాన్సెప్ట్‌ ఇంకా బాగా అర్థమవుతుంది.

టెస్ట్‌ సిరీస్‌ రాయాలి. దీనివల్ల మనకు ఎంత వచ్చనేది అర్థమవుతుంది. ఇచ్చిన సమయంలోనే పరీక్ష రాయడం కూడా అలవాటవుతుంది. టెస్ట్‌ సిరీస్‌లో వచ్చిన తప్పులను ఒక ఎర్రర్‌ నోట్స్‌లో రాసుకుని, రావడానికి కారణాలను తెలుసుకుని, అవి రిపీట్‌ కాకుండా చూసుకోవాలి. కాన్సెప్ట్స్‌ మీద పట్టు రావాలంటే వాటికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు చదవడం (కనీసం ఒక్కసారైనా) ఎంతైనా అవసరం.


ఈఎస్‌ఈనే కాదు, ఏ పోటీ పరీక్షలోనైనా అభ్యర్థి ముందుగా తనను తాను నమ్మాలి. ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే చాలామంది ఫెయిల్‌ అవుతున్నారు. క్రమశిక్షణ, సన్నద్ధతలో నిలకడ అనేవి చాలా అవసరం. కొంతమంది పరీక్షను తేలికగా తీసుకుంటుంటారు. దీనివల్ల విజయం దూరమవుతుంటుంది.


ఉద్యోగం చేస్తుండటం వల్ల మామూలు రోజుల్లో లైబ్రరీకి వెళ్లి 3 నుంచి 4 గంటలు.. వారాంతాల్లో 6 నుంచి 8 గంటలపాటు చదివాను. జనరల్‌ స్టడీస్‌లో కరెంట్‌ అఫైర్స్‌ ఉండటం వల్ల రోజూ వార్తలు అనుసరించేవాడిని. మిగిలిన సబ్జెక్టులకు నోట్‌బుక్స్‌ చదివేవాడిని. ఏస్‌ అకాడమీ టెస్ట్‌ సిరీస్‌ ఫాలో అయ్యాను. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కి కూడా ఇది ఎంతో ఉపయోగపడింది.

టెక్నికల్‌ సబ్జెక్టులు మాత్రమే సరిపోవు

చాలామంది ఇంజినీరింగ్‌ నేపథ్యం వల్ల జనరల్‌ స్టడీస్‌కి పెద్దగా సన్నద్ధం కారు. కాకపోతే సెలక్షన్‌లో ఇది ఎంతో అవసరం. కాబట్టి టెక్నికల్‌ సబ్జెక్టులతోపాటు జనరల్‌ స్టడీస్‌కూ బాగా సన్నద్ధం కావాలి. రోజూ కొంత సమయాన్ని టెక్నికల్‌కూ, మిగిలిన సమయాన్ని జనరల్‌ స్టడీస్‌కూ కేటాయించాలి.

గత సంవత్సరాల పేపర్లు చూడటం వల్ల పరీక్ష మీద అవగాహన వస్తుంది. వాటిని నిజమైన పరీక్షలా పరిగణించి రాయాలి. రివిజన్‌, టెస్ట్‌ సిరీస్‌ ఈఎస్‌ఈ విజయానికి చాలా ముఖ్యమని మర్చిపోకూడదు. ప్రతి సబ్జెక్టూ ఎంతవరకు చదవాలనేది కూడా తెలిసి ఉండాలి. (ముఖ్యంగా జనరల్‌ స్టడీస్‌లో). దీనికి కోచింగ్‌ ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశం. మార్కులు తక్కువగా వస్తాయని.. చాలామంది టెస్ట్‌ సిరీస్‌ రాయడానికి భయపడతారు. కానీ టెస్ట్‌ సిరీస్‌ని మన తప్పులను తెలిపే ప్రక్రియగానే చూడాలి. వచ్చే ఫలితాలను చూసి భయపడకూడదు. టెస్ట్‌ సిరీస్‌లో వచ్చిన తప్పులను శ్రద్ధగా గమనించాలి. ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని