ఈ కోర్సులు మహిళల కోసం!

మహిళలను రక్షణ రంగంవైపు ప్రోత్సహించేందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గత విద్యా సంవత్సరం నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించింది.

Updated : 23 Feb 2023 06:40 IST

మహిళలను రక్షణ రంగంవైపు ప్రోత్సహించేందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గత విద్యా సంవత్సరం నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించింది. ప్రత్యేకంగా మహిళలను డిఫెన్స్‌, యూనిఫామ్‌ సర్వీసెస్‌లోకి తీసుకురావడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. వీటిలో మహిళా యూనివర్సిటీలో  చదువుతున్నవారే కాదు.. బయటి విద్యార్థినులూ, మహిళలూ కూడా చేరవచ్చు.

హిళా యూనివర్సిటీ వ్యాయామ విభాగ ఆధ్వర్యంలో పీజీ డిప్లొమా ఫర్‌ ఎంట్రీ ఇన్‌టు యూనిఫామ్డ్‌ సర్వీసెస్‌, డిప్లొమా ఫర్‌ ఎంట్రీ ఇన్‌టు యూనిఫామ్డ్‌ సర్వీసెస్‌, డిప్లొమా ఫర్‌ ఎంట్రీ ఇన్‌టు డిఫెన్స్‌ సర్వీసెస్‌ కోర్సులను నిర్వహిస్తున్నారు. థియరీతోపాటు శారీరకంగా కూడా శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తవగానే విశ్వవిద్యాలయం కోర్సు సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తుంది. 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 40 కేజీలు, ఆపైన బరువు ఉన్న మహిళలు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

1 పీజీ డిప్లొమా ఫర్‌ ఎంట్రీ ఇన్‌టు యూనిఫామ్డ్‌ సర్వీసెస్‌

ఈ కోర్సు కాలపరిమితి 6 నెలలు, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన 18 - 27 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 18-32 ఏళ్లు) వయసున్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరిన విద్యార్థినులకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు తగ్గట్టు థియరీ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇస్తారు.

2 డిప్లొమా ఫర్‌ ఎంట్రీ ఇన్‌టు యూనిఫామ్డ్‌   సర్వీసెస్‌  

కోర్సు కాల పరిమితి 6 నెలలు. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన 18- 25 సంవత్సరాల (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు 18-30 ఏళ్లు) వయసున్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరిన విద్యార్థినులకు కానిస్టేబుల్‌ పోస్టుకు తగ్గట్టు థియరీ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇస్తారు.

3 డిప్లొమా ఫర్‌ ఎంట్రీ ఇన్‌టు డిఫెన్స్‌ సర్వీసెస్‌  

కోర్సు కాల పరిమితి 6 నెలలు. పదో తరగతి పూర్తిచేసిన 17- 21 సంవత్సరాల వయసున్న మహిళలు దరఖాస్తుకు అర్హులు. కోర్సులో చేరినవారికి మిలిటరీ పోస్టుకు తగ్గట్టు థియరీ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇస్తారు.

కోర్సు పూర్తయినవారు ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ, కోస్ట్‌ గార్డ్‌, ఏఆర్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఏపీ పోలీస్‌, ఫారెస్టు, ఫైర్‌, ఎక్సైజ్‌ విభాగాల్లో... దిల్లీ పోలీస్‌, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, సీబీఐ తదితర శాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

దరఖాస్తు.. కోర్సు ఫీజు

అభ్యర్థులు యూనివర్సిటీ వ్యాయామ విభాగంలో రూ.150 చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచీ దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీరు దరఖాస్తు ఫీజు రూ.150 డీడీ చెల్లించి దరఖాస్తు సమర్పించాలి.

పూర్తిచేసిన దరఖాస్తులను మార్చి 6 లోపు అందచేయాలి.

పీజీ డిప్లొమా కోర్సుకు మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు రూ.10 వేలు, ఇతర అభ్యర్థులు రూ.15 వేలు, డిప్లొమా ఇన్‌ కానిస్టేబుల్‌ క్యాడర్‌, డిప్లొమా ఇన్‌ మిలిటరీ పోలీస్‌ క్యాడర్‌ కోర్సులు ఒక్కొక్కదానికి మహిళా వర్సిటీ విద్యార్థినులు రూ.8 వేలు, బయట అభ్యర్థులు రూ.12 వేలు ఫీజుగా చెల్లించాలి.

వెబ్‌సైట్‌: https://www.spmvv.ac.in/ 

జి.కృష్ణకుమారి, న్యూస్‌టుడే, మహిళా యూనివర్సిటీ (తిరుపతి)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని