బ్యాంకులో భలే అవకాశం!  

బ్యాంకు ఉద్యోగం.. డిగ్రీ అర్హత ఉన్న ఎందరో ఉద్యోగార్థుల కల.. సాధించదలిచిన లక్ష్యం! వీరికిప్పుడు ఐబీపీఎస్‌ శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్‌ ఉద్యోగాల భర్తీ 

Updated : 14 Jul 2021 09:58 IST

5000కు పైగా క్లర్కు కొలువుల భర్తీ 

బ్యాంకు ఉద్యోగం.. డిగ్రీ అర్హత ఉన్న ఎందరో ఉద్యోగార్థుల కల.. సాధించదలిచిన లక్ష్యం! వీరికిప్పుడు ఐబీపీఎస్‌ శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్‌ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష కోసం నోటిఫికేషన్‌ విడుదలయింది. ఎస్‌బీఐ మినహా 11 ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా 5 వేలకుపైగా ఖాళీలు భర్తీ అవనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో రాష్ట్రంలో 263 చొప్పున 526 పోస్టులున్నాయి. ఈ పోటీలో ముందు ఉండాలంటే ఏమేం గమనించాలి? పాటించాలి?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆంధ్రాబ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌లో విలీనమైన కారణంగా సహజంగానే ఆ బ్యాంకులోనే ఎక్కువ ఖాళీలు భర్తీ అవనున్నాయి. ఇతర బ్యాంకుల్లో చాలా తక్కువ ఖాళీలున్నాయి. అయితే పెద్ద బ్యాంకు.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలు ఆయా బ్యాంకుల్లోని ఖాళీల వివరాలను ఐబీపీఎస్‌కు ఇంకా నివేదించలేదు. కాబట్టి ఖాళీల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

బ్యాంకులో క్లర్కులుగా నియమితులైన అభ్యర్థులకు అలవెన్సులు కలుపుకుని ప్రారంభంలో నెలకు దాదాపు రూ.20 వేల వేతనం వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు వైద్యం, ఇతర సదుపాయాలుంటాయి. పదోన్నతుల విషయానికి వస్తే క్లర్క్‌గా కెరియర్‌ను ప్రారంభించినవారు ప్రస్తుతం పాటిస్తున్న ఫాస్ట్‌ట్రాక్‌ పదోన్నతుల ప్రక్రియ వల్ల తమ ప్రతిభ ద్వారా అంచెలంచెలుగా అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజర్, సీనియర్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ నుంచి జనరల్‌ మేనేజర్‌ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. 


ఫైనలియర్‌ వారికి వీలుంటుందా? 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 1, 2021 (దరఖాస్తు గడువు) లోగా గ్రాడ్యుయేషన్‌ పూర్తయి తుది ఫలితాలు వచ్చిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఫైనలియర్‌ విద్యార్థులకు పరీక్షలు పూర్తయినా ఫలితాలు ఆలోగా రాకపోతే దరఖాస్తుకు అవకాశం ఉండదు. 

ఎంపిక ఏ విధంగా?
బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే రెండంచెల రాత పరీక్షల ద్వారా (ప్రిలిమ్స్‌ అండ్‌ మెయిన్స్‌) భర్తీ చేస్తారు. వాటిలో ప్రిలిమ్స్‌ కేవలం అర్హత పరీక్ష. మెయిన్స్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. 

ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం మూడు విభాగాలుంటాయి. 100 ప్రశ్నలు, 100 మార్కులతో ఒక్కో విభాగానికి 20 నిమిషాలతో మొత్తం 60 నిమిషాల సమయం ఉంటుంది.  
మెయిన్స్‌ పరీక్షలో నాలుగు విభాగాలు. 190 ప్రశ్నలు 200 మార్కులు. మొత్తం నాలుగు విభాగాలూ కలిపితే 160 నిమిషాల సమయం ఉంటుంది.


సిలబస్‌ ఏమిటి?

ఈ పరీక్షకు నిర్దిష్టమైన సిలబస్‌ అంటూ ఏమీ లేకపోయినా ఆయా విభాగాల్లో ఏయే టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో గమనిస్తే తదనుగుణంగా ప్రిపేర్‌ అవ్వొచ్చు. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేట్‌ వేల్యూస్, నంబర్‌ సిరీస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, క్వాంటిటేటివ్‌ కంపేరిజన్స్‌ (క్యూ1-క్యూ2), డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, ఇతర అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ (పర్సంటేజి, రేషియో, ఏవరేజి, ప్రాఫిట్‌-లాస్, ఇంటరెస్ట్‌లు, టైమ్‌-వర్క్, టైమ్‌-డిస్టెన్స్, మెన్సురేషన్, ఎలిగేషన్, పర్ముటేషన్‌-కాంబినేషన్, ప్రాబబిలిటీ..) నుంచి ప్రశ్నలు వస్తాయి.

రీజనింగ్‌: దీనిలో సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్‌ నుంచి దాదాపు సగం ప్రశ్నలుంటాయి. ఆపై ఇనీక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరిక్‌ సీక్వెన్స్, కోడింగ్‌-డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, సిలాజిజమ్, డైరెక్షన్స్, డేటా సఫిషియన్నీ మొదలైన వాటితోపాటు మెయిన్స్‌ పరీక్షలో ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, లాజికల్‌ రీజనింగ్‌ (స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు) నుంచి ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్‌: ఈ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు రీడింగ్‌ కాంప్రహెన్షన్, క్లోజ్‌టెస్ట్‌ల నుంచి వస్తాయి. ఆపై గ్రామర్‌ ఆధారిత ప్రశ్నలైన ఫిల్లింగ్‌ ద బ్లాంక్స్, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్, ఫ్రేజల్‌ అరేంజ్‌మెంట్, సెంటెన్స్‌ కరెక్షన్స్, ఎర్రర్‌ ఫైండింగ్స్‌ మొదలైనవి ఉంటాయి. ఈ విభాగంలో నూతన తరహా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వీటితోపాటు సిననిమ్స్, యాంటనిమ్స్‌ కూడా ఉంటాయి. 

జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌: దీనిలో బ్యాంకింగ్, ఆర్థిక సంబంధ విషయాలకు ప్రాధాన్యమిస్తూ తాజా విషయాలపై (కరెంట్‌ అఫైర్స్‌) ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు 5, 6 నెలల ముందు విషయాలు అడిగే అవకాశం ఎక్కువ. వీటితోపాటుగా ప్రాధాన్యమున్న అంతర్జాతీయ విషయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, పుస్తకాలు-రచయితలు, వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, క్రీడలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ముఖ్యమైన దేశీయ, అంతర్జాతీయ దినోత్సవాల నుంచి ప్రశ్నలుంటాయి. 


కటాఫ్‌?

 గతంలో జరిగిన పరీక్షల్లో అర్హత సాధించడానికి ఎన్ని మార్కులు రావాలో తెలిపే కటాఫ్‌ మార్కులు తెలిస్తే ప్రస్తుతం ఎన్ని మార్కులు రావాలో అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ప్రిపరేషన్‌లో మార్పులు చేసుకోవచ్చు.  ఈ కటాఫ్‌ మార్కులు రాష్ట్రాలవారీగా ఉండే ఖాళీలు, పోటీపడే అభ్యర్థుల సంఖ్యతోపాటుగా పరీక్ష కాఠిన్యతా స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి జరగబోయే పరీక్షలో కటాఫ్‌ మార్కులు గతంలో ఉన్న విధంగానే ఉంటాయని చెప్పలేం. కానీ ఎలా ఉంటాయనే అవగాహన కోసం ఇవి ఉపయోగపడతాయి.


ఇలా సిద్ధం కావాలి

ఎంత వేగంగా ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుసుకోవడానికి మోడల్‌ పేపర్లు రాయాలి. అప్పుడే నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు రాయగలుగుతున్నారో తెలుసుకుంటూ ప్రిపరేషన్‌లో తగిన మార్పులు చేస్తూ కొనసాగించే వీలు కలుగుతుంది. 

ప్రిలిమ్స్‌ పరీక్షకు దాదాపు 45 రోజుల సమయం, మెయిన్‌ పరీక్షకు దాదాపు మూడున్నర నెలల సమయం ఉంది. ఈ రెండు పరీక్షల్లోనూ జనరల్‌ అవేర్‌నెస్‌ మినహా ఒకటే విభాగాలున్నాయి. కాబట్టి ప్రిపరేషన్‌ కూడా ఉమ్మడిగానే రెండింటికీ కలిపి ఉండాలి. 

ప్రిలిమ్స్‌లో ఉండే మూడు విభాగాలకూ మెయిన్స్‌ స్థాయి సన్నద్ధత ఉండాలి. 
ఈ పరీక్షపై ఎలాంటి అవగాహన లేకుండా మొదటిసారిగా పరీక్ష రాసే అభ్యర్థులు ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) నేర్చుకోవడం నుంచి ప్రారంభించాలి. 
☞ ముఖ్యంగా అరిథ్‌మెటిక్, రీజనింగ్‌లలోని టాపిక్‌ల కాన్సెప్ట్‌లు నేర్చుకుంటూ తేలిక, మధ్యస్థ స్థాయి నుంచి హెచ్చు స్థాయిలో ఉండే ప్రశ్నలు బాగా సాధన చేయాలి. 
ముందుగా టాపిక్స్‌ నేర్చుకోవడంపై దృష్టి ఉంచుతూ ఆపై ప్రశ్నలు వేగంగా సాధించేలా సాధన చేయాలి. అలా వేగంగా సాధించే వివిధ పద్ధతులను నేర్చుకోవాలి. 
ప్రిపరేషన్‌లో ఏ మాత్రం అలసత్వం పనికిరాదు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకే విధమైన ఉత్సాహాన్ని కొనసాగించాలి. 
అభ్యర్థుల ఈ ప్రిపరేషన్‌ త్వరలో రాబోయే ఐబీపీఎస్‌ పీఓ, ఎస్‌బీఐ పీఓ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. 

- డా. జీఎస్‌ గిరిధర్, డైరెక్టర్, RACE


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని