ఐసెట్‌ ర్యాంకుకు పోటీ పడుతున్నారా?

పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏలు ముఖ్యమైనవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీటిలో ప్రవేశానికి ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(ఐసెట్‌) దారి చూపుతుంది.

Updated : 19 Apr 2023 06:32 IST

తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు మార్గం

పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏలు ముఖ్యమైనవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీటిలో ప్రవేశానికి ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(ఐసెట్‌) దారి చూపుతుంది. ఈ ప్రకటన రెండు రాష్ట్రాల్లోనూ వెలువడింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీటు పొందడం సులువే అయినప్పటికీ మేటి సంస్థల్లో అవకాశం వచ్చినవాళ్లే భవిష్యత్తులో మెరవగలరు. ఇలాంటి వాటిలో సీటు సొంతం చేసుకోవాలంటే...  సన్నద్ధత ఎలా ఉండాలో చూద్దామా?

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో పరీక్షలెన్నో ఉన్నాయి. అలాగే ఎంసీఏలో చేరడానికి నిమ్‌సెట్‌ తప్ప ఉమ్మడి పరీక్షలు లేవు. ఎక్కువమంది విద్యార్థులు క్యాట్‌, జాట్‌, మ్యాట్‌, ఇతర పరీక్షలతో ఎంబీఏలో చేరుతున్నారు. బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీల్లో అవకాశం ఉండటంతో ఎంసీఏ వైపు వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలూ తమ ప్రాంగణాల్లో ఈ కోర్సులు బోధిస్తున్నాయి. వీటి అనుబంధంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలెన్నో ఎంబీఏ, ఎంసీఏలను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని మేటి సంస్థలూ ఉన్నాయి. ఇలాంటి చోట్ల ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. మెరుగైన ర్యాంకుతోనే ఈ సంస్థల్లో అవకాశం వస్తుంది. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐసెట్‌ ర్యాంకుతో ఏదో ఒక సంస్థలో సీటు పొందడం సులువే. కానీ పేరున్న సంస్థలతో పోలిస్తే వీటితో ప్రయోజనాలూ పరిమితంగానే ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా మండళ్ల తరఫున విశ్వవిద్యాలయాలు ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఏపీలో శ్రీకృష్ణదేవరాయ, తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023 పరీక్షలు జరుగుతాయి. ఏపీ, తెలంగాణ ఐసెట్‌ పరీక్ష స్వరూపం దాదాపు ఒకటే. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఒకే సన్నద్ధతతో రెండు పరీక్షలూ రాసుకోవచ్చు. దీంతో రెండు రాష్ట్రాల్లోని మేటి సంస్థలకు పోటీ పడవచ్చు. ఏపీ ఐసెట్‌ ముందు నిర్వహిస్తున్నారు అందువల్ల అది రాస్తే టీఎస్‌ఐసెట్‌కు మంచి అనుభవం అవుతుంది. ఏపీ ఐసెట్‌ కేంద్రం హైదరాబాద్‌లోనూ ఉంది. అలాగే తెలంగాణ ఐసెట్‌ను విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులోనూ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు రెండు పరీక్షలూ రాయడం తెలివైన నిర్ణయమే.

పరీక్ష ఇలా...

ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి ప్రశ్నకు నాలుగు ఐచ్ఛికాలు ఇస్తారు. వీటిలో సరైన జవాబును గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు.

* ఏపీ ఐసెట్‌లో సెక్షన్‌ ఏ ఎనలిటికల్‌ ఎబిలిటీలో.. డేటా సఫిషియన్సీ, ప్రోబ్లమ్‌ సాల్వింగ్‌ నుంచి 75, సెక్షన్‌ బీ కమ్యూనికేషన్‌ ఎబిలిటీలో.. ఒకాబ్యులరీ 15, ఫంక్షనల్‌ గ్రామర్‌ 20, బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టర్మినాలజీ 15, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 20 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ సీ మ్యాథమెటికల్‌ ఎబిలిటీలో.. అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీ 35, ఆల్జీబ్రా అండ్‌ జియోమెట్రికల్‌ ఎబిలిటీ 10, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ 10 ప్రశ్నలు ఉంటాయి.

* తెలంగాణ ఐసెట్‌లో సెక్షన్‌ ఏ..ఎనలిటికల్‌ ఎబిలిటీ విభాగానికి 75 మార్కులు. వీటిలో డేటా సఫిషియన్సీ 20, ప్రోబ్లమ్‌ సాల్వింగ్‌ 55 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ బీ.. మ్యాథమెటికల్‌ ఎబిలిటీ 75 మార్కులకు ఉంటుంది. ఇందులో అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీ 35, ఆల్జీబ్రికల్‌ అండ్‌ జియోమెట్రికల్‌ ఎబిలిటీ 30, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ 10 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ సీ కమ్యూనికేషన్‌ 50 మార్కులకు ఉంటుంది.

సన్నద్ధత

* ఈ పరీక్ష అకడమిక్‌ నేపథ్యంతో సంబంధం లేనిది. అందువల్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ సబ్జెక్టులో ప్రావీణ్యం, పాఠ్యపుస్తకాలతో పనిలేదు.

* ఆంగ్లం, ఆప్టిట్యూడ్‌, మ్యాథ్స్‌లపై పట్టున్నవారు రాణించగలరు. అభ్యాసంతో ఆర్ట్స్‌ విద్యార్థులు ఆప్టిట్యూడ్‌ ప్రశ్నల్లో ఎక్కువ స్కోరు చేయగలరు.

* ముందుగా సెక్షన్లు, విభాగాల వారీ సిలబస్‌ వివరాలు గమనించాలి. వీటిని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు.

* ఈ పరీక్షకు సంబంధించి మార్కెట్‌లో దొరికే ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకోవాలి. సిలబస్‌ ప్రకారం అంశాల వారీ సన్నద్ధత కొనసాగించాలి. ప్రతి విభాగం, అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.

* అధికారిక వెబ్‌సైట్లలో గత పరీక్షల ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంచారు. వీటిని బాగా పరిశీలించాలి. విభాగాలు, అంశాలవారీ ఎన్నేసి ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారో గమనించాలి. దాని ప్రకారం సన్నద్ధతను మలచుకోవాలి.

* ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న విభాగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

* రెండు వెబ్‌సైట్లలోనూ మాక్‌ టెస్టులూ అందుబాటులో ఉంచారు. వాటిని రాసి, ఎక్కడ తప్పులు జరిగాయో సరిచూసుకోవాలి.

* పరీక్షకు ముందు కనీసం 10 ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. ప్రతి పరీక్ష తర్వాత ఫలితాలు విశ్లేషించుకుని, తగిన మార్పులతో సన్నద్ధత మెరుగుపరచుకోవాలి.

* గణిత నేపథ్యం లేనివారు ఆ విభాగంలో ఎక్కువ మార్కులు పొందడానికి కొంచెం అధిక సమయం కేటాయించాలి. వీరు 8,9,10 తరగతుల్లోని గణిత పాఠ్యాంశాలపై శ్రద్ధ వహించి, వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే మ్యాథ్స్‌ అభ్యర్థులతో సమానంగా రాణించగలరు.

* రుణాత్మక మార్కులు లేనందువల్ల తెలియని ప్రశ్నలకు బాగా ఆలోచించి, ఏదైనా జవాబు గుర్తించవచ్చు.

* పరీక్షలో సమయపాలనకు ప్రాధాన్యం ఉంది. మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేస్తున్నప్పుడు సమయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.

* పరీక్షలో జవాబు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలను చివరలో ప్రయత్నించడమే మంచిది.


విభాగాల వారీగా...

* డేటా సఫిషియన్సీ: ఇందులో నంబర్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంది. కనీసం 4 నుంచి 8 వరకు ప్రశ్నలు వస్తాయి. సింపుల్‌ ఈక్వేషన్స్‌, ప్లేన్‌ జామెట్రీ అండ్‌ మెన్సురేషన్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, సెట్స్‌, కో ఆర్డినేట్‌ జామెట్రీ, రేషియో ప్రపోర్షన్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ అంశాలు ముఖ్యమైనవి.

* ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌/ ఎనలిటికల్‌ ఎబిలిటీ: నంబర్‌ సిరీస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ ఒక్క అంశంలోనే 8 నుంచి 15 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. లెటర్‌ ఎనాలజీ, నంబర్‌ ఎనాలజీ ఈ రెండూ ముఖ్యమైనవే. కోడింగ్‌ డీ కోడింగ్‌ 10 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రత్యేక సాధన అవసరం. గడియారాలు, వెన్‌డయాగ్రమ్‌, అరైవల్‌ అండ్‌ డిపార్చర్‌, సింబల్స్‌ అండ్‌ నొటేషన్స్‌ విభాగాల్లో మాదిరి ప్రశ్నలు ఎక్కువగా సాధన చేయాలి.

* కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: గ్రామర్‌, ఒకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇంటర్మీడియట్‌, డిగ్రీల్లోని వ్యాకరణాంశాలపై దృష్టి సారిస్తే సరిపోతుంది. పాత ప్రశ్నపత్రాలు పరిశీలించి, అధ్యయనం కొనసాగించాలి.

* మ్యాథమెటికల్‌ ఎబిలిటీ: ఇందులో ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌, ప్యూర్‌ మ్యాథ్స్‌ల నుంచి వస్తాయి. అరిథ్‌మెటిక్‌లో.. ఇండసెస్‌ అండ్‌ సర్డ్స్‌, ఈక్వేషన్స్‌, రేషియో, ప్రపోర్షన్‌, పర్సంటేజెస్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, పార్ట్‌నర్‌షిప్‌, నంబర్స్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌, మెన్సురేషన్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఈ అంశాలు బాగా సాధన చేయాలి. మ్యాథ్స్‌ విభాగంలో.. కోఆర్డినేట్‌ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, బైనామియల్‌ అండ్‌ రిమైండర్‌ థీరమ్‌, స్టాటిస్టిక్స్‌, ప్రాబబిలిటీలపై దృష్టి పెట్టాలి.

ఐసెట్‌ ప్రశ్నపత్రంలో కనీసం సగం ప్రశ్నలు తేలికగానే ఉంటాయి. అందువల్ల అర్హత సాధించడం కష్టమేమీ కాదు. 30 శాతం ప్రశ్నలు మధ్యస్థంగా, మిగిలిన 20 శాతం కఠినంగా ఉంటాయి. సగటు విద్యార్థులు సైతం 150 మార్కుల వరకు స్కోరు చేయగలరు. పేరున్న సంస్థల్లో సీటు పొందడానికి కనీసం 160 మార్కులైనా రావాలి. పరీక్షలో అర్హత సాధించడానికి 25 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలకు ఈ నిబంధన వర్తించదు.

200 ప్రశ్నలకు 150 నిమిషాలు అంటే ప్రతి ప్రశ్నకు 45 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఎనలిటికల్‌, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు. ఈ విభాగాల్లో  వీలైనన్ని ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఉన్న వ్యవధిలోనే జవాబు గుర్తించగలిగే నైపుణ్యం సొంతమవుతుంది. సూత్రాలు ఉపయోగించడం, షార్ట్‌కట్‌ పద్ధతి అనుసరించడంలో మెలకువ ఉండాలి.

అర్హత: ఎంబీఏ కోర్సులకు 50 (ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45) శాతం మార్కులతో ఏదైనా యూజీ కోర్సు ఉత్తీర్ణత. ఎంసీఏకి యూజీ లేదా ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారూ అర్హులే. గరిష్ఠ వయఃపరిమితి లేదు. 19 ఏళ్లు నిండితే చాలు.


ముఖ్య తేదీలు

తెలంగాణ

ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 6

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550. ఇతరులకు రూ.750.

పరీక్ష తేదీలు: మే 26, 27

వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in/

ఆంధ్రప్రదేశ్‌

ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 19

ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.550, బీసీలకు రూ.600, ఇతరులకు రూ.650.

పరీక్ష తేదీలు: మే 24, 25.

వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని