UPSC: అందుకుంటారా.. సివిల్స్‌ సవాల్‌!

అభ్యర్థుల పరిణతికీ, విస్తృత విషయ పరిజ్ఞానానికీ సవాలు విసురుతుంది సివిల్స్‌. దేశంలోనే అత్యున్నతమైన ఈ సర్వీసులకు ఎంపికవ్వాలని ఎందరో విద్యార్థులు కలలు కంటుంటారు. లక్ష్య సాధనకు తదేక దీక్షతో సంసిద్ధమవుతుంటారు.

Updated : 06 Feb 2023 05:54 IST

అభ్యర్థుల పరిణతికీ, విస్తృత విషయ పరిజ్ఞానానికీ సవాలు విసురుతుంది సివిల్స్‌. దేశంలోనే అత్యున్నతమైన ఈ సర్వీసులకు ఎంపికవ్వాలని ఎందరో విద్యార్థులు కలలు కంటుంటారు. లక్ష్య సాధనకు తదేక దీక్షతో సంసిద్ధమవుతుంటారు. ఇప్పుడీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2023 నోటిఫికేషన్‌ వచ్చేసింది! యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా 21 సివిల్‌ సర్వీసులకు చెందిన 1105 ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. వీటికి పోటీ పడాలంటే .. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ అర్హులే!

త సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సివిల్స్‌ ఖాళీలు 94 పెరిగాయి. 2021లో 712, 2022లో 1011 పోస్టులను ప్రకటించారు. కొత్త విభాగాలు రావటం, పదవీ విరమణలు ఎక్కువగా జరగటం లాంటి కారణాల వల్ల ఈ ఏడాది 1105 ఖాళీలు ఏర్పడ్డాయి.  

సాధారణంగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ఏటా 10 లక్షలమంది దరఖాస్తు చేస్తుంటారు. అయితే వివిధ కారణాల వల్ల దాదాపు 5 లక్షలమందే పరీక్షకు హాజరవుతుంటారు. వీరిలో 10,000 మంది మెయిన్స్‌కు ఎంపికవుతారు. ప్రకటించిన ఖాళీలను బట్టి కూడా మెయిన్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య ఆధారపడివుంటుంది. దీన్నిబట్టి చూస్తే- దాదాపు 14,000 మంది ఈ ఏడాది మెయిన్స్‌కు ఎంపికవుతారని భావించవచ్చు. సివిల్స్‌కు దరఖాస్తు చేయాలంటే.. అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.


ఎన్ని సార్లు రాయవచ్చు?

గరిష్ఠ వయసుకు లోబడి.. జనరల్‌ అభ్యర్థులు 6 సార్లు సివిల్స్‌ పరీక్ష రాయవచ్చు. ఓబీసీలు, దివ్యాంగులు (జీఎల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ) 9 సార్లు పరీక్ష రాసే అవకాశం ఉంది. ఎస్సీ/ ఎస్టీ  అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాయవచ్చు.


పరీక్ష విధానం

సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌ 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి. రెండో పేపర్‌ క్వాలిఫైయింగ్‌. దీనిలో 33 శాతం మార్కులు సాధించాలి. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌ రాయడానికి అనుమతిస్తారు. మొత్తం ఖాళీలకు 13 రెట్ల సంఖ్యలో మెయిన్స్‌ రాస్తారు. ఈ పరీక్ష మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. చివరిగా పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులు.


సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:  21.2.2023

దరఖాస్తు సవరణ తేదీలు: 22.02.2023 నుంచి 28.02.2023 వరకు.

ప్రిలిమినరీ పరీక్ష: 28.5.2023

తెలంగాణ, ఏపీల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


వీలైనంత ముందుగా దరఖాస్తు

సివిల్స్‌ పరీక్ష కేంద్రాల్లో చాలావాటికి పరిమితమైన సీటింగ్‌ సామర్థ్యమే ఉంటోంది. దీంతో ‘మొదట దరఖాస్తు చేసినవారికి మొదట’ అనే ప్రాతిపదికన సెంటర్లను కేటాయిస్తారు. ఈ పరిస్థితుల్లో ఆలస్యంగా దరఖాస్తు చేసినవారికి కోరుకున్న పరీక్ష కేంద్రం లభించకపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే అభ్యర్థి తానున్న ప్రాంతానికి దూరంగా ఉండే పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయాలి. ఇదెంతో అసౌకర్యం కాబట్టి అభ్యర్థులు వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవటం శ్రేయస్కరం.  


గుర్తుంచుకోండి!

 వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) తప్పనిసరి. దీన్ని ఒకే ఒక్కసారి చేస్తే భవిష్యత్తులోనూ ఉపయోగపడుతుంది. మొదట ఓటీఆర్‌ చేసుకుని, ఆపై ఆన్‌లైన్‌ దరఖాస్తును నింపి పంపాలి. ఇంతకుముందే ఓటీఆర్‌ పూర్తి చేసుకుంటే నేరుగా దరఖాస్తులో వివరాలు నమోదు చేసి, పంపుకోవచ్చు.

 ప్రిలిమినరీ పరీక్షకు చేసే దరఖాస్తులోనే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలను ఎంచుకోవాలి. తర్వాత వీటిని మార్చటానికి వీలుండదు.

3  మెయిన్‌ పరీక్షలోనే ఆప్షనల్‌ సబ్జెక్టు ఉంటుంది. దాన్ని ఎంచుకోవటం మాత్రం ప్రిలిమినరీ దరఖాస్తులోనే చేయాలి. అందుకని ఆప్షనల్‌ సబ్జెక్టు విషయంలో ఇప్పుడే స్పష్టత ఏర్పరచుకోవాలి.

 ప్రిలిమినరీ దరఖాస్తు నింపేటప్పుడే మెయిన్‌ పరీక్ష రాసే మాధ్యమాన్ని (మీడియం) ఎంచుకోవాలి. దీన్ని తర్వాత మార్చుకోవడం సాధ్యం కాదు.  

5  దరఖాస్తును పంపిన తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడానికి వీలుండదు. గత ఏడాది వరకూ దీన్ని అనుమతించారు కానీ ఇప్పుడు సాధ్యం కాదు. దరఖాస్తు పంపినంతమాత్రాన దాన్ని అభ్యర్థి పరీక్ష ‘అటెమ్ట్‌’గా పరిగణించరు. అభ్యర్థి పరీక్ష జరిగే రోజున భౌతికంగా పరీక్ష కేంద్రానికి హాజరై రాస్తేనే అలా పరిగణిస్తారు.


అర్హత.. ధ్రువపత్రాలు

* డిగ్రీ ఫైనల్‌లో ఉన్నాను. పరీక్షలు ఇంకా జరగలేదు. నాకు సివిల్స్‌ పరీక్ష రాయడానికి అర్హత ఉందా?

ర్హత ఉంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన/ పూర్తికాబోతున్న అభ్యర్థులు సివిల్స్‌ రాయటానికి అర్హులే. ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసేటప్పుడు డిగ్రీ సర్టిఫికెట్‌ పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్‌ పరీక్షకు అర్హత సాధిస్తే డిగ్రీ ఉత్తీర్ణులైనట్టు ధ్రువపత్రం చూపించాలి. మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసే నాటికి డిగ్రీ పాసై ఉండాలి. లేకపోతే అభ్యర్థిత్వం తిరస్కరణకు గురవుతుంది.


భాషా మాధ్యమం

*  ప్రిలిమినరీ పరీక్షను ఏ భారతీయ భాషలోనైనా రాయొచ్చా?

ప్రిలిమినరీ అనేది ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ పరీక్ష. కరెక్టు సమాధానాన్ని ఓఎంఆర్‌ షీట్‌ మీద గుర్తించాలి. ప్రశ్నలను ఇంగ్లిష్‌, హిందీ భాషా మాధ్యమాల్లో మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆ ఇంగ్లిష్‌/ హిందీ భాషలో అడిగే ప్రశ్నలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా ఆ ప్రశ్నలు సులువుగానే అర్థం అవుతాయి.  

* మెయిన్‌ పరీక్షను మాతృభాషలో రాసే అవకాశం ఉంటుందా?

వకాశం ఉంటుంది. మెయిన్‌ పరీక్షను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలన్నింటిలోనూ రాసే అవకాశం ఉంది.

*  క్వాలిఫైయింగ్‌ పేపర్లైన మోడ్రన్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌, ఇంగ్లిష్‌లను పేర్కొన్న భాషలోనే రాయాలి.

* మిగతా పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషలోనే రాయొచ్చు. ఉదాహరణకు అభ్యర్థి తెలుగు భాషలో రాయాలనుకుంటే ఆప్షనల్స్‌ సహా అన్ని పేపర్లూ తెలుగులోనే రాయొచ్చు.

* కామన్‌ పేపర్లయిన జనరల్‌ ఎస్సే, జీఎస్‌ పేపర్‌-1, జీఎస్‌ పేపర్‌-2, జీఎస్‌ పేపర్‌-3, జీఎస్‌ పేపర్‌-4లను ఏ భారతీయ భాషలోనైనా (ఉదాహరణకు తెలుగు) రాసి ఆప్షనల్స్‌ను ఇంగ్లిష్‌లో రాయవచ్చు. దీంతో అభ్యర్థులకు టెక్నికల్‌ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకోవడానికి వెసులుబాటు ఏర్పడింది.

* అభ్యర్థి ఆప్షనల్స్‌ను మాతృభాషలో రాసినప్పుడు సాంకేతిక పదాలను బ్రాకెట్లో ఇంగ్లిష్‌లో రాయవచ్చు. కొన్ని సాంకేతిక పదాలకు సరిగ్గా సరిపోయే అనువాదం మాతృభాషలో ఉండదు కాబట్టే ఈ వెసులుబాటును కల్పించారు.

* మెయిన్‌ పరీక్ష మాతృభాషలో రాసి, ఇంటర్వ్యూ జవాబులు ఇంగ్లిష్‌లో చెప్పవచ్చా? అలాగే... మెయిన్‌ పరీక్షను ఇంగ్లిష్‌లో రాసి, ఇంటర్వ్యూ జవాబులను తెలుగులో చెప్పవచ్చా?  

యూపీఎస్‌సీ ఈ సౌలభ్యాన్ని కల్పిస్తోంది. విద్యార్థి తాను ఎంచుకున్న ఏ భాషలోనైనా ఇంటర్వ్యూ సమాధానాలను ఇవ్వొచ్చు.

వి. గోపాలకృష్ణ, డైరెక్టర్‌, బ్రెయిన్‌ ట్రీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని