ధీరులుగా... దేశరక్షణలోకి!

నిరంతరం ధైర్యంగా.. అప్రమత్తంగా ఉంటూ అనుక్షణం దేశాన్ని కాపాడుతూ ధీరోదాత్తమైన జీవితాన్ని సాగిస్తారు సైనికులు. అందుకే సాయుధ రక్షణ దళాలలకు సమాజంలో సమున్నత గౌరవ మర్యాదలు దక్కుతాయి.

Published : 09 Jan 2020 00:27 IST

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ (1) - 2020 ప్రకటన విడుదల

నిరంతరం ధైర్యంగా.. అప్రమత్తంగా ఉంటూ అనుక్షణం దేశాన్ని కాపాడుతూ ధీరోదాత్తమైన జీవితాన్ని సాగిస్తారు సైనికులు. అందుకే సాయుధ రక్షణ దళాలలకు సమాజంలో సమున్నత గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇలాంటి ఉద్యోగాన్ని పొందాలంటే ఎన్‌డీఏ పరీక్ష ఉత్తమమైన మార్గం. ఇంటర్‌ అర్హతతో ఈ అవకాశాన్ని అందుకొని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరవచ్చు.

సైనిక విద్యాశిక్షణల్లో దిగ్గజ సంస్థగా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది యువకులను మెరికల్లాంటి సైనికులుగా తీర్చిదిద్దుతోంది. దీనిలోకి ప్రవేశం ఏటా రెండుసార్లు కల్పిస్తారు. యూపీఎస్‌సీ ఈ ప్రవేశపరీక్షను నిర్వహిస్తుంది. వీటికి సంబంధించిన ప్రకటనలు సాధారణంగా జనవరి, జూన్‌ నెలల్లో విడుదలవుతుంటాయి. ఎంపికైనవారికి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల్లో శిక్షణనిస్తారు. అవివాహిత అబ్బాయిలు మాత్రమే అప్లై చేసుకోవాలి. అమ్మాయిలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.

ఎంపికైన వారికి విద్య, శారీరక పరమైన శిక్షణను అందిస్తారు. మొదటి రెండున్నరేళ్లు మూడు విభాగాల వారికీ ఒకేరకమైన శిక్షణ ఉంటుంది. ట్రెయినింగ్‌ పూర్తి చేసుకున్నవారిలో ఆర్మీ కేడెట్లకు బీఎస్‌సీ/ బీఎస్‌సీ (కంప్యూటర్‌)/ బీఏ డిగ్రీనీ, నేవల్‌ కేడెట్లకు బీటెక్‌ డిగ్రీనీ, ఎయిర్‌ఫోర్స్‌ కేడెట్లకు బీటెక్‌/ బీఎస్‌సీ/ బీఎస్‌సీ (కంప్యూటర్‌) డిగ్రీని దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది.

ఎన్‌డీఏ శిక్షణ అనంతరం ఆర్మీ కేడెట్లు దేహ్రాదూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీకీ, నేవల్‌ కేడెట్లు ఎజిమాలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీకీ, ఎయిర్‌ఫోర్స్‌ కేడెట్లు హైదరాబాద్‌, బెంగళూరుల్లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ టెక్నికల్‌ కాలేజ్‌లకు వెళతారు. వీరు లఫె్టినెంట్‌ హోదాలను అందుకోడానికి ఏడాదిపాటు శిక్షణ పొందుతారు.

దరఖాస్తుకు ఎవరు అర్హులు?

ఎన్‌డీఏకు దరఖాస్తు చేయాలంటే.. ఆర్మీ వింగ్‌కు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్‌, నేవల్‌ వింగ్‌లకు ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌లు ప్రధాన సబ్జెక్టులతో పాసై ఉండాలి. 10+2 విధానంలో చదివివుండటం తప్పనిసరి. 10+2 విధానంలో పన్నెండు/ తత్సమాన పరీక్షలు రాయబోతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పదకొండు/ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నవారు అనర్హులు. అర్హులైన అభ్యర్థులు కమిషన్‌ సూచించిన శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.

16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు. అంటే.. జులై 2, 2001 నుంచి జులై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. అర్హతలుండి, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, జేసీఓ/ ఎన్‌సీఓ/ ఓఆర్‌ల పిల్లలకు దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను రెండు దశల్లో నిర్వహించే రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష: దీన్ని మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. ఇది ఆఫ్‌లైన్‌ పరీక్ష. రెండు పేపర్లుంటాయి. మేథమేటిక్స్‌ ఎబిలిటీ 300 మార్కులకూ, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 600 మార్కులకూ ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ఒక్కోదాని కాలవ్యవధి రెండున్నర గంటలు. పరీక్షను ఒకేరోజు నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి కేటాయించిన మార్కుల్లో 33% కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

ఇంటర్వ్యూ: రాతపరీక్షలో అర్హత పొందినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. దీనికి 900 మార్కులు కేటాయించారు. దీనిలోనూ రెండు దశలుంటాయి. స్టేజ్‌-1లో అర్హత సాధిస్తేనే స్టేజ్‌-2కు అనుమతిస్తారు. ఇవి సుమారుగా నాలుగు రోజుల వరకూ కొనసాగుతాయి.స్టేజ్‌-1లో ఆఫీసర్‌ ఇంటలిజెన్స్‌ రేటింగ్‌ (ఓఐఆర్‌), పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌ (పీపీ అండ్‌ డీటీ) పరీక్షలను నిర్వహిస్తారు.స్టేజ్‌-2లో..ఇంటర్వ్యూ, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్క్‌లు, సైకాలజీ టెస్ట్‌లు, కాన్ఫరెన్స్‌ ఉంటాయి. ఇవి నాలుగు రోజులపాటు సాగుతాయి. రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల్లో అర్హత సాధించినవారికి మెడికల్‌ ఫిట్‌నెస్‌, మెరిట్‌ కం ప్రిఫరెన్స్‌ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు.

(రాత పరీక్షలోని రెండు పేపర్లలో మేథమేటిక్స్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌ల్లోని వివిధ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ వివరాల కోసం www.eenadupratibha.net చూడవచ్ఛు)


తాజా నోటిఫికేషన్‌లో ఖాళీలు

మొత్తం 418. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ- 370 (ఆర్మీ- 208, నేవీ- 42, ఎయిర్‌ఫోర్స్‌ 120); నేవల్‌ అకాడమీ (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీం)- 48.


ముఖ్య తేదీలు

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: జనవరి 28, 2020

దరఖాస్తుల ఉపసంహరణ: ఫిబ్రవరి 2, 2020 నుంచి ఫిబ్రవరి 11, 2020 వరకు

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జనవరి 27, 2020

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 19, 2020

వెబ్‌సైట్‌: www.upsconline.nic.in 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని