CLAT 2024: మేటి సంస్థల్లో చేరిక ఇ‘లా’!

నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్‌ లా యూనివర్సిటీలు (ఎన్‌ఎల్‌యూ) ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఐదేళ్ల డిగ్రీ + ఎల్‌ఎల్‌బీ కోర్సులు అందిస్తున్నాయి. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌)తో 24 సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-2025) ప్రవేశాలకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ....

Updated : 10 Jul 2023 05:10 IST

క్లాట్‌-2024 ప్రకటన

నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్‌ లా యూనివర్సిటీలు (ఎన్‌ఎల్‌యూ) ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఐదేళ్ల డిగ్రీ + ఎల్‌ఎల్‌బీ కోర్సులు అందిస్తున్నాయి. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌)తో 24 సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-2025) ప్రవేశాలకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...

న్యాయవిద్యపై ఆసక్తి ఉన్నవారు ఎన్‌ఎల్‌యూలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ సంస్థల్లో మేటి చదువులతోపాటు, అధిక వేతనంతో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం/ బీబీఎం/ బీఎస్‌డబ్ల్యు - ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరవచ్చు. డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌బీతో పోలిస్తే ఏడాది సమయం ఆదాతో పాటు, న్యాయవిద్యపై గట్టి పట్టూ దక్కుతుంది.

ప్రశ్నలు తగ్గాయి

గత ఏడాది వరకు క్లాట్‌ యూజీలో 150 ప్రశ్నలు వచ్చేవి. ఈసారి వీటిని 120కి కుదించారు. పరీక్ష వ్యవధి మాత్రం గతంలాగే 2 గంటలే. ప్రశ్నల సంఖ్య 30 తగ్గడంతో అభ్యర్థులకు ఎంతో సమయం కలిసివచ్చినట్లే. ఎందుకంటే క్లాట్‌లో దాదాపు ప్రశ్నలన్నీ పెద్ద పేరాల్లో వస్తున్నాయి. విద్యార్థులు వీటిని చాలా వేగంగా చదివి, అర్థం చేసుకునేసరికి సమయం ముగుస్తోంది. తాజా మార్పుతో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు ఉన్న వ్యవధిలో సమాధానం రాసే అవకాశం చిక్కుతుంది.

స్వరూపమిలా...

యూజీ క్లాట్‌ ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. అయితే ప్రతి విభాగంలోనూ ప్యాసేజ్‌లు ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 22-26 (20 శాతం వెయిటేజీ), కరెంట్‌్ అఫైర్స్‌, జీకే 28-32 (25 శాతం వెయిటేజీ), లీగల్‌ రీజనింగ్‌ 28-32 (25 శాతం వెయిటేజీ), లాజికల్‌ రీజనింగ్‌ 22-26 (20 శాతం వెయిటేజీ), క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ 10-14 (10 శాతం వెయిటేజీ) వరకు ప్రశ్నలు వస్తాయి. గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థిలో న్యాయవిద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్‌, నైపుణ్యాలు ఉన్నాయా? లేవా? గమనిస్తారు. క్లాట్‌ స్కోరుతో ఇతర సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి.


పీజీ క్లాట్‌

పరీక్ష 120 మార్కులకే ఉంటుంది. ఇందులో 120 మల్టిపుల్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. కాన్‌స్టిట్యూషన్‌, ఫ్యామిలీ, క్రిమినల్‌, ప్రాపర్టీ, కంపెనీ, ట్యాక్స్‌, లేబర్‌, ఇండస్ట్రియల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ లా అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వ్యాసం ఇచ్చి దాని కింద వీటిని అడుగుతారు. ఎల్‌ఎల్‌బీ పాఠ్యపుస్తకాలతో పాటు సంబంధిత విభాగాల్లో ఒకటి రెండు రిఫరెన్స్‌ బుక్స్‌ చదివినవారు మేటి స్కోరు సాధించగలరు. సమకాలీన న్యాయ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.  

అర్హత: ఎల్‌ఎల్‌బీలో 50 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతాయి. చివరి ఏడాది పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులూ అర్హులే.  

క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎం స్కోరుతో ఉద్యోగాలూ లభిస్తున్నాయి. బీహెచ్‌ఈఎల్‌, ఓఎన్‌జీసీ, నేషనల్‌ థర్మల్‌ పవర్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌... తదితర సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వీరికి లా ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌/ ట్రెయినీ లీగల్‌ అడ్వయిజర్‌ హోదాలు దక్కుతున్నాయి. క్లాట్‌ స్కోరుకు దాదాపు 75 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. మిగిలిన 25 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తున్నాయి.


ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

వర్తమాన అంశాలు, చరిత్రాత్మక ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌ల్లో పాసేజ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్యాసేజ్‌ 450 పదాలతో, ఇంటర్‌ విద్యార్థి అర్థం చేసుకునే స్థాయిలో, ఒక్కోటి 5 నుంచి 7 నిమిషాల్లో చదవగలిగేలా ఉంటుంది. వీటిద్వారా అభ్యర్థిలోని గ్రహణ, భాషా నైపుణ్యాలను గమనిస్తారు. సరైన జవాబు కోసం.. ప్యాసేజ్‌లోని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవాలి. అందులోని భిన్నాభిప్రాయాలు, వాదనలు.. అన్నీ బేరీజు వేసుకుని స్పష్టమైన నిర్ణయానికి రావాలి. పదసంపదపై పట్టు పెంచుకుంటే పాసేజ్‌ అర్థం చేసుకోవడం తేలికవుతుంది. ఆకళింపు చేసుకుంటూ వేగంగా చదవగలిగే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. ఇందుకోసం వీలైనన్ని కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు సాధన చేయాలి. దీంతోపాటు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే వ్యాసాలు అందులోనూ ముఖ్యంగా సమకాలీన చర్చనీయ అంశాలకు సంబంధించి నిపుణుల అభిప్రాయాలు బాగా చదవాలి.  

కరంట్‌ అఫైర్స్‌, జీకే

ఈ విభాగంలోనూ 450 పదాలతో ఒక్కో పాసేజ్‌ ఉంటుంది. దానికి అనుబంధంగా ప్రశ్నలు వస్తాయి. వార్తలు, కథనాలు, నాన్‌ ఫిక్షన్‌ రచనల నుంచి పాసేజ్‌లు ఉంటాయి. వీటిలో లీగల్‌ సంబంధిత అంశాలూ ఉండవచ్చు. అయితే సమాధానాలు గుర్తించడానికి న్యాయవిద్యలో ప్రావీణ్యం అవసరం లేదు. వర్తమానాంశాలు, జనరల్‌ నాలెడ్జ్‌ల్లో అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత్‌, ప్రపంచంలో చర్చలో ఉన్న పరిణామాలు, సంఘటనలు; కళలు, సంస్కృతి; అంతర్జాతీయ అంశాలు, వర్తమానంతో ముడిపడిన చారిత్రక అంశాలు..తదితరాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఈ విభాగంలో రాణించడానికి.. తాజా సంఘటలను ప్రత్యేక దృష్టితో చదవాలి. వీటిపైనిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఆంగ్ల పత్రికలను అనుసరించాలి.

లీగల్‌ రీజనింగ్‌

ఇందులోనూ 450 పదాల పాసేజ్‌ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. లీగల్‌తో ముడిపడిన ఉన్న వాస్తవ సంఘటనలు, పరిణామాలు, పబ్లిక్‌ పాలసీ, నీతి, తాత్వికాంశాలకు చెందిన ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి న్యాయవిద్యతో పరిచయం అవసరం లేదు. వర్తమానాంశాలపై అవగాహన, సమకాలీన న్యాయ, మానవీయ సంఘటనలపై దృష్టి సారించాలి. ఇచ్చిన పాసేజ్‌లోని నిబంధనలు, సూత్రాలు (నియమాలు) గుర్తించాలి. వాటిని వివిధ సందర్భాలకు అనువర్తించాలి. వాస్తవికతకు తర్కాన్ని జోడించి ఆలోచిస్తే ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించవచ్చు.

లాజికల్‌ రీజనింగ్‌

ప్రతి పాసేజ్‌లోనూ 450 పదాల సమాచారం ఉంటుంది. దీని కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు. వీటికి సరైన సమాధానం గుర్తించడానికి ఇచ్చిన పాసేజ్‌లో ఆర్గ్యుమెంట్లు, ముక్తాయింపులు (కన్‌క్లూజన్లు) గమనించాలి. వాటిని తార్కికంగా విశ్లేషించుకోవాలి.

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌

ఈ విభాగంలో.. సమాచారం/ గ్రాఫ్‌లు/ అంకెలతో కూడిన చిత్రాలు/ కొన్ని వాస్తవికాంశాలు...వీటిలో ఏవైనా ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు సంబంధించిన జవాబు దానిపైన ఉన్న వివరణతో ముడిపడే ఉంటుంది. అభ్యర్థులు ఆ సమాచారం ఆధారంగా సరైన సమాధానం ఎంచుకోవాలి. గణితంపై పట్టు ఉంటే ఈ విభాగాన్ని ఎదుర్కోవచ్చు. ఇందుకోసం పదో తరగతిలోని రేషియోస్‌ అండ్‌ ప్రపోర్షన్స్‌, బేసిక్‌ ఆల్జీబ్రా, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ అంశాలను బాగా చదువుకోవాలి.


పరీక్షలో రాణించాలంటే..?

యూజీ క్లాట్‌ దరఖాస్తు చేసుకున్నవారికి.. ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నలు, మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లు, ఇన్‌స్ట్రక్షనల్‌ మెటీరియల్‌, ప్రతి సబ్జెక్టులోనూ ఎక్సర్‌సైజులు ఎన్‌ఎల్‌యూ కన్సార్షియం అందిస్తుంది. సన్నద్ధత, పరీక్షలో విజయానికి సబ్జెక్టు నిపుణులతో గైడెన్స్‌ అందిస్తారు.

సమాచారాన్ని వీలైనంత తక్కువ వ్యవధిలో చదివి, అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పొందాలి. ఇందుకోసం ఆంగ్ల వార్తాపత్రికలు, మ్యాగజీన్లు చదవాలి. వీటిద్వారా కరెంట్‌ అఫైర్స్‌పైనా పట్టు దక్కుతుంది. ముఖ్య అంశాలు నోట్సు రాసుకోవాలి. దీంతో పరీక్షకు ముందు రివిజన్‌ తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది. క్వాంటిటేటివ్‌లో వేగంగా సమాధానం గుర్తించడానికి పదో తరగతి మ్యాథ్స్‌ ప్రశ్నలు సాధన చేయాలి.  

క్లాట్‌ 2020, 2021, 2022, 2023 ప్రశ్నపత్రాలు గమనిస్తే ప్రశ్నల స్థాయి, చదవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది.

పత్రికల్లో.. ఎడిటోరియల్స్‌, లీగల్‌ అంశాలు రోజూ చదవాలి. లీగల్‌ వార్తలు, ఒకాబ్యులరీ, థియరీ అంశాలను అధ్యయనం చేయాలి.

పరీక్ష తేదీకి ముందు కనీసం ఏడెనిమిది నెలల వెనుక వరకున్న కరంట్‌ అఫైర్స్‌పై అవగాహన పొందాలి. తాజా అంశాలపై పూర్తి పట్టు సాధించాలి.

ఆంగ్లంలో రాణించడానికి వ్యాకరణం అందులోనూ ముఖ్యంగా పదసంపదలో ప్రావీణ్యం పొందాలి. జాతీయాలు, సామెతలపై అవగాహన ఉండాలి.  

సుదీర్ఘ వ్యాసాలు క్లిష్టంగా వస్తున్నాయి. ఆంగ్లంపై గట్టి పట్టుంటేనే అర్థం చేసుకోగలరు. సంగ్రహణ నైపుణ్యాలు బాగా ఉండాలి. ఇందుకోసం నవలలు, వార్తాపత్రిక కథనాలు, విమర్శనాత్మక సమీక్షలు చదవడం ముఖ్యం. వాటిని చదివి సొంతంగా నోట్సు సిద్ధం చేసుకోగలగాలి.


అర్హత: ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం చాలు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులూ అర్హులే.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 3

పరీక్ష తేదీ: డిసెంబరు 3

https://consortiumofnlus.ac.in/clat-2024/


ఉపాధి అవకాశాలు

క్కువమంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో పెద్ద మొత్తంలో బహుళజాతి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, ప్రైవేటు ఈక్విటీలు, కన్సల్టింగ్‌, అకౌంటింగ్‌ సంస్థలూ, లీగల్‌ ఫర్మ్‌లు ఎక్కువగా నియమించుకుంటున్నాయి. పెద్ద కోర్టులు జ్యుడీషియల్‌ క్లర్క్‌లుగానూ తీసుకుంటున్నాయి. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ విస్తరిస్తోంది. బోధనలోనూ అవకాశాలు ఉంటాయి. ఎన్జీవోలు, చైల్డ్‌ రైట్స్‌, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్లు, కార్పొరేట్‌ లీగల్‌ సెల్స్‌ ...తదితర చోట్ల కొలువులు వస్తాయి. కార్పొరేట్‌ లీగల్‌ ఫర్మ్‌లు వీరికి పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నాయి. పెరుగుతోన్న సాంకేతిక మోసాలు, కాపీ రైట్‌, పేటెంట్‌ కేసులతో లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు విస్తృతమయ్యాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని