పోరాడితేనే ఫలితం

కొంతమంది విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులు అర్థం కాక అవి సమస్యగా భయపెడుతుంటాయి. మరికొందరికి పరీక్షలను ఎదుర్కోవడమే పెద్ద సమస్య.

Updated : 16 May 2023 04:36 IST

కొంతమంది విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులు అర్థం కాక అవి సమస్యగా భయపెడుతుంటాయి. మరికొందరికి పరీక్షలను ఎదుర్కోవడమే పెద్ద సమస్య. వాటిని భూతద్దంలో చూస్తూ బెంబేలెత్తుతుంటారు. కానీ ఇబ్బందిగా అనిపించే సమస్యలే మనల్ని దృఢంగా మారుస్తా యి. భవిష్యత్తులో ఎన్ని చిక్కులు ఎదురైనా ధైర్యంగా నిలబడగలిగే శక్తినీ ఇస్తాయి. ఈ కథలోని రమేష్‌కూ ఇదే విషయం తెలిసి వచ్చింది. అదెలాగో చూద్దామా...

దో తరగతి విద్యార్థి రమేష్‌ ఓ రోజు కాస్త విశ్రాంతి తీసుకుందామని ఇంటికి దగ్గరలో ఉన్న తోటలో కూర్చున్నాడు. అప్పుడతని దృష్టి ఎదురుగా చెట్టుకొమ్మకు వేలాడుతున్న సీతాకోకచిలుక తాలూకు ప్యూపా దశలోని కుకూన్‌ మీద పడింది. లోపల రూపాంతరం చెందిన సీతాకోకచిలుక చిన్న రంధ్రం నుంచి బయటకు రావాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. అలా చాలాసేపు ప్రయత్నించి ఇక తన శక్తి సరిపోక కాసేపు ఆగింది. దానికి కాస్త సాయపడితే.. బయటకు వచ్చి హాయిగా ఆకాశంలోకి ఎగిరిపోతుందని అనుకున్నాడు రమేష్‌. వెంటనే ఇంట్లో నుంచి చిన్న కత్తెర తెచ్చి కుకూన్‌ గూడును కత్తిరించి దారి చేశాడు. సీతాకోకచిలుక బయటకు వచ్చిందిగానీ దాని రెక్కలు ముడతలుపడి.. బలహీనంగా ఉండటంతో ఎగరలేక నేల మీదే పాకసాగింది.  

రమేష్‌ హతాశుడై ఎందుకిలా జరిగిందా అని మథనపడ్డాడు. బయటకు రావడానికి తన బలాన్నంతా కూడదీసుకుని సహజసిద్ధంగా పోరాడినట్లయితే దాని రెక్కలు ఎగిరేందుకు వీలుగా బలంగా మారేవి. తాను మేలు చేస్తున్నాననుకుని చేసిన పని సీతాకోక చిలుకకు నష్టమే కలిగించిందని రమేష్‌కు  ఆలస్యంగా బోధపడింది. అనాలోచితంగా తాను చేసిన పొరపాటు  అర్థమయింది.  

సమస్యలతో స్వయంగా పోరాడటం వల్ల భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా మారతారు. ఈ క్రమంలో కాస్త నిరుత్సాహంగా అనిపించినా.. ప్రయత్నాలను మధ్యలోనే ఆపేయకూడదు. అనుకున్నది సాధించేవరకూ  కొనసాగిస్తూనే ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు