గురి తప్పుతోందా?

చాలామంది విద్యార్థులకు చేతిలో పుస్తకం ఉంటుంది. కానీ ఆలోచనలన్నీ చేసిన పనులు లేదా చేయబోయే పనుల చుట్టూ తిరుగుంటాయి. ఆ తర్వాత చదివింది అర్థం కావడం లేదని బాధపడుతుంటారు.

Published : 23 May 2023 00:36 IST

చాలామంది విద్యార్థులకు చేతిలో పుస్తకం ఉంటుంది. కానీ ఆలోచనలన్నీ చేసిన పనులు లేదా చేయబోయే పనుల చుట్టూ తిరుగుంటాయి. ఆ తర్వాత చదివింది అర్థం కావడం లేదని బాధపడుతుంటారు. దీనంతటికీ కారణం ప్రస్తుతం చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడమే. ఇదే విషయాన్ని చక్కగా వివరిస్తుందీ కథ.

క ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. చదువు, ఆటపాటలు, కొత్త విషయాలు నేర్చుకోవడం... ఇలా అన్ని పనులూ కలిసే చేసేవారు. ఒకరోజు ముగ్గురూ కలిసి ఊరి బయట తుపాకీతో గురిపెట్టి.. బెలూన్లను పేల్చడం నేర్చుకోసాగారు. ఈ పని పూర్తయిన వెంటనే పక్క ఊరిలో జరిగే జాతరకు వెళ్లి సరదాగా గడపాలనుకున్నారు. వారి ఆలోచనలన్నీ జాతర చుట్టే తిరగసాగాయి.

ఎదురుగా కాస్త దూరంలో బెలూన్లను వేలాడదీసి వాటిని పేల్చడం సాధన చేయసాగారు. ఎంత ప్రయత్నించినా ఒక్కరు కూడా గురిచూసి తుపాకీ పేల్చలేకపోతున్నారు. ఇదంతా గమనించిన ఒక వ్యక్తి నవ్వుతూ వారి వైపు చూశాడు. దాంతో స్నేహితులకు కోపం వచ్చింది. ‘నవ్వడం కాదు... చేతనైతే పగలగొట్టండి చూద్దాం’ అన్నారు. ఆయన తుపాకీ అందుకుని మొదటి ప్రయత్నంలోనే గురిపెట్టి బెలూన్‌ను పేల్చాడు. ఇదెలా సాధ్యమని వాళ్లంతా ఆశ్చర్యపోయారు. దానికాయన శాంతంగా ఇలా చెప్పాడు- ‘చేస్తున్న పని మీద మీరు దృష్టిపెట్టటం లేదు. మరేదో విషయమ్మీద మీ ఆలోచనలు ఉన్నట్టున్నాయి. దీంతో ఏకాగ్రత కుదరక మీ గురితప్పుతోంది!’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని