ఎన్నో దారులు.. ఎంచుకోవాల్సింది మీరే!

కెరియర్‌ పరంగా తమ దారేదో నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత దక్కుతుంది. ఉన్న మార్గాల్లో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే కీలకం.

Updated : 31 May 2023 02:21 IST

కెరియర్‌ పరంగా తమ దారేదో నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత దక్కుతుంది. ఉన్న మార్గాల్లో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే కీలకం. ఇందుకు స్వీయసామర్థ్యాలే కొలమానం. విద్యార్థులంతా ఎవరికి వారే ప్రత్యేకం. నైపుణ్యాలు, ఆసక్తులు గుర్తించి సరైన కోర్సు ఎంచుకుంటే మేటి భవిష్యత్తు దిశగా మొదటి అడుగు పడినట్లే!

లుగురితో నారాయణ.. గుంపులో గోవింద.. అనేవి కోర్సు ఎంపికలో పనికిరావు. చిన్నప్పటి నుంచి పదో తరగతి పూర్తయిన వరకు ఎన్నో కెరియర్‌ లక్ష్యాలు మారుతూ ఉంటాయి. అయితే ఏదో ఒక కోర్సువైపు స్థిరమైన నిర్ణయం తీసుకునే సమయం ఇదే. అందరూ అందులో చేరుతున్నారనో.. ఎవరూ ఇటువైపు రావడం లేదనో.. స్నేహితులు చెప్పారనో.. అమ్మానాన్నల ఆశయమనో.. కోర్సు ఎంచుకోకూడదు. ఇవేవీ మీకు సరైనవి కావు. వీటిలో మీ ముద్ర లేకపోవడమే ఇందుకు కారణం. మీ దారి.. రహదారి కావాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే.

ఎలాగంటే..

ఈ ప్రపంచంలో మీ గురించి మీ కంటే ఎక్కువగా మరెవరికీ తెలీదు. స్వీయ సమీక్షే కీలకం. ఇందుకోసం వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించండి. మీ సామర్థ్యం, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోండి. మీ బలహీనతలేమిటో గుర్తించి, వాటి ప్రకారం అందుబాటులో ఉన్న కోర్సుల జాబితాలో కొన్నింటిని తొలగించండి. మిగిలినవాటిలో మీకు సరిపోయేది ఎంచుకోండి. ఈ క్రమంలో సమగ్రత కొరవడకుండా చూసుకోండి. ముందుగా అన్ని అవకాశాలపైనా అవగాహన పెంచుకోండి.

ఇవీ మార్గాలు

పది పూర్తిచేసుకున్నవారి ముందున్న మార్గాలు.. ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఒకేషనల్‌ కోర్సులు, ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు. ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే. ఏవీ తక్కువ, ఎక్కువ కాదు. అయితే వీటిలో సరిపోయేవి ఏవో గుర్తించే బాధ్యత మీదే. ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. అందువల్ల బాగా ఆలోచించి, విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలి.

ఇలా వద్దు..

ఎక్కువ మంది చేసే పొరపాటు.. మ్యాథ్స్‌ అంటే భయం కాబట్టి బైపీసీ, సైన్స్‌పై ఆసక్తి లేదు అందుకే సీఈసీ. దీంతో రాణించలేరు. ఎందుకంటే.. బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్‌ రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్‌ అంశాల్లో పట్టు లేదు కాబట్టి ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరకూడదు. ఏ అంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి, ఆ దిశగా అడుగులేయాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఇంకో దాన్ని ఎంచుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులకే పెద్ద పీట వేయాలి. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

చదువులో సరిగా రాణించలేని ఎక్కువ మంది విద్యార్థులు చెప్పే ప్రధానాంశం..  ఫలానా వాళ్ల ఒత్తిడి కారణంగా ఆసక్తి లేకుండా ఈ కోర్సులో చేరి నష్టపోయానని అనడమే. అందువల్ల.. తెలిసినవాళ్లు చెప్పారనో, బంధువులు సూచించారనో, అమ్మానాన్నల ఆశయమనో, స్నేహితులతో కలిసి ఉండొచ్చనో, ఎక్కువ సంపాదనకు వీలుందనో, సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చనో, ఎక్కువ మంది చేరుతున్నారనో, అవకాశాలు ఎక్కువనో... ఇలాంటి కారణాలతో కోర్సు, గ్రూపులను ఎంచుకోవద్దు. ఎంచుకున్న కోర్సులో రాణించాల్సిన బాధ్యత మీదేనని మర్చిపోవద్దు. అందుకే ఎవరి భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకుని కెరియర్‌ నిర్మించుకోవాలి.

ఆసక్తులు, బలాలు, ఇష్టాలు, అభిరుచులు, నైపుణ్యాలు, ఆశయాలు సమగ్రంగా విశ్లేషించుకోవాలి. వ్యక్తిగత అభిరుచి లేకుండా ఎవరినైనా, దేన్నైనా అనుసరించడం వల్ల నష్టపోయేది మనమే. ఎంపీసీలో చేరిన ఆరు నెలల తర్వాత అయ్యో బైపీసీ తీసుకోవాల్సిందే అనుకుంటే.. ప్రయోజనం ఉండదు. నిర్ణయంలో తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ.. కోరుకున్న కోర్సులో చేరడానికి ఏడాది సమయం వృథా అవుతుంది. అందువల్ల చదువుల విషయంలో నైపుణ్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఇతరుల సలహాలపై పూర్తిగా ఆధారపడవద్దు. పరీక్షలు రాసి, పోటీ పడాల్సింది మీరేనని మరవొద్దు. అవసరమైన సమాచారాన్నే ఇతరుల నుంచి సేకరించండి. వాళ్ల అనుభవాలు, ఆలోచనలను మీ విశ్లేషణలో ఉపయోగించుకోండి. అంతిమ నిర్ణయం మాత్రం మీ ఇష్ట ప్రకారమే తీసుకోండి. ఆ బాధ్యత మీదేనని గుర్తించుకోండి.

‘ఫలానా కోర్సులో చేరతాను. అందుకు బలమైన కారణాలు ఇవీ.’ అనే స్పష్టత మీ వద్ద ఉంటే.. మీరు సరైన మార్గంలో ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లే లెక్క.

ఎటూ తేల్చుకోలేకపోతే.. పదో తరగతి సబ్జెక్టుల్లో ప్రతిభ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. నైపుణ్యం ఉన్న సబ్జెక్టుల్లో ఆసక్తి ఉంటే వాటినే ఉన్నత విద్యకోసం ఎంచుకోవచ్చు.

* మ్యాథ్స్‌పై గట్టి పట్టున్నవారు ఎంపీసీ లేదా ఎంఈసీని పరిగణనలోకి తీసుకోవచ్చు.

* సైన్స్‌, ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉంటే ఎంపీసీని ఖాయం చేసుకోవచ్చు.

* సీఏ, సీఎంఏ చేయాలనుకుంటే ఎంఈసీవైపు మొగ్గు చూపవచ్చు.

* బయాలజీని బాగా ఇష్టపడేవాళ్లంతా బైపీసీని ఎంచుకోవడమే మంచిది.

* సమకాలీనం, సామాజికాంశాలపై ఆసక్తి ఉంటే మరో ఆలోచన లేకుండా హెచ్‌ఈసీలో చేరిపోవచ్చు.

* వర్తక రంగం, వ్యాపార గణితంపై మనసున్నవారు.. మ్యాథ్స్‌పై పట్టుంటే ఎంఈసీ, లేకుంటే సీఈసీ తీసుకోవచ్చు.

* సాంకేతికతను ఇష్టపడేవారు, యంత్రాలతో పనిచేయాలనే తపన మెండుగా ఉన్నవాళ్లు పాలిటెక్నిక్‌ కోర్సులు దిశగా అడుగులేయవచ్చు.

* తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవారు ఒకేషనల్‌ కోర్సులు లేదా ఐటీఐలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

* పై చదువులపై పెద్దగా ఆసక్తి లేనివాళ్లు పది అర్హతతో ఉన్న ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తూనే దూరవిద్యలో చేరి దారులు వెతుక్కోవచ్చు. కాలేజీకి వెళ్లి చదవడం వీలు కానివారు స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌ లేదా ఇగ్నో నుంచి నచ్చిన కోర్సుల్లో నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

ఏ నిర్ణయానికీ రాలేనివాళ్లు తమ గురించి బాగా తెలిసిన ఉపాధ్యాయులను సంప్రదించవచ్చు. విద్యార్థుల సామర్థ్యాలపై వీళ్లకు కొంత అవగాహన ఉంటుంది. ఆ విద్యార్థి ప్రత్యేకతలు, తెలివితేటలు ఆధారంగా సరైన మార్గనిర్దేశం చేయడం సాధ్యమవుతుంది. లేదా గుర్తింపు పొందిన కెరియర్‌ కౌన్సెలర్ల సహాయాన్నీ తీసుకోవచ్చు. కెరియర్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలతో ఒక అంచనాకు రావచ్చు.   

ఇంటర్‌లో ఉండే వివిధ గ్రూపులు, పాలిటెక్నిక్‌, ప్రత్యేక డిప్లొమాలు; ఒకేషనల్‌ విద్య, ఐటీఐ, ఉద్యోగాలు... ఈ కథనాలన్నీ వరుసగా మీ ముందు ఉంచుతాం. వాటిని పరిశీలిస్తే మీ దారెటో గుర్తింవచ్చు. విజయం దిశగా అడుగులు వేయొచ్చు!


తల్లిదండ్రులిలా...

తమ పిల్లల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు వారికి సరిపోయే కోర్సులను సూచించవచ్చు. అలా కాకుండా తమ వ్యక్తిగత ఆశయాలను రుద్దితే భవిష్యత్తులో ఇద్దరికీ ఇబ్బందే. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడితో విపరిణామాలనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లలపై వ్యక్తిగత ఆశయాలను రుద్దడం, వాళ్ల ద్వారా కోరికలు తీర్చుకోవాలనుకోవడం తప్పు. ఆసక్తి లేకుండా.. మీ ఇష్ట ప్రకారమే చదవాల్సి వస్తే వాళ్లు రాణించలేరు. పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి చదవడానికి ఏమైందని అనుకోవద్దు. ఇంజినీర్‌ కావాలనుకుని గుమాస్తాగా స్థిరపడిన తండ్రి.. తన ఆశయం నెరవేర్చుకోవడానికి లాయర్‌ కావాలనుకున్న కుమార్తెను బలవంతంగా ఎంపీసీలో చేరిస్తే.. చివరికి తనుకూడా తండ్రిలాగే అసంతృప్తితో ఏదో ఒక ఉద్యోగంలో చేరాల్సిరావచ్చు. తల్లిదండ్రులు విద్యార్థుల ఆశయాలకు రెక్కలు కావాలి. పిల్లల్లోని సహజ ప్రతిభను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో అద్భుతంగా రాణించడానికి అవకాశాలెక్కువ. వాళ్లకు విలువైన సూచనలు చేస్తూ, మార్గదర్శిగా నిలవాలి. దీంతో మీ మధ్య ఆత్మీయ అనుబంధమూ బలపడుతుంది.


స్థోమతతో పనిలేదు..

ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఆర్థిక సమస్యల కారణంగా పది తర్వాత చదువులకు వెనకడుగువేసేవాళ్లూ ఉంటారు. అయితే ఇలాంటి వారిని ఆదుకోవడానికి ఎన్నో వేదికలు ఉన్నాయిప్పుడు. ఇంటర్‌తోపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఆరేళ్లు ఉచితంగా చదువుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రిపుల్‌ఐటీలు అవకాశం కల్పిస్తున్నాయి. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలుంటాయి. అలాగే ఇంటర్మీడియట్‌ చదవడానికి ప్రభుత్వ ఎస్సీ/ఎస్టీ/బీసీ/జనరల్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలెన్నో ఉన్నాయి. పరీక్షతో వీటిలో చేర్చుకుంటున్నారు. ఈ సంస్థల్లో జేఈఈ, నీట్‌ శిక్షణనూ అందిస్తున్నారు. సాంకేతిక విద్యను అందించడానికి అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. అలాగే పలు ఐటీఐలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఒకేషనల్‌ కోర్సులు కూడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే అందిస్తున్నారు.

అందువల్ల విద్యార్థి లక్ష్యం ఏదైనప్పటికీ ఆర్థిక నేపథ్యం అవరోధం కాకుండా చూడడానికి.. వేదికలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించి రాణిస్తోన్న విద్యార్థుల సంఖ్యా ఎక్కువే. కార్పొరేట్‌ సంస్థల్లో చేరితేనే మేటి చదువులకు మార్గం లభిస్తుంది అనుకోవడం పొరపాటే. ఇంట్లో టీవీ ఉంటే.. ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించిన జేఈఈ, నీట్‌ వీడియో పాఠాలు వీక్షించి, పరీక్షలకు సిద్ధమైపోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని