పిలుస్తున్నాయ్‌.. ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు

సృజనను ఇష్టపడేవాళ్లు, కళలపై ఆసక్తి  ఉన్నవారు రాణించగలిగే కోర్సుల్లో ఫైన్‌ ఆర్ట్స్‌, యానిమేషన్లు ముందుంటాయి. ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీటిలో ప్రవేశం పొందవచ్చు.

Updated : 23 May 2023 05:12 IST

సృజనను ఇష్టపడేవాళ్లు, కళలపై ఆసక్తి  ఉన్నవారు రాణించగలిగే కోర్సుల్లో ఫైన్‌ ఆర్ట్స్‌, యానిమేషన్లు ముందుంటాయి. ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీటిలో ప్రవేశం పొందవచ్చు. ఈ చదువులు బోధిస్తోన్న సంస్థల్లో.. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ముఖ్యమైంది. ఇటీవలే ఈ విశ్వవిద్యాలయం యూజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. పరీక్షలో ప్రతిభ చూపితే ప్రవేశం పొందవచ్చు!  

ఫైన్‌ ఆర్ట్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదువులతోనే ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. మరింతగా రాణించాలనుకునేవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులూ ఉన్నాయి.  ఈ స్థాయిలో స్పెషలైజేషన్‌పై దృష్టి సారించవచ్చు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఎంఎఫ్‌ఏ) వ్యవధి రెండేళ్లు. స్వయం ఉపాధి, ఉద్యోగం రెండింటికీ ఈ కోర్సులు అనువైనవి. చదువుకున్న కోర్సును బట్టి వీరికి సాఫ్ట్‌వేర్‌, బహుళ జాతి సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వర్టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్‌, ప్రింటింగ్‌, పబ్లిషింగ్‌, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్‌, మల్టీ మీడియా, యానిమేషన్‌...తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆర్ట్‌ గ్యాలరీల్లోనూ వీరు తమ ప్రతిభను చాటవచ్చు. ఫొటోగ్రఫీ చేసినవారికి అన్నిచోట్లా అవకాశాలు ఉంటాయి. చాలామంది ఫ్రీలాన్సింగ్‌, స్వయం ఉపాధి (వర్క్‌ షాపు నడపడం) ద్వారా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. ఎండోమెంట్‌, ఆర్కియలాజికల్‌ విభాగాల్లో వీరికోసమే ప్రత్యేక ఉద్యోగాలున్నాయి.

కోర్సులు

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌.. బీఎఫ్‌ఏలో పెయింటింగ్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, స్కల్ప్‌చర్‌, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ కోర్సులు అందిస్తోంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి సిలబస్‌ వివరాలు, మాదిరి ప్రశ్నపత్రం వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిద్వారా పరీక్ష, సన్నద్ధం కావాల్సిన అంశాలపై అవగాహన పొందవచ్చు. పరీక్షలో అర్హతకు కనీసం 35 శాతం మార్కులు తప్పనిసరి.

ఫొటోగ్రఫీ

కంపోజిషన్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌ వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఇందులో డ్రాయింగ్‌, కంపోజిషన్‌ నైపుణ్యాలు పరిశీలిస్తారు. పెన్సిల్‌తో ఇచ్చిన చిత్రాలకు షేడ్‌లు ఇవ్వాలి. అలాగే అక్కడున్న చిత్రాలను క్రమ పద్ధతిలో అమర్చాలి. ఏదైనా అసంపూర్ణ దృశ్యం ఇచ్చి దాని చుట్టూ ఉండే అవసరమైన ఇతర అంశాలను అందులో చేర్చి తీర్చిదిద్దమంటారు. వీటన్నింటికీ పరీక్షలో ప్రాధాన్యం ఉంటుంది. అలాగే మరో ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌ 50 మార్కులకు 50 నిమిషాల వ్యవధితో ఇస్తారు. ఇందులో జీకే, కరెంట్‌ అఫైర్స్‌ 15, ఇంగ్లిష్‌ 15, జనరల్‌ ఆర్ట్‌ ఓరియంటెడ్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.  

ఇంటీరియర్‌ డిజైన్‌

ఈ సంస్థ బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో భాగంగా ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సు నడుపుతోంది. అందులోనూ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం 200 మార్కులకు 3 గంటల వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జీకే, కరంట్‌ అఫైర్స్‌ 20, జనరల్‌ ఆర్ట్‌ 20, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ 50, ఇలస్ట్రేటివ్‌, ఎనలిటికల్‌ అండ్‌ డిజైన్‌ ఎబిలిటీ 50, మెమరీ డ్రాయింగ్‌ 30, కలర్‌ కోఆర్డినేషన్‌ 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కోప్రశ్నకు ఒక మార్కు.

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 5

ఫీజు: రూ.1800 ఎస్సీ, ఎస్టీలకు రూ.900

పరీక్ష తేదీలు: ఫొటోగ్రఫీ, ఇంటీరియన్‌ డిజైన్‌లకు జూన్‌ 17. అప్లయిడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌, యానిమేషన్‌ల్లో జూన్‌ 18.

పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://jnafauadmissions.com


పరీక్షలు

వీటిని ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.

అప్లయిడ్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌, యానిమేషన్‌ కోర్సులకు...

పేపర్‌ ఎ

మెమరీ డ్రాయింగ్‌, కలరింగ్‌ విభాగాల్లో వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఈ విభాగంలో ఏదైనా అంశాన్ని ఇస్తారు. దానికి దృశ్య రూపాన్ని ఇవ్వాలి. ఎంత అందంగా గీశారు, నైపుణ్యం ఎలా ఉంది, ఉపయోగించిన రంగులు... వీటికి ప్రాధాన్యం. పేపర్‌ బి ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 మార్కులకు 50 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో జీకే, కరంట్‌ అఫైర్స్‌ 15, ఇంగ్లిష్‌ 15, జనరల్‌ ఆర్ట్‌ ఓరియంటెడ్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పేపర్‌ సి ఆబ్జెక్ట్‌ డ్రాయింగ్‌లో వంద మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో భాగంగా ఏదైనా వస్తువు లేదా బొమ్మ చూపిస్తారు. ఆ దృశ్యాన్ని పెన్సిల్‌తో గీచి, దాని చుట్టూ పరిసరాలను ఊహించి వర్ణనాత్మక చిత్రాన్ని రూపొందించాలి. ఇందులో చిత్ర నైపుణ్యాలు, ఊహ, పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది.


డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, కడప ఇవే కోర్సులను యూజీలో అందిస్తోంది. అపరాధ రుసుముతో మే 28లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు  www.ysrafu.ac.in/చూడవచ్చు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని