నైపుణ్యాలకు నగిషీ... కొలువులో ఖుషీ!
కెరియర్ కూడా క్రికెట్ క్రీడ లాంటిదే! నేర్చుకున్న అంశాలకే పరిమితమైతే ట్వంటీ-20లా ముగుస్తుంది. కొన్నాళ్లపాటు కొత్తవి నేర్చుకుంటే వన్డే ఇన్నింగ్స్ మాదిరిగానూ, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటే టెస్టు సిరీస్‌లా సుదీర్ఘంగానూ కొనసాగుతుంది. నేర్చు కోవడాన్ని సరిపెట్టుకుంటే ఉద్యోగాన్ని వదిలి పెట్టడానికి దగ్గరైనట్లే! అందుకే ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిందే!
ప్రస్తుతం డిగ్రీ పట్టాలు చేతికందుకుని, ఏదైనా కోర్సు లేదా టెక్నాలజీపై పట్టు సాధించినవారికి వెంటనే కాకపోయినా కొన్నాళ్లకు ఉద్యోగం లభిస్తోంది. అయితే చేరిన విభాగం (టెక్నాలజీ)లోనే పూర్తికాలం కొనసాగే పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. సాంకేతిక వినియోగం పెరగడంతో ఉన్న ఉద్యోగాల్లో కొన్ని అదృశ్యమవుతున్నాయి. అలాగే కొత్తవీ పుట్టుకొస్తున్నాయి. ఈ పరిణామంతో... నేర్చుకోవడంపై ఆసక్తి లేనివాళ్లు వైదొలుగుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకున్నవారు కొనసాగుతున్నారు. అందువల్ల ఒడుదొడుకులు లేని కెరియర్ సొంతం చేసుకోవడానికి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం తప్పనిసరి. ఉద్యోగం చేస్తూనే..విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలి. ఉన్న నైపుణ్యాలకే పరిమితమైతే తొలగింపునకు ఆహ్వానం పలికినవారమవుతాము.
మార్పే మంత్రం: కొత్త టెక్నాలజీలు.. కొత్త సంస్థలు.. కొత్త అవకాశాలు..విస్తరిస్తోన్న తరుణంలో ఇప్పటివరకు నేర్చుకున్నవాటితో అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. ప్రపంచంతో పరుగులు తీయాలంటే తాజా మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. మార్పునకు సిద్ధం కావడమంటే రీ స్కిల్లింగ్‌కు ఆహ్వానం పలకడమే. భవిష్యత్తులో పోటీ ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా ఎదురవుతుందో ఊహించడం కష్టం. అందువల్ల ‘ఏమీ కాదులే’ అనుకుంటే నష్టపోక తప్పదు. ప్రస్తుతం సంస్థలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. అలాగే ఒక్క ఉద్యోగానికి వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ రెండు పరిస్థితుల మధ్య అవకాశాలు సొంతం చేసుకోవడం ఎంత కష్టమో, అందులో ఎక్కువ కాలం కొనసాగడం అంతకు మించిన సవాల్. అందువల్ల ఉద్యోగాన్ని ఆశించేవాళ్లు, ఉద్యోగ జీవితంలో ఉన్నవారు.. లెర్న్..అన్ లెర్న్.. రీ లెర్న్ విధానాన్ని తమ డీఎన్‌ఏగా మార్చుకోవాలి.
మెరుగులద్దండి: ప్రతి ఉద్యోగిలోనూ ప్రత్యేక నైపుణ్యాలుంటాయి. నేర్చుకున్న నైపుణ్యాలే బలమైన పునాదులుగా నిలబడతాయి. సామర్థ్యం ఉన్న నైపుణ్యాలపై మరింత సాధన చేయాలి. వాటిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి. నేర్చుకున్న అంశాలను పనిలో మరింత మెరుగ్గా ప్రదర్శించాలి. ఆ పని సులువుగా పూర్తి కావడానికి అవి తోడ్పడాలి. నిరంతర సాధన, సునిశిత పరిశీలన, అనుభవం ద్వారా చేస్తున్న పనిపై పట్టు లభిస్తుంది. దాన్ని మెరుగ్గా, నాణ్యంగా చేయడానికి వీలవుతుంది.
విస్తరించండి: మీ నైపుణ్యాలు, పనిని అనుసరించి వాటికి అనుబంధంగా ఉన్న అంశాలపై దృష్టి సారించాలి. ఉదాహరణకు సంప్రదాయ అడ్వర్టైజింగ్ నిపుణులు డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ (ఎస్‌ఈఎం)ల్లో ప్రావీణ్యానికి ప్రయత్నించవచ్చు. ఇలా చేయడం వల్ల అదే వృత్తిని వేరే వేదికపై కొనసాగించడానికి వీలవుతుంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేస్తోన్నవారు.. వాటికి సంబంధించిన లేదా అనుబంధ సాంకేతికతపై పట్టు సాధించాలి. దీంతో భవిష్యత్తు పరిణామాలు ఇబ్బందులు సృష్టించవు.
ఆన్‌లైన్ అస్త్రం: కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌ను మించిన వేదిక లేదు. నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడాన్ని సంస్థలూ ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం సమయం, డబ్బునీ వెచ్చిస్తున్నాయి. పూర్తిగా సంస్థలపైనే ఆధారపడకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా నేర్చుకోవడానికి ఎన్నో దారులున్నాయి. నామ మాత్రపు ఫీజు చెల్లించి, పరీక్ష రాసి నేర్చుకున్న అంశంలో సర్టిఫికెట్ అందుకోవచ్చు. సంస్థలోపల, బయట ఉన్న ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దీనిద్వారా భిన్న అంశాల్లో ప్రావీణ్యం పొందవచ్చు. అలాగే నేర్చుకోవడంపై మీకున్న ఆసక్తి సంస్థలకు అర్థమవుతుంది. రెజ్యుమేలోనూ ఈ స్కిల్స్ చేర్చుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే అవకాశాలను తేలికగా అందిపుచ్చుకోవచ్చు. వీలు కుదుర్చుకుని సెమినార్లు, వర్క్‌షాప్‌లు, వెబినార్లలో పాల్గొంటూ ఉండాలి.
సాఫ్ట్ స్కిల్స్: ఉద్యోగంలో రాణించడానికీ, ఉన్నత స్థాయికి చేరుకోవడానికీ విషయపరిజ్ఞానం ఒక్కటే సరిపోదు.సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవడం తప్పనిసరి. సృజన, భావోద్వేగ నియంత్రణ, కమ్యూనికేషన్, శ్రద్ధగా వినడం, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడం, బృందంతో మమేకం కావడం, చొరవ, బాధ్యత తీసుకోవడం, సమస్యలను పరిష్కరించగలగడం, పనిపరమైన సవాళ్లను స్వీకరించడం..వీటన్నింటిపైనా
దృష్టి పెట్టాలి.
టెక్నాలజీపై పట్టు: ఉద్యోగానికి ఢోకా లేకుండా అందులో కొనసాగడానికి అప్ టు డేట్‌గా ఉండటమే కీలకం. ఎవరికివారే ఉన్న నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకుని, కొత్తవి నేర్చుకోవాలి. సంస్థలు కఠిన పరీక్షలు, సాంకేతికత ద్వారా ఉద్యోగులను అంచనా వేసి అవసరం లేనివారిని తొలగిస్తున్నాయి. ఉద్యోగం శాశ్వతంగా ఉండాలంటే మార్పు తప్పనిసరి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినవాళ్లు.. తాజా మార్పులను ముందే పసిగట్టి సంస్థకు విలువైన ఉద్యోగిగా మారగలరు. మీకు ప్రత్యామ్నాయం లేదని సంస్థ భావించినప్పుడే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. కొత్త అవకాశాలకూ పోటీ పడవచ్చు.
ఉద్యోగార్థులూ... గమనించండి
సంస్థ ఏ రంగానికి చెందింది అయినప్పటికీ అభివృద్ధి మాత్రం మానవ వనరుల నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. విలువైన ఉద్యోగులే సంస్థ నుంచి మేటి సంస్థ స్థాయికి తీసుకెళ్లగలరు. ప్రస్తుత మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర పోటీ తట్టుకుని వ్యాపార సంస్థలు ముందుకెళ్లడంలో నియామకాలే కీలక పాత్ర వహిస్తున్నాయి. అవసరమైన నైపుణ్యాలున్న, సరైన అభ్యర్థులపై పూర్తి దృష్టి సారిస్తున్నాయి. ఎక్కువమందిని ఆకర్షించడానికి తమను తాము ఉన్నతీకరించుకుంటున్నాయి.
సాంకేతికతే అస్త్రం
నియామక ప్రక్రియ కోసం ఎక్కువ సమయం వెచ్చించడంతోపాటు, ఒత్తిడినీ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఎంత పకడ్బందీగా ముందుకెళ్లినప్పటికీ మానవ తప్పిదాలకు అవకాశం ఉంది. అందువల్ల ఉద్యోగుల ఎంపికలో సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాయి. సరైన అభ్యర్థులను ఒడిసిపట్టి, విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ బోట్స్ కీలకమయ్యాయి. సమర్థులైన మానవ వనరులను ఆకర్షించి, వాళ్లు నియామకాల్లో భాగస్వాములు కావడానికి రిక్రూట్‌మెంట్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ (ఆర్‌ఎంఎస్)ను ఉపయోగిస్తున్నాయి. అలాగే వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏటీసీ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. బోట్స్, టూల్స్ కారణంగా నియామక ప్రక్రియ వేగంగా, సులువుగా అన్నింటికంటే ముఖ్యంగా కచ్చితత్వంతో, సమర్థంగా పూర్తవుతోంది. అర్హులను నియమించుకోవడంతోపాటు కొనసాగించడానికీ, పనితీరును సమీక్షించడానికీ, స్కిల్ గ్యాప్ అంచనా వేయడానికీ ఈ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. అందువల్ల గాలివాటంతో ఉద్యోగం వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. సత్తా ఉంటేనే ఆఫర్ లెటర్ చేతికొస్తుంది.
సోషల్ మీడియా
సరైన అభ్యర్థులను అన్వేషించడానికి సంస్థలు పాత పద్ధతులను దాటి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఉద్యోగార్థుల్లో ఎక్కువమందికి సోషల్ మీడియాలో ఖాతాలు ఉండటంతోపాటు, వారు వీలైనంత సమయం అందులో గడుపుతున్నారు. అందువల్ల ఖాళీల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక రెండు పనులకూ సోషల్ మీడియా చక్కని వేదికగా నిలుస్తోంది. ఎంపికైన అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లను నిశితంగా గమనిస్తున్నారు. రాజకీయ, మత పరమైన విమర్శలు, వివాదాస్పద అంశాలు, పరుష పదజాలం... మొదలైనవాటికి దూరంగా ఉండాలి. అభ్యర్థుల వ్యక్తిత్వానికి కొలమానంగా ఆన్‌లైన్ మీడియా ఖాతాను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
మల్టిపుల్ స్కిల్ సెట్
పని వాతావరణం తరచూ మారుతోంది. ఇప్పటి నైపుణ్యాలు రేపటి పనికి సరిపోకపోవచ్చు. భిన్న అంశాల్లో ప్రావీణ్యం ఉన్నవాళ్లు కొత్త విషయాలు, సాంకేతికతలను సులువుగా ఆకళింపు చేసుకోగలరు. అందువల్ల నియామక సంస్థలు అభ్యర్థుల నుంచి మల్టిపుల్ స్కిల్ సెట్ ఆశిస్తున్నాయి. అవసరమైనవాటికి పరిమితం కాకుండా అవసరానికి మించి నేర్చుకోవడంపై ఉద్యోగార్థులు దృష్టి సారించాలి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. కొనసాగుతోన్న మూడో రోజు సిట్ విచారణ
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..