Published : 02 Feb 2023 00:24 IST

అలంకరణకూ అభ్యాసం..

ఈవెంట్‌ డెకార్‌ టెక్నాలజీ

వేడుక ఏదైనా వేదిక ఉంటుంది... ఆతిథ్యంతోపాటూ అలంకరణకూ ప్రాధాన్యం ఉంటుంది! అందుకే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కెరియర్‌లో ముఖ్యభాగమైన ‘ఈవెంట్‌ డెకార్‌’ ఇప్పుడు ప్రత్యేకమైన కెరియర్‌గా రూపుదిద్దుకుంటోంది!  ఆహూతులను అలరించేలా అలంకరించడం నేర్చుకుని, సొంతంగా ఈ వృత్తిలో రాణిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. మనమూ దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

వేడుక అయినా జరిగేది కొన్ని గంటలపాటు మాత్రమే కావొచ్చు... కానీ అది మిగిల్చే జ్ఞాపకాల గడువు ఒక జీవితకాలం! అందుకే వాటిని వీలైనంత అందంగా, ఆనందంగా మలుచుకోవాలని ప్రతిఒక్కరూ భావిస్తుంటారు. దీనివల్లే గత కొన్నేళ్లుగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌ విపరీతంగా పెరిగింది. కార్యక్రమం ఏదైనా విజయవంతంగా నడిపించే నిపుణులు అవసరమవుతున్నారు. అయితే మొత్తం కార్యక్రమంలో అలంకరణదో ప్రత్యేక అధ్యాయం.

* పెళ్లి, పుట్టినరోజు, వ్యాపార - కార్పొరేట్‌ ఈవెంట్లు, ప్రభుత్వ కార్యక్రమాలు... ఇలా ఏ కార్యానికైనా సరే, వేదికను - పరిసరాలను చక్కగా అలకరించడం డెకరేటర్‌ విధి. సృజనకు పట్టం కట్టే ఈ పనిలో కొత్తగా ఆలోచించేవారికి అవకాశాలకు కొదవే లేదు. కావాల్సినదల్లా ప్రతిచిన్న విషయాన్నీ సూక్ష్మంగా పరిశీలించగలిగే నైపుణ్యం, ఏం చేస్తే అందంగా ఉంటుందని పసిగట్టే ఊహాశక్తి మాత్రమే. దీనికోసం చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ఏం నేర్చుకుంటారు..?

కోర్సుల్లో భాగంగా అలంకరణలో ప్రతి చిన్న విషయాన్నీ అభ్యర్థులు క్షుణ్ణంగా నేర్చుకుంటారు. వేదిక ఎలా కనిపించాలి, కార్యక్రమానికి తగినట్టు ఎలా స్టైల్‌ చేయాలి, ఎటువంటి రంగులను ఎంచుకోవాలి, సందర్భాన్ని అనుసరించి ఆ రంగులను ఎలా మిక్స్‌ - మ్యాచ్‌ - బ్యాలెన్స్‌ చేయాలి, అలంకరణలో పూల ప్రాధాన్యం - వాటిలో రకాలు- ఎంపిక, సీలింగ్‌ డెకరేషన్‌, లైటింగ్‌, బ్యాక్‌డ్రాప్స్‌, టేబుల్‌స్కేప్‌ డిజైనింగ్‌... ఇలా అన్నీ నేర్చుకుంటారు.

* ఇందులో మళ్లీ బెలూన్‌ వర్క్‌, డ్రాపింగ్‌, ఫ్లోరల్‌ ఆర్ట్‌, కిడ్స్‌ థీమ్‌ పార్టీ డెకరేషన్‌, వెడ్డింగ్‌ డెకరేషన్‌ వంటివి ప్రత్యేకంగా విడివిడి కోర్సులు. సాధారణ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు దేశంలో అన్ని ప్రధాన విద్యాసంస్థల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అందులో అలంకరణను ఒక మాడ్యూల్‌గా విద్యార్థులు నేర్చుకుంటున్నారు. కానీ దీన్ని ప్రత్యేకంగా సాధన చేయడానికి మాత్రం ప్రస్తుతం అధికశాతం కోర్సులు ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. ఇప్పటికే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లో పేరుమోసిన సంస్థలు ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సులను నిర్వహించి, అర్హులకు తమ సంస్థల్లోనే ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.


ఉద్యోగాలెక్కడ...

కోర్సులు చేసినవారికి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలతోపాటు స్టార్‌హోటల్స్‌, డెకార్‌ అండ్‌ డిజైనింగ్‌ కంపెనీలు, వినోద పరిశ్రమలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కొంత పని అనుభవం తర్వాత సొంతంగానూ ప్రాజెక్టులు నిర్వహించవచ్చు.


పెళ్లిళ్లు మరో ఎత్తు...

మొత్తం కార్యక్రమాలన్నింటిలోనూ పెళ్లిళ్ల మార్కెట్‌ చాలా పెద్దది. వెడ్డింగ్‌ డిజైనింగ్‌ అండ్‌ డెకార్‌ సర్టిఫైడ్‌ డిప్లొమా కోర్సులు... ఆరు నెలల కాలవ్యవధితో దాదాపు లక్షరూపాయల ఫీజులతో లభిస్తున్నాయి. ఇవి డిజైనింగ్‌ గురించి మరింత లోతుగా నేర్పింగే ఎక్స్‌క్లూజివ్‌ కోర్సులు.

* ఇందులో పిచ్‌ ప్రెజెంటేషన్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఫ్యాబ్రికేషన్‌, బేసిక్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్‌, లేఅవుట్‌ - హ్యాండ్‌ స్కెచింగ్‌, డిజైనింగ్‌ విత్‌ సాప్ట్‌వేర్‌, కాస్టింగ్‌ అండ్‌ బడ్జెటింగ్‌ ఇలా అన్నీ నేర్చుకునే అవకాశం ఉంది. కనీసం ఇంటర్‌ విద్యార్హతతో ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఈ కోర్సులను అందిస్తున్న సంస్థలు ఆన్‌లైన్‌ లైవ్‌ క్లాసులను సైతం నిర్వహిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ సంస్థలతోపాటు యుడెమీ, సింప్లీలెర్న్‌, కోర్సెరా వంటి ఆన్‌లైన్‌ సంస్థల్లోనూ ఈ కోర్సును సాధన చేసే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు