జీఆర్‌ఈ..ఇవి మారాయి!

జీఆర్‌ఈ.. ఏటా లక్ష మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షను రాస్తుంటారు. తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. ఇంతకాలం దాదాపు నాలుగు గంటలుగా ఉన్న ఈ పరీక్షను ఇప్పుడు కేవలం రెండు గంటలకు కుదించారు.

Published : 07 Jun 2023 00:24 IST

జీఆర్‌ఈ.. ఏటా లక్ష మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షను రాస్తుంటారు. తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. ఇంతకాలం దాదాపు నాలుగు గంటలుగా ఉన్న ఈ పరీక్షను ఇప్పుడు కేవలం రెండు గంటలకు కుదించారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఇంకా ముఖ్యమైన మార్పులు జరిగాయి. విద్యార్థులు వీటిని గమనించి తగిన విధంగా తమ వ్యూహాన్ని మార్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.

గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌ (జీఆర్‌ఈ)లో ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. సెప్టెంబర్‌ 22, 2023 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. పరీక్షను బాగా కుదించి గ్రాడ్యుయేట్‌, బిజినెస్‌, లా స్కూల్‌ అడ్మిషన్లలో మరింత ప్రభావవంతంగా పనిచేసేలా చేయనున్నారు.

* ఈ ఆదేశాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పరీక్షా సమయం గురించి. నాలుగు గంటలపాటు జరిగే పరీక్షను కాస్తా 2 గంటలకు తగ్గించారు. అయితే వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌, క్రిటికల్‌ థింకింగ్‌, అనలిటికల్‌ రైటింగ్‌ స్కిల్స్‌ వంటి విభాగాలేవీ మారలేదు. కానీ వీటిలో అడిగే ప్రశ్నల సంఖ్య, వాటికి సమాధానాలు రాసేందుకు ఇచ్చే గడువు తగ్గింది. అలాగే అన్‌స్కోర్డ్‌ సెక్షన్‌, షెడ్యూల్డ్‌ బ్రేక్‌ను పూర్తిగా తీసివేశారు. అంతేకాకుండా గతంలో జీఆర్‌ఈ స్కోరు వచ్చేందుకు 10 నుంచి 15 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఈ సమయం తగ్గింది.


పొట్టి పరీక్ష..

నూతన విధానంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తగ్గిన పరీక్షా సమయం గురించే అయినా.. అలా అని మునుపటిలా ఇది కాంప్రహెన్సివ్‌గా ఉండదనుకుంటే పొరపాటే. టెస్ట్‌ మరింత ఫోకస్డ్‌గా ఉండేలా అవసరమైన మార్పులు చేస్తూ మరింత పదునైన పరీక్షగా దీన్ని మార్చారు. ప్రశ్నలు తగ్గిస్తూ సమయం కూడా తగ్గించడం వల్ల సగటున ఒక ప్రశ్నకు దొరికే సమయంలో పెద్దగా మార్పులేదు. దీనివల్ల విద్యార్థి వేగం, కచ్చితత్వం ప్రభావితం కాకుండా ఉంటుంది. ఈ కొత్త తరహా పరీక్షను కూడా విద్యార్థి సెంటర్‌లోనూ ఇంటి వద్దా ఎక్కడైనా రాయవచ్చు. ప్రఖ్యాత విద్యాసంస్థల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌ అవకాశాలను ప్రభావితం చేయగలిగే ఈ పరీక్ష నాణ్యతను ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ మార్పులు చేశారు.


కొత్త పద్ధతి

టైం ఈజ్‌ ఎవ్రీథింగ్‌ అని నమ్మే ఈరోజుల్లో... జీఆర్‌ఈలో చేసిన మార్పులు ఆహ్వానించదగ్గవని చెప్పవచ్చు. మారుతున్న అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా ఈ అప్‌డేట్‌ జరిగింది. సమయాన్ని తగ్గించడం ద్వారా మరింత సూటిగా ప్రశ్నలు ఉండటంతోపాటు ఫలితాలు కూడా వేగంగా వస్తాయి. ఈ మార్పులను గతంలో పరీక్ష రాసిన అభ్యర్థులు, నిపుణుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నిర్ణయించారు. అభ్యర్థిని కచ్చితమైన అంచనా వేస్తూనే పరీక్షాప్రక్రియను సులభతరం చేయడం దీని ఉద్దేశం. ఇందులో భాగంగా అనలిటికల్‌్ రైటింగ్‌ సెక్షన్‌లో ‘అనలైజ్‌ ఏన్‌ ఆర్గ్యుమెంట్‌’ సెక్షన్‌ను పరిహరించారు. అలాగే ఇతర విభాగాల్లో ప్రశ్నల సంఖ్య తగ్గింది.


ఫలితాలు వేగవంతం

రీక్షా పద్ధతిలో మార్పులతోపాటు ఫలితాలను కూడా వేగవంతం చేయనున్నారు. కేవలం 8 నుంచి 10 రోజుల్లో స్కోర్లు రావడం వల్ల అభ్యర్థులు తమ దరఖాస్తులను వేగంగా పంపించుకునే వీలుంటుంది. కాలేజీల డెడ్‌లైన్స్‌ వల్ల  ఇబ్బంది పడే అవకాశం ఉండదు.


సన్నద్ధత

ఏడాది సెప్టెంబర్‌ 22 నుంచి నూతన పద్ధతిలో పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొత్త పద్ధతికి సంబంధించి ప్రిపరేషన్‌ రిసోర్సులు, సాధన టెస్టులు తీసుకోవచ్చు. చాలావరకూ పాత పద్ధతిలోనే ప్రశ్నలు ఉండటం వల్ల ఇదివరకటి మెటీరియల్స్‌ కూడా ఉపయోగించవచ్చు. చెల్లించాల్సిన ఫీజులోనూ, స్కోర్‌ స్కేల్స్‌లోనూ ఎలాంటి మార్పూ లేదు.


సూటిగా...

జీఆర్‌ఈని మరింత సూటిగా మార్చడంలో ఈ మార్పులది ముఖ్యపాత్ర అని చెప్పవచ్చు. పరీక్షాసమయాన్ని తగ్గించి వేగంగా స్కోర్లు ఇవ్వడంతో ఇది మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మారుతుంది. మారుతున్న విద్యారంగానికి తగినట్టుగా ఇది కూడా అప్‌డేట్‌ అయ్యింది. ఇక భవిష్యత్తులో ఎటువంటి మార్పులు   చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.


* ప్రస్తుత ఫార్మాట్‌లో పరీక్ష రెండో గంట తర్వాత గడియారం ఆగాక ఒక షెడ్యూల్డ్‌ బ్రేక్‌ ఉంటుంది. అయితే కొత్త ఫార్మాట్‌లో ఇటువంటిదేమీ లేదు. అయితే విద్యార్థులు అన్‌షెడ్యూల్డ్‌ బ్రేక్‌ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ సమయంలో గడియారం ఆగాలంటే డిజేబిలిటీ లేదా ఇతర అనారోగ్య కారణాలతో ముందే అనుమతి తీసుకుని ఉండాలి. ఇంట్లో పరీక్ష రాసేవారికి ఈ బ్రేక్‌ తీసుకునే అవకాశం ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని