తరగతి గది దాటి.. చదువుదామా!

తరగతి పుస్తకాలు ఎటూ చదువుతాం. అక్షరాలతో పోటీ పడుతూ ఆన్సర్లతో కుస్తీ పడుతూ జవాబులు కంఠతా పట్టేస్తాం.

Updated : 02 May 2023 01:34 IST

రగతి పుస్తకాలు ఎటూ చదువుతాం. అక్షరాలతో పోటీ పడుతూ ఆన్సర్లతో కుస్తీ పడుతూ జవాబులు కంఠతా పట్టేస్తాం. సబ్జెక్టు నచ్చినా నచ్చకపోయినా మార్కుల కోసం, గ్రేడ్ల కోసం  ఏడాదంతా ఇది తప్పదు. అలాంటప్పుడు పుస్తకాలంటే ఎంతోకొంత బోర్‌ కొట్టకమానదు. మరి అస్సలు బోర్‌ కొట్టకుండా ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గా అనిపించే పుస్తకాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ వేసవిలో తరగతి గది దాటి, ఆ భాషా ప్రపంచంలోకి, ఆ ఊహాలోకంలోకి..
పయనిద్దామా?
* పుస్తకాలు చదవడం మంచి అలవాటు అనేది నిజానికి తరగతి గది పాఠ్యపుస్తకాలను ఉద్దేశించి అన్నమాట కాదు. వాటిని మించి బయట లభించే విస్తృతమైన సాహిత్యం గురించి.. వివిధ రకాలైన మంచి పుస్తకాల గురించి! ఇవి ఎందుకు చదవాలి అని ప్రశ్న తలెత్తినప్పుడు.. దానికి చాలా చక్కని జవాబులున్నాయి. ఇలా పుస్తకాలు చదవడం విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంచుతుంది, భాషా జ్ఞానం అలవడేలా చేస్తుంది, త్వరగా చదివి సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునేలా మెదడుకు పదును పెడుతుంది, విలువైన విషయాలు తెలుసుకోవడం వల్ల సమాచార సంపద పెరుగుతుంది.. ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాలా పెద్దదే ఉంది!
* మరి ఏ పుస్తకాలు చదవాలి అని అడిగితే ఎవరికి నచ్చిన అంశానికి వారు ఓటేయొచ్చు. పుస్తకం మంచిదైతే చాలదు.. అది చర్చించే అంశాలపై మనకు ఆసక్తి ఉండాలి. అప్పుడే ఆసాంతం పూర్తిచేయగలం. అందుకే మీకు నచ్చిన ఏ విషయంపైనైనా ఒక చక్కటి పుస్తకం చదివేందుకు ప్రయత్నించండి. దీని ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందారో గుర్తించండి. అప్పుడు మీరే చదవకుండా ఉండలేరు. అయితే ఉపయోగకరమైనవే ఎంచుకోవాలి సుమా!
*  గ్రాఫిక్‌ నవలలు, కామిక్స్‌, స్ఫూర్తిగాథలు, ఫిక్షనల్‌ స్టోరీస్‌.. ఇలా చదవాలంటే చాలా రకాలే ఉన్నాయి. ఇరవై ఏళ్లలోపు వారిని ఆకట్టుకునేలా గత కొన్నేళ్లుగా కొత్త తరహా పుస్తకాలు, సాహితీ ప్రక్రియలు వచ్చాయి. విజువల్‌ రిప్రజెంటేషన్‌ ఉండేవి చిన్నవాళ్లను ఉద్దేశించినవే అయినా... పెద్దవారినీ ఆకట్టుకుంటాయి. చరిత్రను తెలుసుకోవడం, సైన్స్‌ను అర్థం చేసుకోవడం, రోజువారీ విషయాలపై అవగాహన పెంచుకోవడం, ప్రాక్టికల్‌ సమస్యలను పరిష్కరించడం, ఇలా ఏది తెలుసుకోవాలన్నా.. పుస్తక పఠనం పనికొస్తుంది. పుస్తకాలు మంచి కాలక్షేపం మాత్రమే కాదు, చక్కని జ్ఞానమార్గం కూడా. మరి.. ఈ సెలవుల్లో మీరేం చదువుతున్నారు?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని