మ్యాథ్స్‌, సైన్స్‌ మెరికలకు స్వాగతం

మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సులను ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివినవారు ఉన్నత స్థాయిలో రాణించగలరు. ఈ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉన్న ఇంటర్‌ విద్యార్థులు రాయాల్సిన పరీక్షల్లో ‘నెస్ట్‌’ ముఖ్యమైంది.

Updated : 27 Feb 2023 05:08 IST

మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సులను ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివినవారు ఉన్నత స్థాయిలో రాణించగలరు. ఈ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉన్న ఇంటర్‌ విద్యార్థులు రాయాల్సిన పరీక్షల్లో ‘నెస్ట్‌’ ముఖ్యమైంది. ఇందులో ప్రతిభ చూపితే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైసర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు. వీరికి నెలకు రూ.5000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుతుంది.

మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సుల్లో మెరికల్లాంటి విద్యార్థులను గుర్తించి, వారిని పరిశోధనల దిశగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (నెస్ట్‌)ను ఏటా నిర్వహిస్తున్నారు. బోధన, పరిశోధనల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, అధునాతన ల్యాబ్‌ సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలు..నైసర్‌, సీఈబీఎస్‌ల ప్రత్యేకత. విదేశీ శాస్త్రవేత్తలతోనూ తరగతులు నిర్వహిస్తారు. ఈ సంస్థల్లో బయాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు.

నైసర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.5000 స్టైపెండ్‌ అందుతుంది. అలాగే వేసవిలో ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున కాంటింజెన్సీ ఇస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మేటి ప్రతిభ చూపిన విద్యార్థులు భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రైనింగ్‌ స్కూల్‌లో పరీక్ష రాయకుండా, నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఇందులో మెరిసినవారు శిక్షణ తర్వాత బార్క్‌లో విధులు నిర్వర్తించవచ్చు.

ప్రశ్నపత్రం

పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. వ్యవధి మూడున్నర గంటలు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వీటిని 4 సెక్షన్ల నుంచి అడుగుతారు. అభ్యర్థికి సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు రూపొందిస్తారు. అన్ని సెక్షన్లలోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. సెక్షన్‌ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక్కో సెక్షన్‌కూ 50 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగంలో 17 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 12 ప్రశ్నలకు ఆప్షన్లలో సరైన సమాధానం ఒకటే ఉంటుంది. దాన్ని గుర్తిస్తే 2.5 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. మిగిలిన 5 ప్రశ్నలకు రెండు, అంతకంటే ఎక్కువ సరైన జవాబులు ఉంటాయి. ఒక్కో దానికీ 4 మార్కులు. 4 సెక్షన్లలో ఎక్కువ మార్కులు సాధించిన మూడు సెక్షన్ల స్కోరుతో మెరిట్‌ లిస్టు తయారుచేస్తారు. 150 మార్కులకు సాధించిన స్కోరు పర్సంటైల్‌ విధానంలో లెక్కిస్తారు. జనరల్‌ అభ్యర్థులు 95, ఓబీసీలు 90, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 75 పర్సంటైల్‌ సాధించాలి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు.

సన్నద్ధత ఇలా...

* సబ్జెక్టులవారీ సిలబస్‌ వివరాలను నెస్ట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అందులో పేర్కొన్న చాప్టర్లు, అంశాలు బాగా చదువుకుంటే పూర్తి మార్కులు పొందవచ్చు. 

* సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల్లోని బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ అంశాల నుంచే ప్రశ్నలొస్తాయి. అందువల్ల పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. 

* ప్రాథమికాంశాలు, భావనలపై పట్టు సాధించాలి. ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. 

* ఏవైనా 3 సెక్షన్లకు జవాబులు గుర్తిస్తే సరిపోతుంది కాబట్టి బయాలజీ విద్యార్థులు మ్యాథ్స్‌ను, మ్యాథ్స్‌ విద్యార్థులు బయాలజీని మినహాయించుకోవచ్చు. 

* పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. నెస్ట్‌ వెబ్‌సైట్‌లో 2007 నుంచి 2022 వరకు నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలు అందుబాటులో ఉంచారు. వీటిని నిశితంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారో గమనించాలి. సబ్జెక్టులవారీ ఏయే చాప్టర్ల నుంచి ఏ తరహా ప్రశ్నలు, ఎన్నేసి చొప్పున వస్తున్నాయో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలి. 

* ఎంసెట్‌, ఐఐటీ-జేఈఈ, నీట్‌ పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు సాధన చేయడం ప్రయోజనకరం. 

* పరీక్షకు రెండు వారాల ముందు మాక్‌ టెస్టు నెస్ట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దాన్ని సాధన చేయడం ఎంతో మేలు.

ముఖ్య వివరాలు

అర్హత: ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో 2021, 2022లో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి. 

వయసు: ఆగస్టు 1, 2003 తర్వాత జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.   

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 17 వరకు స్వీకరిస్తారు. 

ఫీజు: జనరల్‌, ఓబీసీ పురుషులకు రూ.1200. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600. 

పరీక్ష తేదీ: జూన్‌ 24 (రెండు సెషన్లలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు) 

ఫలితాలు: జులై 10 

వెబ్‌సైట్‌: https://www.nestexam.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు