నేరుగా ఐఐటియన్ల సలహాలు

ఇప్పుడున్న పోటీని తట్టుకుని ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలంటే అంత సులభమైన పనేం కాదు!

Updated : 12 Oct 2023 01:05 IST

ఇప్పుడున్న పోటీని తట్టుకుని ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలంటే అంత సులభమైన పనేం కాదు! పూర్తిగా సమయం కేటాయిస్తూ శ్రమపడాల్సి ఉంటుంది. ఆ సన్నద్ధతలో సీనియర్ల సలహాలు కూడా చాలా ముఖ్యం. ఈ కీలకమైన ప్రయాణంలో తమలాగే ఐఐటీ కలలు సాకారం చేసుకోవాలి అనుకునే విద్యార్థులకు ఈ ఐఐటియన్లు తమ సొంత యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఐఐటీ జీవితం గురించి వీడియోలు చేస్తూ జూనియర్లలో ఉత్తేజం  నింపుతున్నారు. విద్యార్థులకు వీరి ద్వారా ఎంతో విలువైన సమాచారం లభిస్తోంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..

ఏక్‌నూర్‌ సింగ్‌

ఏక్‌నూర్‌ 2020 నుంచి యూట్యూబ్‌లో కంటెంట్‌ సృష్టిస్తున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఐఐటీ ముంబయి క్యాంపస్‌లో తన చదువు ఎలా కొనసాగుతోందో వీడియోలు చేయడంతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సన్నద్ధతపై విద్యార్థులకు గైడెన్స్‌ ఇస్తున్నాడు. తన టిప్స్‌, ట్రిక్స్‌ ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ ఛానెల్‌ను మొదలుపెట్టినట్టు చెబుతున్నాడు ఏక్‌నూర్‌. పంజాబ్‌కు చెందిన ఈ విద్యార్థి 2020లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో 1243 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ఐఐటీ ముంబయిలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అంతేకాదు ఈ ఛానెల్‌, ఇంటర్న్‌షిప్స్‌ ద్వారా వచ్చే డబ్బుతో ఫీ చెల్లించు కుంటున్నాడు. 3.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

www.youtube.com/@EknoorSingh

తరుణ్‌

తన జేఈఈ ప్రిపరేషన్‌లో ఎదురైన ప్రతి సవాలుకు తన వీడియోల ద్వారానే సమాధానం ఇస్తున్నాడు తరుణ్‌. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ బ్యాచిలర్స్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ సైన్సెస్‌లో మాస్టర్స్‌తో 2024లో పట్టా అందుకోబోతున్నాడు. చాలా తక్కువ సమయంలో 3.95 లక్షల మందిని తన వీడియోల ద్వారా ఆకర్షించాడు. ఈ ఛానెల్‌ ద్వారా విద్యార్థులు అనేక కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.

www.youtube.com/@TharunSpeaks

రిషి

మహారాష్ట్ర నుంచి వచ్చిన రిషికి కెమెరాలంటే చాలా ఇష్టమట. ఐఐటీ ముంబయిలో సీటు వచ్చాక ఒకటి కొనుక్కుని దానితోనే వీడియోలు చేస్తున్నాడు. తన సన్నద్ధత సమయంలో యూట్యూబ్‌ ద్వారా ఎన్నో టిప్స్‌ నేర్చుకున్న ఈ విద్యార్థి.. సీటు రాగానే టీచింగ్‌పై ఆసక్తి పెరిగి, తనూ ఓ ఛానెల్‌ మొదలుపెట్టి జూనియర్లకు సలహాలు ఇస్తున్నాడు. తన కాలేజీ అధ్యాపకుల సహాయంతో పాడ్‌కాస్ట్‌ కూడా నిర్వహిస్తున్నాడు. ప్రతి ఐఐటీ గురించి తన ఛానెల్‌లో వీడియో ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే 5 సంస్థల గురించి రాశాడు.

www.youtube.com/@therushikale

కల్పిత్‌

2017 జేఈఈ మెయిన్స్‌లో 360/360 మార్కులు సాధించి రికార్డు సృష్టించాడు కల్పిత్‌. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలని చాలామంది విద్యార్థులను తనను సంప్రదించేవారట. ఇలాంటి వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఐఐటీ ముంబయి క్యాంపస్‌లో ఉండగానే యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా ఐఐటీ జేఈఈ, నీట్‌ ప్రిపరేషన్‌ టిప్స్‌తోపాటు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు కావాల్సిన గైడెన్స్‌ ఇస్తున్నాడు. కోచింగ్‌ సెంటర్లు చెప్పే విషయాలు, బయటకు కనిపించే అంశాలు చూసి మోసపోవద్దని, ఇంజినీరింగ్‌ అంటే ఇష్టం ఉంటేనే ఇటువైపుగా రావాలని చెబుతున్నాడు

@acadboost-kalpitveerwal 

హర్ష

2022లో ఐఐటీ గాంధీనగర్‌ నుంచి బీటెక్‌ పట్టా పుచ్చుకున్నాడు హర్ష. జేఈఈ సన్నద్ధతకు సంబంధించి పూర్తి వివరాలతో తెలుగు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా తన ఛానెల్‌ ద్వారా వీడియోలు చేస్తున్నాడు. జేఈఈ పరీక్షకు అనుసరించాల్సిన వ్యూహం, చదవాల్సిన పుస్తకాలు, ఉద్యోగావకాశాలు, దీర్ఘకాల కోచింగ్‌, క్యాంపస్‌ జీవితం, జొమాటాలో తన ప్లేస్‌మెంట్‌ స్టోరీ, స్టడీ టిప్స్‌ ఇలా ఎన్నో పంచుకుంటున్నాడు.

www.instagram.com/harsha_verse/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని