ఐఐఎస్సీలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

విఖ్యాత విద్యా సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), బెంగళూరు 100 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇలా ఎంపికైన వారికి లెవెల్‌-3 వేతనాలు చెల్లిస్తారు. ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం...

Published : 15 Feb 2022 01:02 IST

విఖ్యాత విద్యా సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), బెంగళూరు 100 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇలా ఎంపికైన వారికి లెవెల్‌-3 వేతనాలు చెల్లిస్తారు. ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం...

టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు గ్రూప్‌ సి కిందికి వస్తాయి. ఎంపికైన వారు రెండేళ్లు ప్రొబేషన్‌లో ఉంటారు. అనంతరం వీరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. విధుల్లో చేరినవారికి కేంద్ర ప్రభుత్వ లెవెల్‌ 3 ప్రకారం రూ.21,700 మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు అదనంగా ఉంటాయి. అంటే ఈ పోస్టులో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.35,000 వేతనం పొందవచ్చు. వీరు విశ్వవిద్యాలయానికి సంబంధించి సాంకేతిక సేవల్లో పాలుపంచుకుంటారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.  

ఎంపిక విధానం

జాబ్‌ ఓరియంటెడ్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో ఎంపిక చేస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ ఎకు 80, పేపర్‌ బికు వంద మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్‌ వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున రెండు పేపర్ల నుంచి మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి.

పేపర్‌ ఎ: లాజికల్‌ రీజనింగ్‌ 20, న్యూమరికల్‌ రీజనింగ్‌ 20, వెర్బల్‌ రీజనింగ్‌ అండ్‌ నాలెడ్జ్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 20, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి.

పేపర్‌ బి: మ్యాథ్స్‌ నుంచి 20 ఉంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజినీరింగ్‌, బేసిక్‌ కంప్యుటేషన్‌ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ ఐదు విభాగాల్లో ఏవైనా రెండు సబ్జెక్టులను ఎంచుకుని వాటికి సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఆయా విభాగాలవారీ సిలబస్‌ (ప్రశ్నలడిగే అంశాల) వివరాలను ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు వాటిపై దృష్టి సారిస్తే చాలు. పేపర్‌ ఎ ప్రశ్నలకు ఇప్పటికే బ్యాంకు, రైల్వే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు సులువుగానే ఎదుర్కోవచ్చు. పేపర్‌ బి కోసం సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. ఇంటర్‌ ఎంపీసీ నేపథ్యం ఉన్నవాళ్లు పేపర్‌ బి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికే.


ఖాళీల వివరాలు: మొత్తం 100. పోస్టుల్లో విభాగాలవారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 42, ఓబీసీ 25, ఎస్సీ 16, ఎస్టీ 7, ఈడబ్ల్యుఎస్‌ 10 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో దివ్యాంగులకోసం 4 పోస్టులు రిజర్వ్‌ చేశారు.
అర్హత: 55 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ/బీఆర్క్‌/బీఎస్సీ/బీసీఏ/బీవీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: ఫిబ్రవరి 28 నాటికి 26 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు: దివ్యాంగులకు పదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.500. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28

వెబ్‌సైట్‌: https://iisc.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని