ఎకనామిక్స్‌లో పీ జి ఎక్కడ ?

హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌లతో బీఏ చదువుతున్నాను

Published : 09 Mar 2023 00:57 IST

హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌లతో బీఏ చదువుతున్నాను. వీటిలో ఎకనామిక్స్‌ అంటే ఆసక్తి. ఈ సబ్జెక్టులో పీజీ అందించే మేటి సంస్థలు, ప్రవేశ వివరాలతోపాటు ఉద్యోగ అవకాశాలను తెలపండి?

రాజు, నెల్లూరు

విస్తృత అవకాశాలు అందించే మేటి కోర్సుల్లో ఎకనామిక్స్‌ ఒకటి. పేరున్న సంస్థల్లో ఎంఏ ఎకనామిక్స్‌ చదివినవారు కెరియర్‌ పరంగా దూసుకెళ్లవచ్చు. అయితే ఇలాంటి వాటిలో ప్రవేశానికి బాగా శ్రమించడం తప్పనిసరి. ఎంఏ ఎకనామిక్స్‌లోనూ ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఎస్‌ఐ- కోల్‌కతా, దిల్లీల్లో ఈ కోర్సు అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో సీటు కేటాయిస్తారు. ఈ సంస్థల్లో అవకాశం వచ్చినవాళ్లు ప్రతినెల రూ.8000 స్టైపెండ్‌ అందుకోవచ్చు. ఎకనామిక్స్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పరిశోధకులు, విశ్లేషకులు, ఆర్థిక సలహాదారు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌, ఆడిటర్‌, స్టాక్‌ బ్రోకర్‌, బిజినెస్‌ జర్నలిస్ట్‌ తదితర హోదాలతో ఉద్యోగాలు పొందవచ్చు. పీజీ అనంతరం పీహెచ్‌డీతో బోధన రంగంలో రాణించవచ్చు. ఎకనామిక్స్‌ పీజీతో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏటా నిర్వహిస్తోన్న ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) పరీక్ష రాసుకోవచ్చు. ఎంపికైనవారు గ్రూప్‌ ఎ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తారు. అలాగే రిజర్వ్‌ బ్యాంకులో గ్రేడ్‌ బి పోస్టుల్లో కొన్నింటికి పీజీ ఎకనామిక్స్‌ అర్హతతో పోటీ పడవచ్చు.

జాతీయ స్థాయిలో మేటి సంస్థలు

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ; దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, న్యూదిల్లీ; హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ; జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, న్యూదిల్లీ; గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌, పుణే; మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎంఎస్‌ఈ), చెన్నై; బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి; ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌ (ఐజీడీఆర్‌), ముంబయి; సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ (సీడీఎస్‌), తిరువనంతపురం; బిట్స్‌ - పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో ఆనర్స్‌ విధానంలో ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (బేస్‌), బెంగళూరు ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తోంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నమూనాలో దీన్ని రూపొందించారు. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మరికొన్ని సంస్థలు సీయూసెట్‌ పీజీలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తున్నాయి. మిగిలినవాటికి ఆ సంస్థలు నిర్వహించే పరీక్షలు విడిగా రాసుకోవాలి. ఆంధ్రా, ఉస్మానియా, ఎస్వీయూ, ఆచార్య నాగార్జున... పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు తెలుగు రాష్ట్రాల్లో ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. పీజీ సెట్లతో ప్రవేశం పొందవచ్చు.  ఐఐటీ దిల్లీ, రవుర్కెలాలు ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీలు నిర్వహించే జామ్‌తో ప్రవేశం లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని