NIPER: నైపర్‌ సీటుకు పోటీ పడతారా?

ఇంజినీరింగ్‌కు ఐఐటీలు, వైద్యవిద్యకు ఎయిమ్స్‌ల మాదిరి ఫార్మసీలో మేటి చదువులకు వేదికలు..  నైపర్‌లు. ఇక్కడ పలు స్పెషలైజేషన్లతో ఎంఫార్మసీతోపాటు ఎంబీఏ ఫార్మా కోర్సు అందుబాటులో ఉంది. ఫార్మా రంగంలో పీహెచ్‌డీనీ పూర్తి చేసుకోవచ్చు.

Updated : 24 Apr 2023 07:25 IST

ఫార్మసీలో ప్రామాణిక కోర్సులు
నైపర్‌ జేఈఈ-2023

ఇంజినీరింగ్‌కు ఐఐటీలు, వైద్యవిద్యకు ఎయిమ్స్‌ల మాదిరి ఫార్మసీలో మేటి చదువులకు వేదికలు..  నైపర్‌లు. ఇక్కడ పలు స్పెషలైజేషన్లతో ఎంఫార్మసీతోపాటు ఎంబీఏ ఫార్మా కోర్సు అందుబాటులో ఉంది. ఫార్మా రంగంలో పీహెచ్‌డీనీ పూర్తి చేసుకోవచ్చు.

దేశంలో ఫార్మా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఫార్మా సంస్థలు ఔషధాల తయారీలో భాగమవుతున్నాయి. ఎక్కువమంది ఇందులో ఉపాధీ పొందుతున్నారు. ఈ రంగంలో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైనది నైపర్‌ జేఈఈ. ఇందులో సాధించిన స్కోరుతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. ఫార్మసీ చదువుల్లో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా వీటిని నెలకొల్పారు. ఇక్కడ వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. నైపర్‌ జేఈఈ-2023 ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు..

దేశవ్యాప్తంగా 7 నైపర్‌లు ఉన్నాయి. వీటిని.. అహ్మదాబాద్‌, గువాహటి, హాజీపూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, రాయ్‌బరేలీ, మొహాలిల్లో నెలకొల్పారు.
ఉన్నత బోధన ప్రమాణాలు, ఆధునిక ప్రయోగశాలలు, వసతులు ఈ సంస్థల ప్రత్యేకత. ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులు ఫార్మాకు సంబంధించి బోధన, పరిశోధన రంగాల్లోనూ రాణించే అవకాశాలు ఎక్కువ. నైపర్‌లు ప్రపంచంలో పేరొందిన సంస్థలతో కలిసి ఫార్మసీలో బోధన, పరిశోధనలకు మేటి వేదికలుగా కొనసాగుతున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ పీజీ పీహెచ్‌డీ

గత (2022-23) విద్యా సంవత్సరం నుంచి ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ పీజీ-పీహెచ్‌డీ కోర్సులను నైపర్‌లు ప్రారంభించాయి. ఇందులో మొదటి రెండేళ్లు పీజీ కోసం, తర్వాత నాలుగేళ్లు పీహెచ్‌డీకి కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో కోర్సులోకి తీసుకుంటారు. మొదటి రెండేళ్లు పీజీ ఫెలోషిప్‌, తర్వాతి నాలుగేళ్లు పీహెచ్‌డీ ఫెలోషిఫ్‌ అందుతుంది. నైపర్‌ పీజీ కోర్సులో చేరడానికి ఉన్న అర్హతలే ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీకీ వర్తిస్తాయి. ఈ సంస్థల్లో ఫార్మసీ పీజీ కోర్సుల్లో చేరినవారు చదువు పూర్తయ్యేంత వరకు ప్రతి నెలా రూ.12,400 స్టైపెండ్‌ పొందవచ్చు. ఎంబీఏ ఫార్మా కోర్సుకు స్టైపెండ్‌ వర్తించదు. ఈ కోర్సులో చేరిన మెరిట్‌ విద్యార్థులకు ఆయా సంస్థలు ప్రత్యేకంగా స్టైపెండ్‌ చెల్లిస్తున్నాయి.

కోర్సులు, స్పెషలైజేషన్లు

ఎంఫార్మసీ, ఎంటెక్‌ (ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ), ఎంఎస్‌ (ఫార్మసీ), ఎంబీఏ (ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌)
ఎంఎస్‌ ఫార్మసీలో: పది స్పెషలైజేషన్లు ఉన్నాయి. మెడిసినల్‌ కెమిస్ట్రీలో 133, నేచురల్‌ ప్రొడక్ట్స్‌లో 59, ట్రెడిషినల్‌ మెడిసిన్‌లో 5, ఫార్మా స్యూటికల్‌ ఎనాలిసిస్‌లో 104, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీలో 152, రెగ్యులేటరీ టాక్సికాలజీలో 48, ఫార్మాస్యూటిక్స్‌లో  158, బయోటెక్నాలజీలో 91, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్‌లో 39, రెగ్యులేటరీ ఎఫైర్స్‌లో 10 సీట్లు ఉన్నాయి.
ఎంఫార్మసీలో: ఫార్మస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌)లో 27, ఫార్మసీ ప్రాక్టీస్‌లో 45, క్లినికల్‌ రిసెర్చ్‌లో 9 సీట్లు.
ఎంటెక్‌: ప్రాసెస్‌ కెమిస్ట్రీలో 32, బయోటెక్నాలజీలో 11, బయోఫార్మాస్యూటికల్స్‌లో 54 సీట్లు.
ఎంటెక్‌/ఎంఎస్‌: మెడికల్‌ డివైజెస్‌లో 63 సీట్లు.
* ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌లో 119 సీట్లు.
* మొత్తం అన్ని పీజీల్లోనూ కలిపి 1158 సీట్లు ఉన్నాయి.
అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణత. కొన్ని కోర్సులకు బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, నిర్దేశిత విభాగాల్లో ఎమ్మెస్సీ, బీటెక్‌ పూర్తిచేసుకున్నవారికీ అవకాశం ఉంది. సంబంధిత కోర్సుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం, దివ్యాంగులైతే 50 శాతం ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నైపర్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారు జీప్యాట్‌ /గేట్‌ /నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. 

పీజీ పరీక్ష ఇలా...

మెడికల్‌ డివైజెస్‌ కోర్సు తప్పించి, అన్ని పీజీ కోర్సులకు ఒకటే పరీక్ష. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావుశాతం మార్కులు తగ్గిస్తారు. ప్రశ్నలను బీఫార్మసీ లేదా సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ సబ్జెక్టుల నుంచి అడుగుతారు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, బేసిక్‌ ఇంగ్లిష్‌  నుంచీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందులో ప్రతిభ చూపిన వారికి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో 106 సీట్లు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకున్నవాళ్లు పీజీకి నిర్వహించే పరీక్షనే రాయాలి. ఎంబీఏలో 119 సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రవేశానికి బృందచర్చలు, ముఖాముఖి నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ఎస్‌ఎఎస్‌ నగర్‌ (మొహాలీ) క్యాంపస్‌ల్లోనే ఎంబీఏ అందిస్తున్నారు.
పరీక్షలో విజయానికి బీఫార్మసీ పుస్తకాల్లోని ముఖ్యాంశాలను బాగా చదవాలి. జీప్యాట్‌, నైపర్‌ జేఈఈ పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం ద్వారా పరీక్షలో ఎక్కువ మార్కులు పొందవచ్చు.

పీహెచ్‌డీ పరీక్ష

బయలాజికల్‌, ఫార్మాస్యూటికల్‌, కెమికల్‌ సైన్సెస్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఫార్మసీ విభాగాల్లో పీహెచ్‌డీ అందిస్తున్నారు. 249 సీట్లు ఉన్నాయి.
ఎంఎస్‌ ఫార్మ్‌/ ఎంఫార్మసీ/ ఎంటెక్‌ ఫార్మ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో సీట్లు కేటాయిస్తారు. పరీక్షలో 170 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 85 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా సమాధానం గుర్తిస్తే పావుశాతం మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో అర్హత సాధించినవారికి 15 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.  
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మే 16 వరకు.
పరీక్ష: జూన్‌ 23న.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.
వెబ్‌సైట్‌: https://niperguwahati.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని