ఔషధ తయారీలో.. అత్యుత్తమ అవకాశాలు!

వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా.. కొత్త కొత్త వ్యాధులు, వైరస్‌లు మానవాళి మీద దాడిచేస్తూనే ఉన్నాయి. కరోనా, ఎబోలా వంటి మహమ్మారులు.. అంతుపట్టని క్యాన్సర్లు వేధిస్తూనే ఉన్నాయి.

Published : 15 May 2023 00:09 IST

వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా.. కొత్త కొత్త వ్యాధులు, వైరస్‌లు మానవాళి మీద దాడిచేస్తూనే ఉన్నాయి. కరోనా, ఎబోలా వంటి మహమ్మారులు.. అంతుపట్టని క్యాన్సర్లు వేధిస్తూనే ఉన్నాయి. ఇటువంటి రోగాలను సమర్థంగా ఎదుర్కొనే మందులు కనిపెట్టడానికి నిరంతర పరిశోధన, కఠోర శ్రమ, అవిరళ కృషి అవసరం. అవిశ్రాంతంగా చేసే ఆ శోధనలే భవిష్యత్తు తరాలకు భరోసానిచ్చేది. ఇటువంటి సమున్నత బాధ్యతను భుజాలకెత్తుకుని ప్రజల కోసం పనిచేసేవారే బయోఫార్మాస్యూటికల్స్‌ నిపుణులు. ప్రస్తుతం ఈ రంగంలో లోతైన పరిశోధనలు,  సరికొత్త ఆవిష్కరణలు జరుగుతుండటం వల్ల అవకాశాలూ పెరిగాయి.

ఆధునిక సైన్స్‌లో బయోఫార్మాస్యూటికల్స్‌ ఓ కొత్త చరిత్రకు నాంది పలికింది. బయోటెక్నాలజీ ప్రపంచ గతిలో సానుకూల మార్పులు తీసుకురావడమే కాదు.. మనిషి జీవితంలో ప్రతి చిన్న అంశాన్నీ ప్రభావితం చేసింది. ఇంతటి ముఖ్యమైన రంగంలో పరిశోధన, అభివృద్ధి దశలో కెరియర్‌ అవకాశాలకు కొదవ లేదు. సునిశితమైన బయోటెక్నలాజికల్‌ పద్ధతులను అనుసరించి లివింగ్‌ సెల్స్‌, ఆర్గానిజమ్స్‌తో తయారైన ఔషధాలను బయోఫార్మాస్యూటికల్స్‌ అంటున్నారు. మాలిక్యులర్‌ బయాలజీ పద్ధతులను ఉపయోగిస్తూ తయారైన మందులను ఇలా పిలుస్తున్నారు. ఇలా తయారైన ఔషధాలు సింథటిక్‌ డ్రగ్స్‌కు భిన్నమైనవి, వాటితో పోలిస్తే క్లిష్టమైనవి. కఠినమైన వ్యాధులు, ప్రాణాపాయం ఉన్న పరిస్థితుల్లో వీటిని అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వీటిని వ్యాక్సిన్లు, పెప్టిసైడ్స్‌, యాంటీజెన్స్‌, హార్మోన్స్‌, సైటోకైన్స్‌, ఎంజైమ్స్‌, అలర్జెనిక్స్‌, సెల్‌ థెరపీస్‌, జీన్‌ థెరపీస్‌, ఆర్గాన్స్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌.. ఇలా ఉపయోగిస్తున్నారు.

ఎన్నో ఆవిష్కరణలు...

ప్రస్తుతం భారత్‌లో ఈ తరహా పరిశోధనలు ముందుకు నడిపించేందుకు సైన్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఉద్యోగులు అధిక సంఖ్యలో అవసరం అవుతున్నారు. ఈ రంగంలో ఉద్యోగాలు నాలెడ్జ్‌, ఇన్నోవేషన్‌, డిస్కవరీ, సైన్స్‌ల మేలు కలయిక. పరిశ్రమలు, రెగ్యులేటరీ బాడీస్‌, విద్యాసంస్థలు, రిసెర్చ్‌లో అవకాశాలు పొందడమే కాకుండా.. తమ ఆవిష్కరణలతో దేశానికి సేవ చేసే సదవకాశాన్ని పొందవచ్చు.

* ప్రస్తుతం మన దేశం బయోఫార్మాస్యూటికల్స్‌లో రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ రంగంలో రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ప్రొడక్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, క్వాలిటీ ఎస్య్సూరెన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, క్లినికల్‌ ట్రైల్స్‌.. వంటి పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్స్‌ సంఖ్యలో ఇండియా మూడోస్థానంలో ఉంది. ఇందులో దాదాపు 4,237 అంకుర సంస్థలు బయోటెక్‌ రంగంలోనే ఉన్నాయి. 2019తో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ! ఇది చాలు, ఈ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి. చాలా తక్కువ సమయంలో వేగం పుంజుకుంది. ఇందులో నూతన టెక్నాలజీలను అవలంబిస్తూ ఉండటం వల్ల (జీనోమ్స్‌, జీన్‌ ఎడిటింగ్‌.. వంటివి), డిజిటలైజేషన్‌ అవుతుండటం వల్ల (5జీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌..) ఆవిష్కరణలు మరింత వేగంగా జరుగుతున్నాయి.

కోర్సులు

ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో మన దేశ  యువత మరింతగా రాణించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌- నైపర్‌’ సంస్థలను ప్రారంభించి నిర్వహిస్తోంది. ఇవి అహ్మదాబాద్‌, గువాహటి, హాజీపూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌.ఏ.ఎస్‌.నగర్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే నైపర్‌ - జేఈఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ విద్యాసంస్థల్లోకి ప్రవేశం దొరుకుతుంది.

* కొత్తగా నైపర్‌లో ఎంటెక్‌ బయోఫార్మాస్యూటికల్స్‌ కోర్సును ప్రవేశపెట్టారు. దీంతోపాటు ఇక్కడ.. మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ట్రెడిషనల్‌ మెడిసిన్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్‌, బయోటెక్నాలజీ, రెగ్యులేటరీ అఫైర్స్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌), ఫార్మసీ ప్రాక్టీస్‌, క్లినికల్‌ రిసెర్చ్‌, మెడికల్‌ డివైజస్‌, ఫార్మా స్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు చదివే అవకాశం ఉంది. ఎంఎస్‌ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎంటెక్‌ ఫార్మసీ, ఎంబీఏ ఫార్మసీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ సైతం చేసే అవకాశం ఉంది.

అర్హత

నైపర్‌ జేఈఈ రాసేందుకు జీప్యాట్‌/గేట్‌/నెట్‌ ఎందులోనైనా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.75 గ్రేడ్‌ పాయింట్లు పొంది ఉండాలి. ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 16వ తేదీ వరకూ గడువు ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు