ఎన్‌ఐటీల్లో ఎంసీఏ

ఐటీ సంస్థల్లో సత్తా చాటేందుకు ఉపకరించే కోర్సుల్లో మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) ఒకటి. దేశంలో మేటి సంస్థలెన్నో ఈ కోర్సు అందిస్తున్నాయి.

Updated : 08 Mar 2023 04:15 IST

నిమ్‌సెట్‌- 2023 ప్రకటన

ఐటీ సంస్థల్లో సత్తా చాటేందుకు ఉపకరించే కోర్సుల్లో మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) ఒకటి. దేశంలో మేటి సంస్థలెన్నో ఈ కోర్సు అందిస్తున్నాయి. పలు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లు ఎంసీఏను బోధిస్తున్నాయి. ఇవన్నీ ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయిలో ఏటా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌) నిర్వహిస్తున్నాయి. ఈ స్కోరును ఇతర సంస్థలూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి.  హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏలో చేరడానికి ఈ స్కోరే ప్రామాణికం. ఇటీవలే నిమ్‌సెట్‌- 2023 ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు...

నిమ్‌సెట్‌తో 9 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో వరంగల్‌ ఒకటి. దేశీయ, విదేశీ ఐటీ సంస్థల అవసరాల ప్రకారం ఇక్కడి ఎంసీఏ సిలబస్‌ను రూపొందిస్తారు. అన్ని సంస్థలూ ఉమ్మడి కరిక్యులమ్‌ అనుసరిస్తాయి. ఈ ఏడాది నిమ్‌సెట్‌ను నిట్‌, జంషెడ్‌పూర్‌ నిర్వహిస్తోంది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే వరంగల్‌, జంషెడ్‌పూర్‌ నిట్‌లు రెండేళ్ల కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. రెండేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తున్నాయి.

అర్హత

మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీ వొక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)ల్లో ఏదైనా కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచీలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.

పరీక్ష ఇలా...

పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. సబ్జెక్టుల వారీ.. మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు, ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 20, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 10 ప్రశ్నలడుగుతారు. వీటికి మొత్తం వెయ్యి మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం తగ్గిస్తారు.

కౌన్సెలింగ్‌

మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్‌తో సీట్లను కేటాయిస్తారు. సంస్థలవారీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల కోటా లేదు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదవాలనుకున్నవారు ఈ స్కోరుతో ఆ సంస్థకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డీమ్డ్‌, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఈ స్కోరుతో ఎంసీఏ కోర్సులోకి అవకాశం కల్పిస్తున్నాయి.  

మార్కుల కేటాయింపు

మ్యాథ్స్‌లో ప్రతి సరైన జవాబుకీ 12 మార్కులు. తప్పు సమాధానానికి 3 మార్కులు తగ్గిస్తారు. ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ల్లో సరైన జవాబుకు 6 మార్కులు. తప్పైతే 1.5 మార్కులు తగ్గిస్తారు. జనరల్‌ ఇంగ్లిష్‌లో సరైన సమాధానానికి 4 మార్కులు. జవాబు తప్పైతే ఒక మార్కు తగ్గిస్తారు. మ్యాథ్స్‌కు 600, ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 240, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 120, జనరల్‌ ఇంగ్లిష్‌ 40 మార్కులకు ఉంటాయి.

మ్యాథ్స్‌ విభాగానికి అధిక ప్రాధాన్యం ఉంది. ఇందులో ఎక్కువ స్కోరు సాధించినవారు పోటీలో ముందుంటారు. ఈ విభాగంలో ప్రశ్నలన్నీ రెండేళ్ల ఇంటర్మీడియట్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. సెట్‌ థియరీ, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఆల్జీబ్రా, కో ఆర్డినేట్‌ జామెట్రీ, కాలిక్యులస్‌, వెక్టార్స్‌, ట్రిగనోమెట్రీ అంశాలపైనే ప్రశ్నపత్రం ఉంటుంది. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే మెరుగైన స్కోరు సాధ్యమవుతుంది. ఎంసెట్‌ స్థాయిలో సన్నద్ధమైతే సరిపోతుంది.

ఏ నిట్‌లో ఎన్ని సీట్లు?

అగర్తలా- 30, అలహాబాద్‌- 116, భోపాల్‌- 115, జంషెడ్‌పూర్‌- 115, కురుక్షేత్ర- 96 (వీటిలో 32 సెల్ఫ్‌ ఫైనాన్స్‌), రాయ్‌పూర్‌- 110, సూరత్కల్‌- 58, తిరుచురాపల్లి- 115, వరంగల్‌- 58  

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 10 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష: జూన్‌ 11 (ఉదయం 9 నుంచి 11 వరకు)

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250. మిగిలిన అందరికీ రూ.2500

వెబ్‌సైట్‌: http://www.nimcet.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని