Updated : 08 Feb 2023 05:55 IST

ఏఐ.. ఎలా వాడాలి? ఎలా వాడొద్దు?

చిన్నప్పుడు మూడునాలుగు అంకెల కూడికలు, తీసివేతలు కూడా కళ్లు మూసుకుని మనసులో చేసేవాళ్లం. కానీ ఇప్పుడు రెండంకెల లెక్కనూ ఫోన్‌లో కాలిక్యులేటర్‌ తెరిచి వేసి చూస్తున్నాం. లెక్క చేయడం రాక కాదు... అవకాశం ఉండగా ఎందుకులే కష్టపడటం అనే భావన!

ఇది ఒక స్థాయి, వయసు వచ్చేశాక అయితే కొంత పర్వాలేదు. కానీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఇటువంటి ఆలోచనాధోరణి ఏర్పడితే? ఇందుకు మనిషి మేధను మించిన అత్యాధునిక పరిజ్ఞానం (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) విద్యార్థులకు సాయపడుతుంటే..? ఈ షార్ట్‌కట్‌ పద్ధతుల వల్ల వచ్చే నష్టాలేంటి? దీన్ని సక్రమంగా మాత్రమే వినియోగించే విధానాలేంటి? పరిశీలిద్దాం.

ర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఈ శతాబ్దపు అత్యద్భుత సృష్టి అంటే ఆశ్చర్యం అక్కర్లేదు. మనుషులకు దీటుగా ఆలోచించే ఈ టెక్నాలజీ.. ఇప్పుడు అన్నింటా రంగప్రవేశం చేస్తోంది. ముఖ్యంగా ఏఐతో నడిచే చాట్‌   జీపీటీ, గిట్‌హబ్‌, బ్లాక్‌బాక్స్‌ వంటి వాటి గురించి ప్రస్తుతం విద్యారంగంలో అధికంగా చర్చ జరుగుతోంది. మితిమీరిన వీటి ప్రమేయం విద్యార్థులను పక్కదోవ పట్టిస్తుందనే ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. ఎందుకిలా అన్నది విద్యార్థులంతా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అసలు ఏంటివి?

ఓపెన్‌ఏఐ జీపీటీ-3 ఆధారిత చాట్‌బోట్‌నే ‘చాట్‌జీపీటీ’ అంటున్నారు. భాషలను ఉపయోగించడం - భావ వ్యక్తీకరణలో బహుశా దీన్ని మించిన టెక్నాలజీ ప్రస్తుతం వేరే ఏదీ లేదేమో. వినియోగదారుడితో నేరుగా సంభాషించగలిగి అతడికి కావాల్సిన ఏ సమాచారాన్ని అయినా క్షణాల్లో ఇవ్వగలగడం దీని ప్రత్యేకత. ఇందులో మొత్తం ఆటోమేషన్‌ ఉంటుంది. ఇది ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలదు, కథలు రాయగలదు, ఒక భాష నుంచి మరో భాషకు తర్జుమా చేయగలదు, ఇవేకాక భాషకు సంబంధించిన ఎన్నో పనులను చాలా సులువుగా చేసేయగలదు.

ఎందుకు భయం?

అయితే వీటి మీద అమితంగా ఆధారపడటం అలవాటైతే... అది విద్యార్థులు పాఠాలు నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రతిదానికీ మెషిన్‌ వాడటం అలవాటైన విద్యార్థులు మానసిక వికాసంలో వెనకబడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది చెప్పినదంతా నమ్మడం, పనిచేయకపోతే ఉండలేకపోవడం, తెలిసీతెలియకుండా వాడి ఇబ్బందులపాలు కావడం, మనుషులకంటే కూడా వీటినే అధికంగా ఇష్టపడటం... ఇలా చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసైన్‌మెంట్లు, ప్రాజెక్ట్‌ వర్క్‌లు, రికార్డ్స్‌ రాయడంలో ఏఐని ఉపయోగిస్తే చీటింగ్‌గా పరిగణించాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు  విద్యాసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సంస్థల ప్రాంగణాల్లో ఈ అప్లికేషన్లు వాడటాన్ని నిరోధించాలని అధ్యాపకులు కోరుతున్నారు.

*  అలాగే కోడింగ్‌కు సంబంధించి గిట్‌హబ్‌, బ్లాక్‌బాక్స్‌ అనేవి ఏఐ ఆధారిత అత్యాధునిక ప్లాట్‌ఫామ్స్‌. వీటి ద్వారా వినియోగదారులు కోడ్‌ చేయడం చాలా చాలా సులువైపోతుంది. ముఖ్యంగా బ్లాక్‌బాక్స్‌లో అయితే దీని ప్రాసెస్‌, ఆపరేషన్స్‌ ఏంటో వినియోగదారులకు తెలియదు. అంటే దీని ఏఐ మెథడ్‌, అల్గారిథమ్‌ ఎలా పనిచేస్తుందో మనకు తెలిసే అవకాశం లేదు. మనం ఇచ్చే సమాచారం, చేస్తున్న పనులను అది ఎంత లోతుగా నిక్షిప్తం చేసుకుంటుంది, ఆ ఇన్ఫర్మేషన్‌ను తిరిగి ఎందుకు ఉపయోగిస్తుందనే సమాచారం మనం ఊహించలేం. అందుకే దీన్ని బ్లాక్‌ బాక్స్‌ అని పిలుస్తున్నారు.

విద్యార్థులకు ఎలా ఉపయోగం?

ఏఐని ఉపయోగించడం ద్వారా టీచర్లు, పుస్తకాల సహాయం లేకుండా సులువుగా పాఠాలు నేర్చుకోవచ్చు. వారి హోంవర్క్‌, అసైన్‌మెంట్లు, పరీక్షల సన్నద్ధతలో ఇది సహాయకారిగా ఉండగలదు. కావాలంటే సెకన్ల వ్యవధిలో వ్యాసాలు రాసివ్వగలదు. ఏదైనా విషయం అర్థం కాకపోతే చక్కగా వివరించగలదు. పదాలను, వ్యాకరణాన్ని ఉపయోగించడంలో విద్యార్థులకు సూచనలు ఇవ్వగలదు. మొత్తంగా వారికో మంచి స్నేహితుడిలా మెలగగలదు.


*  అలాగే ఈ చాట్‌జీపీటీ ఇచ్చే సమాచారం అంతా నిజమే అనుకోవడానికి లేదు. అందులో తప్పులు కూడా ఉండే ఆస్కారం ఉంది. ఏఐతో మాట్లాడటం అలవాటైన విద్యార్థులు పాఠంపై అంతగా శ్రద్ధపెట్టలేరు.

*  ఇది ప్రశ్నలకు సులభమైన రీతిలో జవాబులు ఇచ్చేయడం వల్ల విద్యార్థుల్లో క్రిటికల్‌ థింకింగ్‌, సమస్యా పరిష్కార (ప్రాబ్లం సాల్వింగ్‌) నైపుణ్యాలు తగ్గిపోయే ఆస్కారం ఉంది. ఇవి లేని విద్యార్థులు తరగతిలోనూ, జీవితంలోనూ వెనకబడిపోయే ప్రమాదం ఉంది!

*  బ్లాక్‌బాక్స్‌ ఏ కోడ్‌ను అయినా క్షణాల్లో రాసి ఇచ్చేస్తుంది. మనకు కావాల్సిన అంశాన్ని టైప్‌ చేయగానే వెంటనే దానికి సంబంధించిన కోడ్‌ ఏ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో కావాలంటే అందులో తెరపై ప్రత్యక్షమవుతుంది. కంప్యూటర్‌ సైన్స్‌, కోడింగ్‌కు సంబంధించిన కోర్సులు చదువుకునే విద్యార్థులు దీనికి అలవాటు పడితే సొంతంగా  ఏ చిన్న కోడ్‌ రాయాలన్నా ఇబ్బంది పడతారు. ఇది చివరికి వాళ్ల కెరియర్‌నే ప్రమాదంలో పడేస్తుంది.

* ఇటువంటి ఉత్పత్తులను కంపెనీలు మరింతగా తయారుచేస్తున్నాయి. ఇది కరెక్టా కాదా అన్న విషయంపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. కానీ ఆధునిక టెక్నాలజీని పూర్తిగా దూరం పెట్టడం సాధ్యం కాదు, దాని వల్ల కలిగే ప్రయోజనాలను తోసిపుచ్చలేం. కావాల్సినదల్లా ఎలా ఉపయోగించాలి అనే విచక్షణ మాత్రమే!


చేయాల్సినవి..

*  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రానున్న కాలంలో మరింతగా మన జీవితంలోకి చొచ్చుకురానున్న మార్పు. దీన్నుంచి దూరం తప్పుకోవడం అంత సులభం కాదు. అలా అని పూర్తిగా దాని చేతుల్లోకి వెళ్లిపోవడమూ సరికాదు. మధ్యేమార్గంగా వినియోగించడం సాధన చేయాలి. అవసరం మేరకే వాడాలి. నైపుణ్యాలు నేర్చుకునే చోట ఎంతమాత్రం రాజీపడకూడదు.

*  చదువు పట్ల నిజాయతీగా ఉండాలి. ఈ రోజుకి ఏఐని ఉపయోగిస్తే మన పని కానిచ్చేయవచ్చు. కానీ అలా చేయడం ఎప్పటికైనా మనకే నష్టమనే విషయాన్ని గమనించాలి. ఒక్కసారి ఏదైనా టాపిక్‌ సరిగ్గా నేర్చుకోకపోతే... మళ్లీ దాన్ని సాధన చేసే అవకాశం రాకపోవచ్చు. పాఠాలు చదవాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. ఏడాదంతా ఎలాగోలా నెట్టుకొచ్చినా పరీక్షల్లో కచ్చితంగా మనం చదివిందే రాయగలమనే విషయాన్ని గమనించాలి.

*  వీటిని ట్యూటర్‌గా ఉపయోగించుకోవడానికి, సందేహాల నివృత్తికి వాడుకోవడం మంచిదే. పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఆ వాడే విధానం ఎలా ఉందనేది ముఖ్యం. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇవి చాలా ప్రభావవంతమైన టీచింగ్‌ టూల్స్‌!


రవికి తన ప్రాజెక్టు వర్క్‌ చేయడం చాలా బోరింగ్‌గా ఉంది. తను చేయాల్సిన టాస్క్‌లను ఏఐకి అప్పగించాడు. అది చెప్పిన సమాచారం ఉన్నదున్నట్లుగా రాసేసుకుని పని అయిపోయిందని రిలాక్స్‌ అయిపోయాడు.

రమ్యకు తన ప్రాజెక్టు వర్క్‌ చేయడం చాలా బోరింగ్‌గా ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నా పని ముందుకు సాగడం లేదు. ఇక ఇలా కాదనుకుని ఏఐ సహాయం తీసుకుని.. తన సందేహాలను నివృత్తి చేసుకుంది. కొత్త విషయాలు తెలుసుకుంది. మరింత లోతుగా అధ్యయనం చేసి ఎక్కడ సమస్య ఉందో, ఎందుకు తన పని ముందుకు కదలడం లేదో గుర్తించింది. వెంటనే వాటిని చక్కదిద్ది చకచకా తన పని చేసి హాయిగా రిలాక్స్‌ అయ్యింది.

పైన రెండు సందర్భాల్లోనూ ఉన్నది ఒకే పరిస్థితి. కానీ దాన్ని రవి, రమ్య ఎలా ఎదుర్కొన్నారు.. అనేదే ఇక్కడ ప్రశ్న. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుని మరింత నేర్చుకుంటామో... దాని చేతుల్లో కీలుబొమ్మల్లా మారిపోతామో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే!


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు