షార్ట్‌నోట్సుతో సక్సెస్‌!

ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉన్నత స్థాయి పోటీ పరీక్ష రాయడానికి ఆమె సంసిద్ధమైంది. అందరిలా శిక్షణపైనే ఆధారపడకుండా సొంతంగా ‘షార్ట్‌నోట్సు’ తయారు చేసుకుని, సాధన చేసింది.

Updated : 10 Jan 2023 05:15 IST

ఈఎస్‌ఈ టాపర్‌ తేజస్విని

ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉన్నత స్థాయి పోటీ పరీక్ష రాయడానికి ఆమె సంసిద్ధమైంది. అందరిలా శిక్షణపైనే ఆధారపడకుండా సొంతంగా ‘షార్ట్‌నోట్సు’ తయారు చేసుకుని, సాధన చేసింది. ఇటీవల వెలువడిన ప్రతిష్ఠాత్మకమైన ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ (ఈఎస్‌ఈ) ఈ అండ్‌ టీ స్ట్రీమ్‌లో జాతీయస్థాయి మూడో ర్యాంకు సాధించారు దేవనబోయిన తేజస్విని. ప్రస్తుతం హైదరాబాద్‌లోని క్వాల్‌ కాం సంస్థలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఈమె తన సన్నద్ధత విశేషాలను  ఇలా వివరించారు...

ఎస్‌ఈలో ఏదో ఒక ర్యాంకు మాత్రమే వస్తుందనుకున్నా కానీ ఆలిండియా థర్డ్‌ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. ఫలితాలు చూశాక నా శ్రమ ఫలించిందనిపించింది. వాస్తవానికి 2019, 2020లలో వరుసగా ఈఎస్‌ఈ నెగ్గాలని ప్రయత్నించి విఫలమయ్యాను. మొదటి సారి ప్రిలిమినరీ, రెండోసారి ఇంటర్వూ వరకు వెళ్లి వెనుదిరగాల్సి వచ్చింది. అపజయాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి సఫలమయ్యాను.  

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌ మా నివాసం. నాన్న వెంకట్రావు విశ్రాంత ఉద్యోగి. అమ్మ కృష్ణకుమారి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగిని. నారాయణ ఒలింపియాడ్‌ స్కూల్లో టెన్త్‌, నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాను. మొదట ఇంజినీరింగ్‌ సర్వీస్‌ గురించి నాకేమాత్రమూ అవగాహన లేదు. కానీ ఓ సారి మా అమ్మ చెప్పడంతో ఆసక్తి పెరిగింది. 2016లో హైదరాబాద్‌ ఐఐఐటీలో బీటెక్‌ (ఈసీఈ) చేశాను. తర్వాత ఈఎస్‌ఈపై లోతుగా శోధించి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అమ్మానాన్నలతో పాటు అక్క గీతిక కూడా నన్ను ప్రోత్సహించి అండగా నిలిచింది.  

‘గేట్‌’ రాసి 122వ ర్యాంకు సాధించాను. ఈ సన్నద్ధత ఈఎస్‌ఈకి ఎంతగానో ఉపయోగపడింది. గేట్‌లో క్లిష్టమైన ప్రశ్నలు ఇస్తారు గానీ ఈఎస్‌ఈలో అంతకంటే సంక్లిష్టమైన ప్రశ్నలుండటం వల్ల ఆ అనుభవం దీనికి దోహదపడింది.

మాక్‌ టెస్టులు

హైదరాబాద్‌ ఆబిడ్స్‌లోని ఏస్‌ అకాడమీలో, దిల్లీలోని మేడ్‌ఈజీ కేంద్రాల్లో ఐదేసి నెలల చొప్పున శిక్షణ తీసుకున్నాను. ఈ పరీక్షలో శిక్షణ తీసుకోకుండా రాణించడం కష్టం. టెక్నికల్‌లో 15, నాన్‌ టెక్నికల్‌లో 10 సబ్జెక్టులుంటాయి. ప్రిలిమినరీలో ఆబ్జెక్టు విధానంలోనూ, మెయిన్స్‌లో ప్రశ్న-జవాబు తరహాలో పరీక్షలు రాయాలి. దీనికోసం అనేక ‘మాక్‌ టెస్టు’లు రాశాను. అందులోని ప్రధాన అంశాలను తరచూ పునశ్చరణ చేసుకున్నాను. ప్రాక్టీస్‌ కోసం ఎక్కువగా మాక్‌టెస్ట్‌లపైనే ఆధారపడ్డాను. అందులోంచి తప్పుల జాబితాను రూపొందించి అవి పునరావృతం కాకుండా ప్రత్యేక కసరత్తు చేశాను. తద్వారా కచ్చితత్వం, వేగం పెంచుకోగలిగాను.

ఈఎస్‌ఈ మీ లక్ష్యమైతే..  

* ప్రతి అభ్యర్థికీ ప్రధానంగా ‘ఎగ్జామ్‌ మేనేజ్‌మెంట్‌’ అవసరం. ప్రిలిమినరీ, మెయిన్స్‌ అంశాలపై ప్రధాన దృష్టిని సారించాలి. వాస్తవానికి ఈ రెండు దశలే అభ్యర్థికి 80 శాతం విజయావకాశాలు అందిస్తాయి.

* ఎవరికి వారు తమ స్థాయికి సరిపోయేలా సొంత వ్యూహాన్ని అనుసరించాలి.

* అభ్యర్థులు సమయ నిర్వహణపై దృష్టి పెట్టడం ప్రధానం.

* సాధారణంగా పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఒకే సబ్జెక్టులో పలు పుస్తకాలు చదువుతుంటారు. దీంతో సమయం వృథా. ప్రాక్టీస్‌కు వీలుండదు. సమయాభావంతో కొందరు కొన్ని సబ్జెక్టును చదవకుండా పూర్తిగా వదిలేస్తారు. దీంతో నష్టం ఎక్కువ. అలా కాకుండా అన్ని అంశాలూ చదివి, ప్రాక్టీస్‌ చేయటం వల్ల పరీక్షల్లో సులభమైన ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాసే అవకాశం ఉంటుంది.

పాఠ్యాంశాలపై పట్టు

కోచింగ్‌ సెంటర్‌లో బోధించిన ‘క్లాస్‌నోట్స్‌’ నుంచి కీలకమైన అంశాల కూర్పుతో సొంతంగా ‘షార్ట్‌నోట్సు’ తయారు చేసుకున్నాను. దాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకోవడం నాకున్న అలవాటు. దాంతో ‘ఫొటోగ్రాఫిక్‌ మెమరీ’ విధానం అబ్బింది. ఈ పరీక్షల్లో విజయం సాధించడానికి ఆ విధానం నాకు దోహదపడింది. ప్రాక్టీస్‌ కోసం అనేక మాక్‌టెస్ట్‌లు రాయడంతో ప్రతి సబ్జెక్టుపైనా గట్టి పట్టును సాధించాను. రోజుకు 4 నుంచి 6 గంటల వరకు ప్రిపేర్‌ అయ్యాను. సెలవు రోజుల్లో అయితే ఆ సమయం మరింత పెరిగేది. ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలై ఉన్నప్పటికీ నాకున్న సమయాన్ని ఈఎస్‌ఈ సన్నద్ధతకు సద్వినియోగం చేసుకోగలిగాను.

కోచింగ్‌ కేంద్రాల వారిచ్చిన శిక్షణతో పాటు ఆన్‌లైన్‌లో ‘మాక్‌టెస్ట్‌’లతో ఎక్కువ ప్రాక్టీస్‌ చేశాను. ఇతర పుస్తకాలపై ఆధారపడకుండా రివిజన్‌కే ఎక్కువ సమయాన్ని కేటాయించాను. కొన్ని సందర్భాల్లో మాత్రమే..అదీ సందేహాల నివృత్తి కోసం వెబ్‌సైట్లను ఆశ్రయించాను.

ముత్యాల నర్సింహులు, న్యూస్‌టుడే, మూసాపేట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని