తుది సన్నద్ధత ఇదీ!
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ మే 28న జరుగనుంది. పరీక్ష ఎలా ఉంటుందోననే విషయంలో అభ్యర్థులకు ఉత్కంఠ, కొంత బెరుకు ఉండటం సహజమే.
సివిల్స్ ప్రిలిమ్స్
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ మే 28న జరుగనుంది. పరీక్ష ఎలా ఉంటుందోననే విషయంలో అభ్యర్థులకు ఉత్కంఠ, కొంత బెరుకు ఉండటం సహజమే. ఇప్పటివరకూ కొనసాగుతున్న సన్నద్ధతకు ‘తుది అంకం’ లాంటి చివరి ఈ పది రోజులు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో చేసే పునశ్చరణ (రివిజన్) జయాపజయాలను నిర్ణయించగలదు!
గత ఏడాది కంటే ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సివిల్స్ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. కొవిడ్ అనంతర పరిస్థితులను గమనిస్తే ఎక్కువమంది అభ్యర్థులు పరీక్షపై శ్రద్ధపెడుతూ తయారవుతున్నారు. దీంతో ఎక్కువ పోటీ నిశ్చయం. ఖాళీల సంఖ్య గత ఏడాది కంటే పెరిగింది. ఇప్పుడు ఖాళీల సంఖ్య 1105. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంటే మెయిన్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థులు 14,000 మందివరకూ ఉంటారు. ఇప్పుడు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇది సానుకూలాంశమే.
తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1, ఇతర పరీక్షల కారణంగా సివిల్స్‌పై దృష్టిపెట్టి రాసే అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గత ఏడాది 80,707 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే.. 41,909 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎక్కువమంది విద్యార్థులు రాష్ట్ర సర్వీస్ పరీక్షలకు తయారవుతుండటం వల్ల ఈ ఏడాది ఈ సంఖ్య తగ్గనుంది.
సన్నద్ధతకు వ్యూహం
* సిలబస్ మరోసారి: ఇప్పటివరకూ సిలబస్‌ను ఎన్నోసార్లు చదివుంటారు. అయినాసరే మరోసారి నిశితంగా గమనించాలి. ఏవైనా అంశాలను మర్చిపోయినట్లయితే.. ఆ సబ్జెక్టుకు సంబంధించిన వర్తమానాంశాలను ప్రాథమికాంశాలతో అనుసంధానించి గుర్తుంచుకోవాలి.
* మానసికంగా అంచనా: అడగడానికి అవకాశం ఉండే అంశాలను మానసికంగా అంచనా వేసుకోవాలి. గత రెండు, మూడేళ్లుగా ఏ అంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయనేది పట్టిక రూపంలో వేసుకోవచ్చు. మీ అంచనా కచ్చితంగా ఉండాలనేమీ లేదు. ఇది మీ సన్నద్ధతకు ఒక స్పష్టతను తీసుకొస్తుంది. చివరి నిమిషంలో అవసరమైన మార్పులూ, చేర్పులూ చేసుకోవచ్చు.
* కీలక అంశాల్లో ఏమైనా మిగిలుంటే: సిలబస్‌లోని ప్రధాన భాగాలన్నింటినీ మీరు చదివుండొచ్చు. విడిచిపెట్టిన భాగాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించుకుని.. వాటిని వెంటనే చదివేయాలి.
* వర్తమానాంశాల సన్నద్థత: వర్తమానాంశాల సన్నద్ధతను మీరు ఇప్పటికే పూర్తిచేసి ఉండొచ్చు. వాటిల్లో అతి ముఖ్యమైనవాటిని గుర్తించాలి. అన్నీ ముఖ్యమైన వాటిలానే కనిపించొచ్చు. అయితే మీరు సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రజాసేవ చేయాలనే ఆసక్తి, దృక్పథం ఉన్నవాళ్లను ఎంపికచేయడమే ఈ పరీక్ష ఉద్దేశం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని.. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలను గుర్తించండి. ఉదాహరణకు ‘మన్‌కీ బాత్’లో ప్రధానమంత్రి ప్రస్తావించిన అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడగొచ్చు.
* సంక్షేమ మంత్రిత్వశాఖల వెబ్‌సైట్లు: ప్రభుత్వ మంత్రిత్వ శాఖలన్నీ ముఖ్యమైనవే.. వీటిలో సంక్షేమ మంత్రిత్వశాఖలు అత్యంత కీలకమైనవి. అన్ని సంక్షేమ పథకాల గురించీ తెలుసుకోవాలి. వాటిల్లో అతి ముఖ్యమైనవాటిని గుర్తించి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసు కోవాలి. ఇలాంటప్పుడు ‘5 డబ్ల్యూ’ల ఫార్ములాను పాటించాలి (what, why, who, when, where) ప్రభుత్వ పథకం ఏమిటి? దీన్ని ఎందుకు ప్రారంభించారు? లబ్ధిదారులు ఎవరు? దాన్ని అమలుచేసే బాధ్యత ఎవరిది? పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? అది ఎప్పుడు ముగియవచ్చు? పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?.. వీటన్నిటి వివరాలు తెలుసుకుని గుర్తుంచుకోవాలి.
* కచ్చితంగా జవాబు ఊహించే సామర్థ్యంపై దృష్టి: ఊహించి రాయటం, కచ్చితంగా రాయటం.. ఇవి పరస్పర విరుద్ధమైన పదాలు. కానీ సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఇవి చాలా ముఖ్యమైనవి. బాగా కృషిచేసిన చాలామంది అభ్యర్థులు అన్ని ప్రశ్నలకూ కచ్చితమైన సమాధానాలనే రాయగలుగుతారు. ఈ పరిస్థితుల్లో కటాఫ్ మార్కును చేరుకోవడం, చేరుకోకపోవడం అనేది ‘కచ్చితమైన సమాధానాలు ఊహించడం’ (యాక్యురేట్ గెసెస్) మీదే ఆధారపడివుంటుంది. దీనికి సాధన ఎంతో అవసరం. కాబట్టి వీలైనంత ఎక్కువగా సాధన చేస్తూనే ఉండాలి.
* ఓఎంఆర్ షీట్ల సాధన: చాలామంది అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లపై ప్రాక్టీస్‌ను అశ్రద్ధ చేస్తారు. కానీ ఇది చాలా ముఖ్యం. ఒక్కోసారి ఒక సమాధానాన్ని వదిలిపెట్టి మరోదానికి వెళతారు. అలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు వరసలోని వృత్తాన్ని నింపకూడదు. ప్రశ్నల బుక్‌లెట్‌లో మొదట అన్ని ప్రశ్నలకూ సమాధానాలు మార్క్ చేసి.. వాటన్నిటినీ చివర్లో ఓఎంఆర్ షీట్‌పై కాపీ చేస్తే.. ఇలాంటి పొరపాటు జరుగుతుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
* పేపర్-2పై నిర్లక్ష్యం వద్దు: అర్హతను నిర్ణయించేది పేపర్-2నే కాబట్టి దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. క్వాంట్ అండ్ రీజనింగ్ పార్ట్‌లో మీకు పట్టు ఉన్నట్లయితే రెండేసి పాత సంవత్సరాల ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాయండి. అప్పుడు పేపర్ మీద మీకు అవగాహన ఏర్పడుతుంది. మ్యాథ్స్ ప్రశ్నలను ముందుగా రాసి.. తర్వాత ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ సమాధానాలను రాయాలని గుర్తుంచుకోండి.
పేపర్-1 సమగ్ర ప్రశ్నపత్రాల సాధన
నాణ్యమైన ఆరు సమగ్ర ప్రశ్నపత్రాలను తీసుకుని శ్రద్ధగా సాధన చేయాలి. అయితే సబ్జెక్టువారీగా పేపర్లు తీసుకుని సాధన చేయడానికి ఇది తగిన సమయం కాదు. ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాసేటప్పుడు
పాటించాల్సినవి:
* హార్డ్‌కాపీ రూపంలోనే పరీక్ష రాయాలి. ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే అవసరమైతే ప్రింటవుట్ తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో సమాధానాలు రాయొద్దు.
* సివిల్స్ పరీక్ష రాయబోయే సమయంలోనే ఈ సమగ్ర ప్రశ్నపత్రాలను సాధన చేయడానికి ప్రయత్నించండి. పరీక్ష సమయం 9.30 గంటలు అనుకుంటే మీరు ప్రతిరోజూ అదే సమయానికి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఈ సాధన పరీక్ష సమయంలో ఉపయోగపడుతుంది.
* పరీక్ష ప్రారంభించిన తర్వాత విరామం తీసుకోకూడదు. ఒకసారి మొదలుపెడితే దాన్ని పూర్తిచేయాల్సిందే. ఇతర విషయాల మీదకు మనసు మళ్లి కాసింత విరామం తీసుకోవాలని అనిపించొచ్చు. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి పరీక్షను ముగించాలి. రాయడం పూర్తవగానే సాధించిన స్కోరును చూసుకోవాలి.
* పరీక్షలు రాయడం పూర్తయిన తర్వాత రాసిన తీరును విశ్లేషించుకోవాలి. ఓ పట్టిక రూపంలో విశ్లేషించుకుంటే సులువుగా ఉంటుంది. (సిలబస్ అంశం, ప్రశ్నలు, రాసినవాటిలో సరైనవి, తప్పు రాసినవి, రాయనివి.. ఈ అంశాలతో పట్టిక
వేసుకోవచ్చు)
* రెండు అంతకంటే ఎక్కువ పేపర్లలో సిలబస్‌లోని ఒక అంశంలో క్రమం తప్పకుండా తక్కువ మార్కులు వస్తున్నట్లయితే ఆ అంశాన్ని శ్రద్ధగా పునశ్చరణ చేసుకోవాలి. ఆ అంశంలో వర్తమాన అంశాలు ఏమైనా ఉంటే వాటిని అనుసంధానించి చదువుకోవాలి.
వి.గోపాలకృష్ణ,డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Britney Spears: కత్తులతో డ్యాన్స్.. పాప్ సింగర్ ఇంటికి పోలీసులు
-
Uttar Pradesh: అమానవీయ ఘటన.. బాలిక మృతదేహాన్ని ఆసుపత్రి బయట బైక్‌పై పడేసి వెళ్లిపోయారు!
-
Dhruva Natchathiram: ఆరేళ్ల క్రితం సినిమా.. ఇప్పుడు సెన్సార్ పూర్తి..!
-
22,000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. మొబైల్ కాదిది పవర్ హౌస్!
-
England Team: అంతా అయోమయం.. 38 గంటలపాటు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణం: బెయిర్‌స్టో
-
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబరు 3న రాష్ట్రానికి సీఈసీ