IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో... ఎంబీఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం

ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్‌మెంట్‌, మెడిసిన్‌, లా...కోర్సులను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఎన్నాళ్ల నుంచో నడుపుతోంది. ఈ సంస్థ అందించే మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌ఎం), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) కోర్సులు ప్రతిష్ఠాత్మకమైనవిగా గుర్తింపు పొందాయి.

Updated : 17 Jan 2023 03:58 IST

ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్‌మెంట్‌, మెడిసిన్‌, లా...కోర్సులను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఎన్నాళ్ల నుంచో నడుపుతోంది. ఈ సంస్థ అందించే మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌ఎం), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) కోర్సులు ప్రతిష్ఠాత్మకమైనవిగా గుర్తింపు పొందాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్‌ లెటర్లు అందుకుంటున్నారు.  తాజాగా ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!

మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌ఎం) కోర్సును ఖరగ్‌పూర్‌ ఐఐటీ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ అందిస్తోంది. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ సంస్థలకు అవసరమయ్యే మానవ వనరుల నిపుణులను అందించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 4 సెమిస్టర్లు. ఇందులో చేరినవాళ్లు ప్రముఖ సంస్థల్లో మానవవనరుల విభాగం (హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌)లో ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

అర్హత: నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఏదైనా పీజీలో జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రస్తుతం యూజీ చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. క్యాట్‌ 2022 స్కోర్‌ తప్పనిసరి. జనరల్‌, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు 80, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ 72, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 53.33 పర్సంటైల్‌ క్యాట్‌ స్కోర్‌ కటాఫ్‌గా నిర్ణయించారు. అకడమిక్‌ నేపథ్యం, క్యాట్‌ స్కోరులతో షార్ట్‌లిస్టు చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు.

గత ఏడాది ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారికి రూ.23 లక్షల గరిష్ఠ వార్షిక వేతనంతో సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. సగటు వేతనం రూ.15.43 లక్షలు పొందారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా సంస్థలు వీరికి స్టైపెండ్‌ అందిస్తున్నాయి. గరిష్ఠ స్టైపెండ్‌ రూ.2.12 లక్షలు కాగా సగటు స్టైపెండ్‌ రూ.1.15 లక్షలు. ట్యూషన్‌ ఫీజు ప్రతి సెమిస్టర్‌కు రూ.75,000 చెల్లించాలి. దీనికి వసతి, భోజనం, ఇతర ఖర్చులు అదనం. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7
ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: మార్చి నాలుగో వారంలో.
ఫలితాలు: మేలో.
వెబ్‌సైట్‌: http://www.iitkgp.ac.in/mhrm


ఎంబీఏ

అర్హత: ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సైన్స్‌/ఎకనామిక్స్‌/ కామర్స్‌ల్లో మాస్టర్‌ డిగ్రీ. వీరు యూజీలో మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌ చదివుండాలి. సంబంధిత కోర్సుల్లో 60 శాతం మార్కులు లేదా 6.5 సీజీపీఏ తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు లేదా 6 సీజీపీఏ అవసరం. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: క్యాట్‌-2022లో స్కోర్‌ తప్పనిసరి. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌లు 90, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ 80, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 75 పర్సంటైల్‌ ఉండాలి. ఈ స్కోరుతోపాటు అకడమిక్‌ ప్రతిభ, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. షార్ట్‌ లిస్టు చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి. తుది ఎంపికలో అప్లికేషన్‌ రేటింగ్‌ 20, క్యాట్‌ స్కోరు 40, ఇంటర్వ్యూ 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు మార్చిలో నిర్వహిస్తారు.  ఫలితాలు మేలో వెలువడతాయి.  

రెండేళ్ల ఎంబీఏ కోర్సు రెసిడెన్షియల్‌ విధానంలో కొనసాగుతుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రాంగణంలోని వినోద్‌ గుప్తా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ కోర్సు అందిస్తుంది. 4 సెమిస్టర్లు ఉంటాయి. కోర్సు ఫీజు మొత్తం సుమారు రూ.12 లక్షలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ట్యూషన్‌ ఫీజు మినహాయిస్తారు. 2023-25 విద్యా సంవత్సరానికి 200 సీట్లు కేటాయించారు. ఇక్కడ ఎంబీఏ పూర్తిచేసుకున్నవారికి బహుళజాతి సంస్థలు రూ.లక్షల వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. వీరిని ఎక్కువగా సాంకేతిక సేవలు అందించే సంస్థలు నియమించుకుంటున్నాయి.    

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు  చివరి తేదీ: ఫిబ్రవరి 5
వెబ్‌సైట్‌: https://som.iitkgp.ac.in/MBA/impdates.php


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని