సివిల్స్‌ ప్రిలిమ్స్‌.. ఇదిగో వ్యూహం!

యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రక్రియలో ప్రిలిమినరీకి చాలా ప్రాధాన్యం ఉంది. దీనిలో అర్హత సాధిస్తేనే తర్వాతి అంచె.. మెయిన్స్‌ రాయగలుగుతారు. ప్రిలిమ్స్‌ పరీక్షను ఈ ఏడాది మే 28న నిర్వహించబోతున్నారు. ఇప్పుడున్న వ్యవధిలో ఈ పరీక్షకు సమగ్రంగా ఎలా సన్నద్ధం  కావాలో తెలుసుకుందాం.

Updated : 27 Mar 2023 06:27 IST

యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రక్రియలో ప్రిలిమినరీకి చాలా ప్రాధాన్యం ఉంది. దీనిలో అర్హత సాధిస్తేనే తర్వాతి అంచె.. మెయిన్స్‌ రాయగలుగుతారు. ప్రిలిమ్స్‌ పరీక్షను ఈ ఏడాది మే 28న నిర్వహించబోతున్నారు. ఇప్పుడున్న వ్యవధిలో ఈ పరీక్షకు సమగ్రంగా ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం.

సివిల్స్‌లో తొలి మెట్టు అయిన ప్రిలిమ్స్‌లో ఎక్కువమంది అభ్యర్థులు అర్హత సాధించలేరు. ఎందుకంటే... ఏ ప్రాతిపదికన ప్రశ్నలను రూపొందిస్తారనే విషయంలో వారికి అంతగా అవగాహన ఉండదు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్‌ పాసవడం సులువైనదని అపోహ పడుతుంటారు. అందుకే ప్రిలిమినరీ పరీక్ష తీరుపై సరైన అవగాహన పెంచుకోవటం ముఖ్యం.

సివిల్స్‌కు సంబంధించి యూపీఎస్సీ సైద్ధాంతిక లక్ష్యాలేమిటో చూద్దాం. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు.

* జ్ఞానం, నైపుణ్యాలను సాధించాలని నిరంతరం పరితపించే అభ్యర్థులను ఎంచుకోవడం. 

* భావోద్వేగపరంగా సివిల్‌ సర్వీసెస్‌ను అభిమానించే వాళ్లను గుర్తించడం. 

* ప్రజాసేవకు అవసరమైన ప్రాథమిక విశ్లేషణాత్మక సామర్థ్యం అభ్యర్థులకు ఉందో లేదో తెలుసుకోవడం. 

* పై లక్ష్యాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల సంఖ్యను తగ్గించటం.

పేపర్‌-1, పేపర్‌-2లలో అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడం ద్వారా ఈ లక్ష్యాలను సాధిస్తారు.

ప్రశ్నల రూపకల్పన వెనుక...

* అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు కరెంట్‌ అఫైర్స్‌ కొలమానంగా ప్రశ్నలు అడుగుతారు. వీటి ద్వారా వర్తమానాంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను తెలుసుకుంటారు. 

* జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థికి ఉండే ఆసక్తిని పరీక్షిస్తారు. ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, వీటి పట్ల అభ్యర్థి స్పందనను పరీక్షిస్తారు. 

* జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్న కార్యక్రమాలు. అవి సామాన్య ప్రజలపై చూపే ప్రభావంపై ప్రశ్నలు ఇస్తారు. 

* భవిష్యత్తు కార్యక్రమాలపై ప్రభుత్వ వైఖరి, వాటి సాధనకు చేస్తోన్న కృషిపై అభ్యర్థికి ఉండే అవగాహనను పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. 

* ప్రశ్నలు కనీస తార్కిక పరిజ్ఞానాన్నీ, విశ్లేషణ సామర్థ్యాన్నీ పరీక్షిస్తాయి. ఎందుకంటే ఈ నైపుణ్యాలు భవిష్యత్తులో అభ్యర్థి పనితీరునూ ప్రభావితం చేస్తాయి.

ప్రిలిమినరీ ఎలా ఉంటుంది? 

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ప్రతి పేపర్‌కూ 200 మార్కులు. పేపర్‌-1లో 100 ప్రశ్నలు, ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. పేపర్‌-2లో 80 ప్రశ్నలు, ప్రతి సరైన సమాధానానికీ 2 1/2 మార్కులు. నెగెటివ్‌ మార్కులూ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 శాతం మార్కులు తగ్గిస్తారు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పేపర్‌-2లో 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అంటే 200 మార్కులకు కనీసం 67 మార్కులు సంపాదించాలి. ఈ మార్కులు సాధించకపోతే తిరస్కరణకు గురైనట్టే. పేపర్‌-2లో కటాఫ్‌ మార్కుల కంటే ఎక్కువ సంపాదిస్తే..పేపర్‌-1ను పరిశీలిస్తారు. దీనిలో సాధించిన అత్యధిక మార్కుల ఆధారంగానే.. రిజర్వేషన్‌ పాలసీని అమలు చేసి మెరిట్‌ లిస్టును తయారుచేస్తారు.

ఇవీ లక్ష్యాలు...

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ అభ్యర్థి నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు.....

* పేపర్‌-2లో కనీస మార్కులు సాధించాలి. అప్పుడే పేపర్‌-1లో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 

* పేపర్‌-1లో 100కు 40 కచ్చితమైన జవాబులు ఉండేలా సన్నద్ధం కావాలి. 

* మరో 15 ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా ఊహించి రాసే నైపుణ్యం సంపాదించాలి. 

* సమాధానాల విషయంలో గుడ్డిగా అంచనాలు వేయకుండా స్వీయ క్రమశిక్షణను పాటించాలి. 

* ఒత్తిడికి గురై తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాసేయకుండా అప్రమత్తత పాటించాలి.

అభ్యర్థి సరైన సన్నద్ధత వ్యూహానికి.. మౌలిక అంశాల నుంచి మొదలుపెట్టడం ఎంతో అవసరం. సిలబస్‌ను సమగ్రంగా పరిశీలించి ప్రశ్నపత్రంలో వస్తున్న ధోరణులను అర్థం చేసుకోవాలి.

పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి?

* మొదటిసారిగా పరీక్షకు హాజరయ్యేవారికి సిలబస్‌ అంశాలు కొత్తగా అనిపించవచ్చు. పదో తరగతి తర్వాత సాధారణంగా ఇంజినీరింగ్‌/సైన్స్‌ లేదా కామర్స్‌ సబ్జెక్టులను ఎంచుకున్న అభ్యర్థులు ఉంటారు. ఇవన్నీ కొత్త సబ్జెక్టులే కాబట్టి ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం అవసరం. ఆ తర్వాత గతంలో అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. 

* ప్రశ్నల తీరు ఏటా మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రశ్నల రూపకల్పన విధానం మీద అవగాహన పెంచుకుని ప్రతి విభాగంలోని వర్తమానాంశాల మీదా దృష్టి సారించాలి. 

* చదవడానికి వేసుకున్న ప్రణాళికను కచ్చితంగా పాటిస్తూ వెళ్లాలి. సన్నద్ధత తీరును సమీక్షించుకుంటూ.. అవసరమైన మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. 

* రెండో దశలో ఒక విభాగం మొత్తాన్నీ పూర్తిచేయాలి. ఉదాహరణకు ఇండియన్‌ పాలిటీ. దీంట్లో పరీక్ష పెట్టుకుని ఎన్ని మార్కులు సాధించారో చూసుకోవాలి. 75 శాతం మార్కులు సంపాదించినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత సమయం తర్వాత అదే విభాగంలో మరోసారి పరీక్ష పెట్టుకుని మార్కులు చూసుకోవాలి. మళ్లీ 75 శాతం వచ్చినట్లయితే.. మరో సబ్జెక్టు అయిన ఎకనామిక్స్‌లోకి వెళ్లొచ్చు. మళ్లీ స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. 

* ఈ విధానం పూర్తయిన తర్వాత గ్రాండ్‌ టెస్టులు రాయాలి. వీటిలో నెగెటివ్‌ మార్కులను తగ్గించిన తర్వాత కనీసం 65 శాతం స్కోర్‌ సాధించాలి. 

* మొదటిసారిగా పరీక్ష రాసే అభ్యర్థులు ఈ 65 శాతం చాలా తక్కువ మార్కులు కదా అనుకోవచ్చు. కానీ ఇవి స్థిరంగా సాధిస్తుంటే మీరు విజయ పథంలో ఉన్నట్లే. 

* ఈ వ్యూహాన్ని పాటించినట్లయితే.. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి పేపర్‌-1లో మంచి స్కోరు సాధించవచ్చు.

పేపర్‌-2

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2నే సీశాట్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ పేపర్‌లో కింది సిలబస్‌ నుంచి 80 ప్రశ్నలు వస్తాయి.

పేపర్‌-2 (200 మార్కులు) సమయం: 2 గంటలు

1. కాంప్రహెన్షన్‌

2. ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

3. లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ

4. డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

5. జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ

6. బేసిక్‌ న్యూమరసీ (నంబర్స్‌ అండ్‌ దెయిర్‌ రిలేషన్స్‌, ఆర్డర్స్‌ ఆఫ్‌ మేగ్నిట్యూడ్‌.. పదోతరగతి స్థాయి)

7. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (ఛార్ట్స్‌, గ్రాఫ్స్‌, టేబుల్స్‌, డేటా సఫిషియన్సీ మొదలైనవి - పదోతరగతి స్థాయి)

గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌, డెసిషన్‌ మేకింగ్‌ల నుంచి ప్రశ్నలు ఇవ్వడం లేదు. వీటికి సరైన సమాధానాలు ఒకటికంటే ఎక్కువగా ఉండటంతో యూపీఎస్‌సీ వీటి నుంచి ప్రశ్నలను అడగడం లేదు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించే అవకాశం ఉంది.

* పేపర్‌-2ను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే తేలిగ్గానూ తీసుకోకూడదు. ఇదే అర్హతను నిర్దేశిస్తుంది. ఈ పేపర్‌ సరిగా రాయక ఎంతో మంది తిరస్కరణకు గురయ్యారు. 

* మ్యాథ్స్‌ అంత బాగా రానివారు ఈ పేపర్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. షార్ట్‌కట్‌ పద్ధతుల మెలకువలు తెలుసుకోవాలి. మ్యాథ్స్‌ ప్రశ్నలను నిర్లక్ష్యం చేయడమో, వాయిదా వేయడమో చేయకూడదు. 

* పేపర్‌-1 కంటే ముందుగానే పేపర్‌-2 సన్నద్ధతను మొదలుపెట్టాలి. ఎందుకంటే.. ఈ పేపర్‌ రాయడానికి అవసరమైన నైపుణ్యాలను రాత్రికి రాత్రే సాధించే అవకాశం ఉండదు.


పేపర్‌-1 సిలబస్‌: ఏ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు?

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ సిలబస్‌ చాలా జనరల్‌గా ఉంటుంది. నిర్దిష్టత లేనట్టు అర్థమవుతుంది. అందుకే ఏ సబ్జెక్టులో ఏ అంశాలు వస్తాయో అవగాహన రావాలంటే... గత కొన్నేళ్లలో వచ్చిన ప్రశ్నలను విశ్లేషించటమే మార్గం.

కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలు కొన్నిసార్లు నేరుగా అడిగితే.. మరికొన్నిసార్లు సబ్జెక్టుల్లోనూ కరెంట్‌ అఫైర్స్‌ కోణం కనిపిస్తుంది. పరీక్షలో ఈ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందువల్ల శ్రద్ధ వహించాలి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు