నేవీలో ఉద్యోగాలు

పరిమిత కాల సేవల ప్రాతిపదికన ఇండియన్‌ నేవీ అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు అర్హులు. అకడమిక్‌ మార్కులతో అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు      

Updated : 23 Jun 2021 10:08 IST

పరిమిత కాల సేవల ప్రాతిపదికన ఇండియన్‌ నేవీ అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు అర్హులు. అకడమిక్‌ మార్కులతో అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారిని శిక్షణలోకి తీసుకుంటారు.  విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. 

జనరల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌)లో 47, హైడ్రోగ్రఫీలో 3 ఖాళీలు ఉన్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఐనెట్‌ నిర్వహించడం లేదు. అకడమిక్‌ ప్రతిభతో అభ్యర్థులను వడపోస్తారు. వీరికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కులతో పోస్టులకు ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలకు సన్నద్దమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో విజయం సాధించినవారికి నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో జనవరి 2022 నుంచి 44 వారాలపాటు తర్ఫీదునిస్తారు. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారికి లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. ప్రొబేషన్‌ వ్యవధి రెండేళ్లు. వీరు గరిష్ఠంగా 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగవచ్చు. 

అర్హత: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. 
వయసు: జనవరి 2, 1997 - జులై 1, 2002 మధ్య జన్మించి ఉండాలి.  
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 26 వరకు స్వీకరిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: జులైలో.
ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతా.  
వెబ్‌సైట్‌: https://www.joinindianavy.gov.in/

సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్లు
సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) 25 అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్‌ టెస్టులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులు పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.  

ముందుగా ఫిజికల్‌ స్టాండర్డ్‌ / ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో విజేతలైనవారి సర్టిఫికెట్లు పరిశీలించి, వైద్య పరీక్షల అనంతరం ఇంటర్వ్యూలు చేపడతారు. అన్ని దశల్లోనూ మెరుగైన ప్రతిభ చూపినవారిని విధుల్లోకి తీసుకుంటారు. వీరికి లెవెల్‌-10 హోదాతో రూ.56,100 మూల వేతనం అందుతుంది. 

పరీక్ష ఇలా..
ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1కు వంద మార్కులు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 50 ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ 15, రీజనింగ్‌ 10, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ 10, జనరల్‌ ఇంగ్లిష్‌ 15 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 2 గంటల వ్యవధి కేటాయించారు. పేపర్‌ 2 సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 300 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ఇంటర్వ్యూ కు వంద మార్కులు కేటాయించారు.  
దరఖాస్తులు: జూన్‌ 30 నుంచి మొదలవుతాయి. 

చివరి తేదీ: జులై 29 సాయంత్రం 6 వరకు. 
వెబ్‌సైట్‌: https//crpf.gov.in/index.htm


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని