Updated : 18 Jan 2023 04:35 IST

ఉద్యోగాలొస్తున్నాయ్‌... కొత్త తరహాలో!

కాలం చాలా వేగంగా మారుతోంది. తాను మారుతూ పరిస్థితులనూ మార్చేస్తోంది. ఒకప్పుడు ఉన్న ఉద్యోగాల్లో చాలా రకాలు ఇప్పుడు లేవు. అలాగే ఇప్పుడు ఉన్నవాటిలో కొన్ని భవిష్యత్తులో ఉండకపోవచ్చు.

రాబోయే కాలంలో ఎటువంటి కొలువులు ఉంటాయనే ఆలోచన, అవగాహన విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఉండాలి. అప్పుడే వారు జాబ్‌ మార్కెట్‌కు తగినట్టు తమను తాము  తయారు చేసుకోగలరు. నూతన సంవత్సర నేపథ్యంలో... ఇటీవల దీనిపై కొన్ని అంచనాలు, నివేదికలు విడుదలయ్యాయి. మరి సమీప భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు రూపొందనున్నాయో మీరూ చూసేయండి.

క్రియేటర్‌ అడ్వైజర్స్‌

గడిచిన పదేళ్లలో డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు బాగా పెరిగారు. ప్రస్తుతం స్థిరాదాయం ఇచ్చే కెరియర్లలో కంటెంట్‌ క్రియేటింగ్‌ కూడా ఒకటిగా మారిపోయింది. ఇప్పుడు దీనికి అనుబంధంగా మరిన్ని ఉద్యోగాలు రూపొందనున్నాయి. ఈ క్రియేటర్లకు అడ్వైజరీ సంస్థలుగా ఇప్పటికే కొన్ని కంపెనీలు వెలిశాయి
8 వ్యక్తులు సైతం క్రియేటర్‌ బృందంగా ఉంటూ పనిచేస్తున్నారు. క్రియేటర్ల పనితీరును గమనిస్తూ ఉండటం, వారు కనిపించే తీరు - మాట్లాడే విధానంపై సలహాలు... సూచనలు ఇవ్వడం, ప్రేక్షకులు, నెటిజన్లతో దగ్గరగా ఉండేలా చూడటం, ఎప్పుటికప్పుడు రీచ్‌ పెంచుకోవడం.. ఇలా వారికి సహాయ సహకారాలు అందించేలా వీరి సేవలు ఉంటాయి. క్రియేటర్లు పెరిగేకొద్దీ పీఆర్‌ టీం, ఇతర స్టాఫ్‌ అవసరం పడుతుంది. అందువల్ల ఈ విభాగంలో ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా..

టాలెంట్‌ మేనేజర్లు

దీన్ని ఇప్పటికే ఉన్న హెచ్‌ఆర్‌ విభాగాలకు అనుబంధంగా చెప్పవచ్చు. అయితే ఇది ఇంకొంచెం సునిశితంగానూ విశ్లేషణాత్మకంగానూ పనిచేయాల్సిన విభాగం. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగుల బలాలు, బలహీనతలను గుర్తిస్తూ... వారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ, మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేయడమే టాలెంట్‌ మేనేజర్‌ పని. వారి నైపుణ్యాలకు మెరుగుపెట్టేలా ఎప్పటికప్పుడు సంస్థ తరఫున శిక్షణ లభించేలా చేస్తూ, కంపెనీ పట్ల ఉద్యోగులకు ఇష్టం, నమ్మకం పెరిగేలా చేయడం వంటి విధులుంటాయి. ఒకరకంగా వీరు సంస్థకూ ఉద్యోగులకూ మధ్య అనుసంధానకర్తలా వ్యవహరిస్తారు. వ్యక్తుల ప్రాధాన్యాలు, ప్రవర్తన వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో... కొత్తతరం ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు సంస్థలకు వీరి సేవలు అవసరం కానున్నాయి.

టాకర్‌/వాకర్‌

ఒంటరితనం రాబోయే కాలంలో పెరగబోయే అతిపెద్ద సమస్య.. ఇప్పటికే దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో కరోనా సమయంలో చూశాం. చిన్న కుటుంబాలు పెరగడం, పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడో దూరంగా ఉండాల్సి రావడం... ఇంకా రకరకాలైన కారణాలతో ఒంటరిగా ఉండే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ ఇలాంటివారికి అనారోగ్య సమయాల్లో సాయం చేసేందుకు వివిధ సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ ఇక మీదట వీరికి రోజువారీగానూ సేవలు అందించేలా ఉద్యోగాలు తయారుకానున్నాయి. వృద్ధులతో వాకింగ్‌కు వెళ్లడం, వారితో మాట్లాడటం, స్నేహం చేయడం, ఇవన్నీ కెరియర్‌ అవకాశాలుగా మారనున్నాయి! తమ మనసులోని మాటలను శ్రద్ధగా వినే వారు లేక లోలోపల కుంగిపోయే వారికి ఆసరాగా నిలిచే ఇటువంటి ఉద్యోగాలకు మెట్రో నగరాల్లో అధికంగా డిమాండ్‌ ఉంటుందని అంచనా.

పర్సనల్‌ ట్రైనర్‌

ఒకప్పుడు సెలబ్రిటీలకే పరిమితమైన పర్సనల్‌ ట్రైనర్ల సేవలను ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, పోషకాహారం... వీటిపై అవగాహన పెరగడమే ఇందుకు కారణం. జిమ్‌లో, క్రీడల్లో కోచింగ్‌ కోరుకుంటున్నారు. అందువల్ల ఫిజికల్‌ థెరపిస్ట్‌, పర్సనల్‌ ట్రైనర్‌/కోచ్‌, న్యూట్రిషనిస్ట్‌ వంటి వారి సేవలు అవసరం కానున్నాయి.


ఆన్‌లైన్‌ గురువులు

దేన్నయినా సరే...ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం ఇప్పుడు చాలా మామూలై పోయింది. దీంతో అంతర్జాలం ద్వారా విషయాలను నేర్పించేవారి అవసరం కూడా పెరిగింది. ఏ వయసు వారికైనా, ఏ సబ్జెక్టు గురించైనా లేక హాబీ, ఇతర అంశాలు, ఏవైనా సరే... ఇంటర్నెట్‌ ద్వారా నేర్పించేవారు ఈ కోవకు చెందుతారు. వీరు కావాలంటే ఇతర సంస్థలతో అనుసంధానం కావొచ్చు లేదా సొంతంగానూ పనిచేసుకోవచ్చు. కావాల్సినదల్లా తమకున్న పరిజ్ఞానం, అనుభవాన్ని ఇతరులకు పంచిపెట్టడమే. ఇందుకోసం ఇప్పటికే పలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ రూపొందాయి. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్‌ పెరుగుతుందని పేర్కొంటున్నారు. నచ్చిన సమయంలో, వచ్చిన పనిని నేర్పించే ఈ కొలువులు... కొత్త తరానికి నచ్చుతాయనడంలో సందేహమే లేదు!

* ఇవేకాకుండా ప్రస్తుతం ఉన్నవాటిలో రాబోయే కాలంలో మరింత డిమాండ్‌ పెరగనున్న ఉద్యోగాలు ఏవంటే...డేటా సైంటిస్ట్‌, మెషీన్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పర్ట్‌, మెడికల్‌ ప్రొఫెషనల్స్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌, ప్రొడక్ట్‌ మేనేజర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, బ్లాక్‌చెయిన్‌ డెవలపర్‌, జర్నలిస్ట్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌, వెబ్‌డెవలపర్‌, డిజైనర్‌. వీటికి వచ్చే పదేళ్లలో మరింత ఆదరణ ఉంటుందని అంచనా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు