భద్రతా బలగంలో దళపతి అవుతారా!

పట్టభద్రులు పోటీ పడే ముఖ్యమైన ఉద్యోగాల్లో సీఏపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు ముందు వరుసలో ఉంటాయి.

Updated : 09 May 2023 06:51 IST

సీఏపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు

పట్టభద్రులు పోటీ పడే ముఖ్యమైన ఉద్యోగాల్లో సీఏపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు ముందు వరుసలో ఉంటాయి. ఈ నియామకాలు యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో జరుగుతాయి. దాదాపు ఏటా వీటి భర్తీకి    ప్రకటన వెలువడుతుంది. పరీక్ష, ఫిజికల్‌ టెస్టులు, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. తాజాగా 322 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వాటికి ఎలా సన్నద్ధం కావాలో చూద్దామా?


దేశ రక్షణ, భద్రతపై ఆసక్తి, యూనిఫారం ఉద్యోగాలపై ప్రత్యేక అభిమానం ఉన్నవారు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)ల్లో అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ (ఏసీ) పోస్టులకు ప్రయత్నించవచ్చు. సివిల్స్‌లో ఐపీఎస్‌కు ఎంపికైనవారితో సమాన స్థాయి ఉన్న పోస్టులివి. పాతికేళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లంతా పోటీపడవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది.  


సిస్టెంట్‌ కమాండెంట్‌ అంటే డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్‌పీ), అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)తో సమాన హోదా ఉద్యోగం. ఎంపికైనవారు అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా సాయుధ బలగాలైన.. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సు (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సు (సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్సు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ)లో విధులు నిర్వహిస్తారు. వీరికి గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ హోదా దక్కుతుంది.

విధుల సంగతి?

సీఏపీఎఫ్‌కు ఎంపికైనవారికి సంబంధిత విభాగానికి చెందిన కేంద్రాల్లో ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు ఆ విభాగంలో సేవలు అందిస్తారు. వీరు ప్రధానంగా దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. ప్రమాదం ఉన్నచోట ప్రత్యక్షమవుతారు. అవసరమైనచోట ఎన్నికల విధులను సైతం నిర్వర్తిస్తారు. సరిహద్దుల్లో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్లోనూ భాగమవుతారు. వీరికి రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు కలిపి మొదటి నెల నుంచే సుమారు రూ. లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. నిర్ణీత వ్యవధుల్లో పదోన్నతులు పొందవచ్చు. భవిష్యత్తులో సంబంధిత విభాగానికి ప్రధానాధికారీ కావచ్చు.

పరీక్షలో...

రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో పేపర్‌-1కు 250 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ అంశాల నుంచి 125 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ మూడో వంతు మార్కులు తగ్గిస్తారు. పేపర్‌ 2 మొత్తం 200 మార్కులకు డిస్క్రిప్టివ్‌లో ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ఇందులో జనరల్‌ స్టడీస్‌, ఎస్సే, కాంప్రహెన్షన్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌-1లో అర్హత సాధిస్తేనే పేపర్‌-2 మూల్యాంకనం చేస్తారు. పేపర్‌-2లో కనీసం 25 శాతం అంటే 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా అర్హత పొందినవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం కొంత మందిని ఎంపికచేసి, ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు.

ఫిజికల్‌ టెస్టులు..

పురుషులకు.. కనీసం 165 సెం.మీ. ఎత్తు, 50 కి.గ్రా. బరువు, 81 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం ఉండాలి. ఊపిరి పీల్చిన తర్వాత 5 సెం.మీ. పెరగాలి. మహిళలు 157 సెం.మీ. ఎత్తు, 46 కి.గ్రా. బరువు తప్పనిసరి. వంద మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకన్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి. లాంగ్‌ జంప్‌లో పురుషులు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు దూరం దూకాలి. షాట్‌పుట్‌లో 7.26 కి.గ్రా. గుండు/దిమ్మను పురుషులు 4.5 మీటర్ల దూరానికి మూడు ప్రయత్నాల్లో ఒకసారైనా విసరాలి. మహిళలకు దీన్ని మినహాయించారు.

ఇంటర్వ్యూ

ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే ముఖాముఖీకి పిలుస్తారు. దీనికి 150 మార్కులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్లు అనుసరించి, తుది నియామకాలు ఖరారు చేస్తారు.

పేపర్‌ 2: ఇందులో రెండు భాగాలు. పార్ట్‌-ఏలో వ్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు. ఇంగ్లిష్‌ లేదా హిందీలో సమాధానం రాయాలి. ఇందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కులకు సంబంధించిన సంఘటనలు, ఎనలిటికల్‌ ఎబిలిటీ మొదలైన ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-బీలో అభ్యర్థి ఆంగ్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. కాంప్రహెన్షన్‌, ప్రెసీ, లాంగ్వేజ్‌ స్కిల్స్‌ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి మొత్తం ఆంగ్లంలోనే జవాబులు రాయాలి.

ప్రశ్నలిలా..

పేపర్‌ 1: ఆరు అంశాల్లో అభ్యర్థి సమర్థతను పరీక్షిస్తారు. మెంటల్‌ ఎబిలిటీలో.. రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ సైన్స్‌లో.. దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యావరణం అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. వర్తమాన సంఘటనల విభాగంలో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలను చదువుకోవాలి. ఇందులో భాగంగా నాగరికత, కళలు, సాహిత్యం, క్రీడలు, పాలనా విభాగాలు, వర్తకం, పరిశ్రమలు, ప్రపంచీకరణ...మొదలైనవాటికి ప్రాధాన్యం. మరో విభాగం ఇండియన్‌ పాలిటీ అండ్‌ ఎకానమీలో.. దేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సామాజిక వ్యవస్థ, ప్రజా పరిపాలన భారత ఆర్థిక పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సమస్యలు; మానవ హక్కులు, వాటి సూచికలు మొదలైనవాటిపై ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర విభాగం నుంచి.. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడే అంశాలను ప్రశ్నిస్తారు. అలాగే జాతీయవాదం, స్వాతంత్య్రోద్యమం సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలూ అడుగుతారు. భూగోళశాస్త్రంలో.. భౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన జాతీయ, ప్రపంచ సంఘటనలకు ప్రాధాన్యముంది. 

సన్నద్ధత

సివిల్స్‌, గ్రూప్‌-1లకు ఇప్పటికే సన్నద్ధమవుతున్నవారు ఈ పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు. తాజా అభ్యర్థులూ ప్రణాళికతో సన్నద్ధమైతే విజయాన్ని అందుకోవచ్చు.
* ముందుగా ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. అధ్యయనం వీటి నుంచే ప్రారంభించాలి. ఇందుకోసం.. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌ అంశాలను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో పూర్తిచేసుకోవచ్చు. ఈ సబ్జెక్టుల్లో 8 నుంచి 12 తరగతుల్లోని ముఖ్యాంశాలను బాగా చదవాలి.
* సీఏపీఎఫ్‌(ఏసీ) పాత ప్రశ్నపత్రాలు యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  వాటిని శ్రద్ధగా పరిశీలించాలి. ఏ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, వాటి స్థాయి, అంశాలవారీ ప్రాధాన్యం.. వీటిని గమనించి అందుకు అనుగుణంగా సన్నద్ధతను మలచుకోవాలి.
* వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంది. ఈ విభాగంలో అధిక మార్కులకు.. ఏదైనా దినపత్రికను అనుసరించాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. గత ఏడాది ఆగస్టు నుంచి జరుగుతోన్న ముఖ్య పరిణామాలపై దృష్టి సారించాలి. అవార్డులు, నియామకాలు, నివేదికలు, రచనలు, సంఘటనలు, వార్తల్లో వ్యక్తులు, భద్రతపరమైన అంశాలను గుర్తుంచుకోవాలి.
* జనరల్‌ స్టడీస్‌, ఎస్సే, కాంప్రహెన్షన్‌ పేపర్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌. అందువల్ల రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే బాగా రాయడానికి సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. ఈ విభాగంలోని పలు ప్రశ్నలు తాజా పరిణామాల ఆధారంగా వస్తున్నాయి. అందువల్ల పత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థలు విడుదలచేసిన నివేదికలు బాగా చదవాలి.
* పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలను విశ్లేషించుకుని సన్నద్ధతను కొనసాగించాలి.
* పరుగు, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ల్లో అర్హత పొందడానికి ఇప్పటి నుంచే సాధన ప్రారంభించాలి.


గమనించండి!

ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌ 86, సీఆర్‌పీఎఫ్‌ 55, సీఐఎస్‌ఎఫ్‌ 91, ఐటీబీపీ 60, ఎస్‌ఎస్‌బీ 30. మొత్తం 322.  
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: ఆగస్టు 1, 2023 నాటికి కనిష్ఠం 20 గరిష్ఠం 25 ఏళ్లు. ఆగస్టు 2, 1998 - ఆగస్టు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మే 16 సాయంత్రం 6 వరకు
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.200
పరీక్ష తేదీ: ఆగస్టు 6
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి.
వెబ్‌సైట్‌: https://upsc.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు