డిప్లొమాలకు దారి... పాలీసెట్‌

చిన్న వయసులోనే చక్కని ఉపాధికి పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు బాట  వేస్తున్నాయి. ఈ చదువులను తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థలు అందిస్తున్నాయి.

Updated : 29 Mar 2023 06:43 IST

చిన్న వయసులోనే చక్కని ఉపాధికి పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు బాట  వేస్తున్నాయి. ఈ చదువులను తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని సాంకేతిక విద్య శిక్షణ సంస్థలు పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌)-2023 ప్రకటనలు విడుదలచేశాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారు మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. సాంకేతిక అంశాలపై మక్కువ ఉన్నవారు ఈ చదువుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. భవిష్యత్తులో ఉద్యోగం, స్వయం ఉపాధి, ఉన్నత విద్య దిశగా అడుగులేయవచ్చు.

దో తరగతి పూర్తిచేసుకున్నవారి ముందు ఉన్న దారుల్లో డిప్లొమా కోర్సులు ముఖ్యమైనవి. గణితం, భౌతిక రసాయన శాస్త్రాల్లో పట్టు ఉన్నవారు డిప్లొమాలో రాణించవచ్చు. ప్రశ్నలన్నీ ఈ సబ్జెక్టుల్లోని అంశాలపైనే ఉంటాయి. చదువుకున్న బ్రాంచీని బట్టి కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నవారు, ఇప్పటికే పూర్తయినవారు ఆసక్తి ఉంటే పాలిటెక్నిక్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి లేదు. డిప్లొమా అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. పలు ప్రభుత్వ, పేరొందిన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. వీరికి ఆకర్షణీయ వేతనాలూ దక్కుతున్నాయి.


ఇవీ కోర్సులు

ఎక్కువ సంఖ్యలో బ్రాంచీలు ఉండటం డిప్లొమాల ప్రత్యేకత. అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకునే అవకాశం విద్యార్థులకు దక్కుతుంది. సివిల్‌, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్‌, మెటలర్జికల్‌, కెమికల్‌, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ.. తదితర బ్రాంచీలను ఏపీ, తెలంగాణ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.  

కొన్నేళ్ల నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఏఐ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ డిజైనింగ్‌, 3డీ యానిమేషన్‌ గ్రాఫిక్స్‌, యానిమేషన్‌-మల్టీ మీడియా టెక్నాలజీ... మొదలైన కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన కళాశాలల్లో డిప్లొమాలో భాగంగా అందిస్తున్నారు. పాలీసెట్‌లో చూపిన ప్రతిభతో వీటిలోనూ చేరవచ్చు. ఇవే కోర్సులను బీఎస్సీ/బీటెక్‌లో చదువుకోవచ్చు.


ఉద్యోగాలెన్నో..

డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు పలు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. వీరికి మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల్లో వేల సంఖ్యలో కొలువులున్నాయి. రైల్వేల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టులకు డిప్లొమా విద్యార్హతతోనే పోటీపడవచ్చు. అలాగే వివిధ కేంద్రీయ సంస్థల్లోనూ జేఈ ఖాళీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి భర్తీ చేస్తోంది. పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఏడో వేతన సంఘం లెవెల్‌-6 ప్రకారం రూ.35,400 మూల వేతనం లభిస్తుంది. వీరు మొదటి నెల నుంచే అన్ని ఆలవెన్సులూ కలుపుకుని సుమారు రూ.55,000 జీతం పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో.. విద్యుత్తు పంపిణీ, రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్‌, నీటిపారుదల...తదితర శాఖల్లో డిప్లొమాతో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ప్రైవేటు రంగంలో విస్తృతంగా ఉద్యోగాలు దక్కుతున్నాయి. నిర్మాణ పరిశ్రమ, ఆటోమొబైల్‌, పవర్‌ ప్లాంట్లు, ఇంజినీరింగ్‌ సంస్థల్లో వీరు సులువుగానే నిలదొక్కుకోవచ్చు. పేరొందిన పాలిటెక్నికల్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. పలు విభాగాల్లో సేవలు అందిస్తోన్న కార్పొరేట్‌ సంస్థలు వీరిని ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. రైల్వోలో లోకో పైలట్‌ ఉద్యోగాలకు సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు పోటీపడొచ్చు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్‌ విభాగం వాళ్లు రాణించగలరు. సివిల్‌ అభ్యర్థులు నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్చు. కొన్ని బ్రాంచీల వారికి రక్షణ రంగంలోనూ కొలువులు ఉన్నాయి. ఎయిర్‌  ఫోర్సులో ఎక్స్‌, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్‌ పోస్టులకు డిప్లొమా అర్హతతో పోటీ పడవచ్చు. డిప్లొమాతోనే దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా...తదితర చోట్ల పెద్ద మొత్తంలో వేతనంతో మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.


ఉన్నత విద్య

డిప్లొమా అనంతరం ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని భావించినవాళ్లు ఈసెట్‌తో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. వీరు ఎంసెట్‌/ఈఏపీసెట్‌, ఐఐటీ-జేఈఈ రాసుకోవచ్చు. కొన్ని బ్రాంచీలవారికి నేరుగా బీఎస్సీ రెండో సంవత్సరం కోర్సుల్లోకీ తీసుకుంటారు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవాళ్లు ఇంజినీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అందించే అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ) పూర్తిచేసుకోవచ్చు. ఇది బీటెక్‌తో సమాన స్థాయి కోర్సు. ఆ తర్వాత ఎంటెక్‌ దిశగానూ అడుగులేయవచ్చు. లేదా డిప్లొమా అర్హతతోనే ఆసక్తి ఉన్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులూ చదువుకోవచ్చు.


పరీక్ష ఇలా..

పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఏపీలో నిర్వహించే పరీక్షలో... మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచి పదో తరగతి సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-ఎ: మ్యాథ్స్‌ 50, సెక్షన్‌- బి: ఫిజిక్స్‌ 40, సెక్షన్‌-సి: కెమిస్ట్రీ 30 ప్రశ్నలు ఉంటాయి.

తెలంగాణ పాలీసెట్‌తో రెగ్యులర్‌ పాలిటెక్నిక్‌ కోర్సులతోపాటు అగ్రికల్చర్‌, ఫిషరీస్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌ డిప్లొమాల్లోకీ అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు పరీక్ష రాయడం తప్పనిసరి. తెలంగాణ పాలీసెట్‌లో మ్యాథ్స్‌ 60, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. రెగ్యులర్‌ డిప్లొమాలో ప్రవేశం ఆశించేవారు బయాలజీ రాయనవసరం లేదు. అన్ని కోర్సులకూ ప్రయత్నించాలనుకున్నవారు, ప్రత్యేక డిప్లొమాల్లో చేరాలని భావించేవారు బయాలజీనీ రాయాలి.  

* పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నలు పాలీసెట్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించి పరీక్షపై పూర్తి అవగాహన పొందవచ్చు.

* పదో తరగతి పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. పరీక్షకు ముందు 10 మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధతను మెరుగుపర్చుకుంటే పేరున్న పాలిటెక్నికల్‌ కాలేజీలో, కోరుకున్న డిప్లొమా కోర్సులో సీటు పొందవచ్చు.

* పాలీసెట్‌ సన్నద్ధతతోనే గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ/బైపీసీ గ్రూపుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షను ఎదుర్కోవచ్చు.

* ఈ పరీక్షను పదో తరగతి విద్యార్హతతో ఏ వయసువారైనా రాసుకోవచ్చు.


ముఖ్య తేదీలు

తెలంగాణ

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 24
పరీక్ష తేదీ: మే 17
ఫలితాలు: పరీక్ష జరిగిన  12 రోజుల తర్వాత
వెబ్‌సైట్‌: https://polycetts.nic.in


ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు రూ.400. ఎస్సీ, ఎస్టీలకు రూ.100
పరీక్ష తేదీ: మే 10 (54 ప్రాంతాల్లో 400 కేంద్రాల్లో నిర్వహిస్తారు)
ఫలితాలు: మే 25
వెబ్‌సైట్‌: https://polycetap.nic.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని