142 విద్యాసంస్థల్లో ప్రవేశానికి దారి !

దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్‌, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి. ఈ సంస్థల్లో చేరినవారు మేటి ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

Updated : 23 Mar 2023 06:33 IST

సీయూఈటీ పీజీ

దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్‌, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి. ఈ సంస్థల్లో చేరినవారు మేటి ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఒకే పరీక్షతో అన్ని జాతీయ సంస్థల సీట్లకూ పోటీ పడే అవకాశం కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ)తో దక్కుతుంది. ఇటీవలే ఆ ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు...

తాజా నోటిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉన్నాయి.

ఈ ప్రవేశ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. గతంలో విశ్వవిద్యాలయాలు విడిగా పరీక్ష నిర్వహించేవి. దీంతో విద్యార్థులు విడిగా దరఖాస్తు చేసుకునేవారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించి, పలు ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాసేవాళ్లు. ఆ ఇబ్బందులు సీయూఈటీతో తొలగిపోయాయి. ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌... కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌... ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌... ఇలా అభ్యర్థులు చేరాలనుకున్న విభాగం పరీక్ష రాసి, దేశవ్యాప్తంగా ఆ సబ్జెక్టులో ఉన్న సీట్లకు పోటీపడవచ్చు.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తొలి ప్రాధాన్యమిచ్చే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ సీట్లన్నీ సీయూఈటీతోనే భర్తీ చేస్తారు. ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ- హైదరాబాద్‌, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ- విజయనగరం, ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ- అనంతపురంలలో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ- న్యూదిల్లీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ- వారణాసి, పాండిచ్చేరి యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా.. ఇలా పలు పేరున్న సంస్థల్లో సీట్లకు ఈ స్కోరే ఆధారం.


విద్యార్హత

ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ రాసుకోవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలినవాటికి డిగ్రీలో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లోని బులిటెన్‌, ఎఫ్‌ఏక్యూస్‌ పూర్తిగా చదివి వివరాలు నింపాలి.


ఆన్‌లైన్‌ పరీక్ష

పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో (లాంగ్వేజ్‌, సాహిత్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో పార్ట్‌-ఎ, పార్ట్‌-బి అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎ 25, పార్ట్‌-బిలో 75 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-ఎలో జనరల్‌, పార్ట్‌-బిలో సంబంధిత సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ఎంఏ/ఎమ్మెస్సీ కోర్సులకు సంబంధించి పార్ట్‌ ఎలో ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్‌, అనలిటికల్‌ స్కిల్స్‌ల్లో ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టులవారీ పార్ట్‌ బి సిలబస్‌ వివరాలు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.


సన్నద్ధత

* రాయాలనుకుంటున్న సబ్జెక్టు సిలబస్‌ వివరాలు గమనించాలి.
* సిలబస్‌లోని పాఠ్యాంశాలను డిగ్రీ పుస్తకాల నుంచి అధ్యయనం చేయాలి.
* మూడేళ్ల డిగ్రీ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అనువర్తనం, ముఖ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
* గతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పీజీ ప్రవేశానికి నిర్వహించిన ప్రశ్నపత్రాలు సీయూఈటీని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.
* పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధత కొనసాగిస్తే మేటి సంస్థలో సీటు పొందవచ్చు.


ఇవీ కోర్సులు

ఎంఏ: తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, కన్నడ, ఉర్దూ, సంస్కృతం, బెంగాళీ, ఏన్షంట్‌ ఇండియన్‌ హిస్టరీ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, హోం సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, నేపాలీ, అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, మరాఠీ, పర్షియన్‌, రష్యన్‌, చైనీస్‌, ఫిలాసఫీ, ఆర్ట్‌ హిస్టరీ, పాళీ, ఎడ్యుకేషన్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, సైకాలజీ, సోషల్‌ వర్క్‌, ఆంత్రొపాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ ఎక్స్‌ క్లూజన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ పాలసీ, ఎనర్జీ ఎకనామిక్స్‌, హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, మ్యూజియాలజీ. 

ఎమ్మెస్సీ: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, కంప్యూటర్‌ సైన్స్‌, జాగ్రఫీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, సైకాలజీ, హోం సైన్స్‌, బయో కెమిస్ట్రీ, టెక్‌ జియో ఫిజిక్స్‌, జియాలజీ, హెల్త్‌ స్టాటిస్టిక్స్‌, అగ్రికల్చర్‌, డైరీ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, అప్లయిడ్‌ మైక్రో బయాలజీ, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, కంప్యుటేషనల్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, అగ్రో ఫారెస్ట్రీ, సాయిల్‌ వాటర్‌ కన్జర్వేషన్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ.

ఎంఎఫ్‌ఎ: పెయింటింగ్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, ప్లాస్టిక్‌ ఆర్ట్స్‌, పోటరీ అండ్‌ సిరామిక్స్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌. 

ఎంపీఏ: వోకల్‌ మ్యూజిక్‌, డ్యాన్స్‌.

ఎంబీఏ: ఫారిన్‌ ట్రేడ్‌, రిస్క్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, అగ్రి బిజినెస్‌.

మాస్టర్‌ ఆఫ్‌ వొకేషన్‌: రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, మెడికల్‌ లేబొరేటరీ అండ్‌ టెక్నాలజీ.

ఎంఎడ్‌, ఎంఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఎంఎల్‌ఐఎస్సీ, మాన్యుస్క్రిప్టాలజీ అండ్‌ పాలియోగ్రఫీ, ఎంపీఈడీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంకాం, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌, పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.. ఇలా పీజీలో ఉండే అన్ని కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు ఎల్‌ఎల్‌ఎం, ఎంటెక్‌, ఎంఎడ్‌, ఎంఏ/ఎమ్మెస్సీ-బీఎడ్‌ కోర్సులూ అందిస్తున్నాయి.

సీయూఈటీలో సాధించిన స్కోరుతో ప్రవేశం పొందగోరే విశ్వవిద్యాలయానికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 19 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: (మూడు టెస్ట్‌ పేపర్ల వరకు) జనరల్‌ అభ్యర్థులకు రూ.1000. ఓబీసీ - ఎన్‌సీఎల్‌/జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌లకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/థర్డ్‌ జెండర్‌లకు రూ.750, దివ్యాంగులైతే రూ.700. అదనపు టెస్ట్‌ పేపర్లు (ప్రతి పేపర్‌కు) జనరల్‌ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి. మిగిలినవాళ్లకు రూ.400.

పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ముఖ్య ప్రాంతాల నుంచీ పరీక్ష రాసుకోవచ్చు. ఏపీలో 24, తెలంగాణలో 11 ప్రాంతాల్లోని వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఇ-అడ్మిట్‌ కార్డ్‌: అడ్మిట్‌కార్డ్‌ను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్‌/టైమ్‌కు సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయి. పరీక్షను రోజూ 2 షిఫ్ట్‌ల్లో నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ఇవి ఉంటాయి. 

వెబ్‌సైట్‌: https://cuet.nta.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు